చంద్రబాబు ‘ఇన్‌ఫ్లుయెన్సర్స్ పాలసీ’పై భగ్గుమంటున్న రాష్ట్రం
మేనిఫెస్టో.. సూపర్‌సిక్స్ మోసమని నిరూపించారు..
20లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతికి నీళ్లొదిలేశారు
ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పింఛన్ అటకెక్కించారు
పొదుపు మహిళల సున్నావడ్డీ లేక రూ.10 వేల కోట్లు నష్టం
విద్యాదీవెన, వసతి దీవెన బకాయిల మాటేలేదు
ఈ మోసాలన్నీ దాచి.. కోట్లు కుమ్మరించి ప్రచారం చేస్తారా?
ఒక్కో ఇన్‌ఫ్లుయెన్సర్‌కు నెలనెలా రూ.1.50లక్షలిస్తారా?
ఈ పేరుతో మీ కార్యకర్తల జేబులు నింపేందుకేనా ఈ పాలసీ
ఇప్పటికే డిజిటల్ కార్పొరేషన్ యువగళ దళంతో నిండిపోయింది
రెండేళ్లలో రూ.160 కోట్లకు పైగా మేసేశారు
ఇపుడు ఇన్‌ఫ్లుయెన్సర్స్ పాలసీతో ఎన్ని వందల కోట్లు తగలేస్తారు?
చంద్రబాబు సర్కార్‌ను నిలదీస్తున్న యువకులు, మహిళలు, ఉద్యోగులు
ముఖ్యమంత్రిగారూ.. 20 లక్షల ఉద్యోగాలన్నారు.. లేదంటే నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3,000 చొప్పున ఇస్తానన్నారు. రెండున్నరేళ్లలో రూ.90 వేలు ఎగ్గొట్టారు. ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఈ మోసాన్ని ప్రచారం చేయడానికేనా? ఓ నిరుద్యోగి ప్రశ్న ఇది.
ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18వేలు ఇస్తానన్నారు. రెండున్నరేళ్లలో రూ. 45 వేలు ఎగ్గొట్టారు. సోషల్ మీడియాలో ఈ మోసాన్ని ఎలా ప్రచారం చేయించబోతున్నారు? 18 ఏళ్లు నిండిన ఓ యువతి ప్రశ్న ఇది.
50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పించన్లన్నారు. ఈ రెండున్నరేళ్లలో రూ. 1,20,000 ఎగ్గొట్టారు. ఈ వంచనను ఎలాంటి వీడియోలతో పాపులర్ చేయబోతున్నారు? 50 ఏళ్లు దాటిన అనేకమంది వేస్తున్న ప్రశ్న ఇది.
ఐదు డీఏలు పెండింగ్.. పీఆర్‌సీ లేదు, ఐఆర్ లేదు.. రూ. 40వేల కోట్లకు పైగా పెండింగ్.. అధికారంలోకి రాగానే అమలుచేస్తానని అనేక వాగ్దానాలు చేశారు.. మోసపోయాం.. ఈ అన్యాయాన్ని ఎలా ప్రెజెంట్ చేయబోతున్నారు? ఓ ప్రభుత్వ ఉద్యోగి ప్రశ్న ఇది.
సాక్షి, అమరావతి: రెండున్నరేళ్లయింది. యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వడానికి మనసు రావడం లేదు. 18 ఏళ్లు నిండిన మహిళలకు ఆడబిడ్డ నిధి అమలు చేయడానికి, 50 ఏళ్లు నిండిన వాళ్లకు పెన్షన్ ఇవ్వడానికి చేతులు రావడం లేదు. ఉద్యోగుల బకాయిలకు దిక్కులేదు. సున్నావడ్డీ పథకానికి సున్నా చుట్టేయడంతో డ్వాక్రా మహిళల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. విద్యాదీవెన, వసతి దీవెన బకాయిల ఊసెత్తకపోవడంతో విద్యార్థులు చదువులు మానేయాల్సిన పరిస్థితి. లేదా అప్పులు చేసి కట్టాల్సివస్తోంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు.. సూపర్‌సిక్స్, సూపర్ సెవన్ వాగ్థానాలన్నీ అటకెక్కాయి. ఇచ్చిన హామీలే కాదు.. గత ప్రభుత్వం ఇచ్చిన అనేక పథకాలకు నీళ్లొదిలేశారు. ‘ఎంత మోసగాడివయ్యా బాబూ’ అని జనం చర్చించుకుంటున్నారు. సంపదసృష్టిస్తానంటూ బీరాలు పలికి లక్షల కోట్ల అప్పులతో బండి నడిపిస్తూ అదేదో గొప్ప విజనరీ పరిపాలనలా ఎల్లో మీడియాలో ప్రచారం చేయించుకోవడం.. ‘వాట్ ఎ థాట్.. వాట్ ఏ విజన్’.. పాలన పాతాళంలో... ప్రచారం మాత్రం ఆకాశంలో... చేయనిది చేసినట్టు చెప్పుకోవడంలో చంద్రబాబును మించినవారెవరూ లేరు. ఇప్పటికే సాగుతున్న ఈ బూటకపు ప్రచారాన్ని ఇంకా కొత్త ఎత్తులకు తీసుకెళ్లడం కోసం చంద్రబాబు సర్కార్ కొత్త కొత్త మార్గాలను వెతుకుతోంది. కొత్తగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో సొంత డబ్బా కొట్టించుకునేందుకు ఓ పాలసీ తెచ్చారు. ఇందుకోసం కోట్లు కోట్లు కుమ్మరించబోతున్నారు. అంటే ఐటీడీపీ వంటి ఆన్‌లైన్ పసుపు దళానికి దీపావళి ముందుగానే వచ్చేసిందన్నమాట. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే ఆ ముసుగులో తెలుగుదేశం పార్టీ కోసం సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం జోరుగా చేస్తున్న వారి కోసమే ఈ పాలసీ. వాళ్లకు ప్రజాధనాన్ని దోచిపెట్టడానికే ఈ పాలసీ. ఎంపిక చేసిన ఒక్కో ఇన్‌ఫ్లుయెన్సర్‌కు నెలకు రూ.1.5 లక్షల వరకు ఇవ్వబోతున్నారంటే అర్ధం చేసుకోవచ్చు ప్రజాధనాన్ని ఏ స్థాయిలో దుర్వినియోగం చేయబోతున్నారో..
భగ్గుమంటున్న రాష్ట్రం..
ఎన్నికల మేనిఫెస్టోలో అలవిమాలిన హామీలిచ్చిన చంద్రబాబు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పథకాలు ఎగ్గొట్టి దాదాపు రూ.2,06,744.46 కోట్లకు పైగా పంగనామం పెట్టడంపై రాష్ట్రప్రజలు రగిలిపోతున్నారు. ఈ మోసాలపై ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఏం ప్రచారం చేస్తారని నిలదీస్తున్నారు. హామీ ఇచ్చిన పథకాలకు దిక్కులేదు కానీ ప్రచారం కోసం కోట్లు కోట్లు ప్రజాధనం వ్యయం చేస్తుండటం మరింత ఆగ్రహావేశాలను రగిల్చింది. చేసిందేమీ లేకపోయినా ప్రచారం కోసం కొత్తగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ పాలసీ తీసుకురావడంపై నిరుద్యోగులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పథకాలకు డబ్బులు లేవంటూనే ప్రచారం కోసం కోట్లు కుమ్మరిస్తుండడంపై మండిపడుతున్నారు. ముందు మాకిచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 
ఎంత ప్రచారం చేస్తే అంత డబ్బు..
ఇప్పటికే ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా సోషల్‌మీడియా ప్రచారానికి కోట్లు ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను పెద్ద ఎత్తున వినియోగించుకోవడానికి రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనల ముందు ఇన్‌ఫ్లుయెన్సర్స్ ద్వారా ప్రచారం నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వీరిని మరింత విస్తృతంగా వినియోగించుకోవడానికి ఏకంగా ఒక పాలసీనే తీసుకువచ్చింది. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ పాలసీ(ఎస్‌ఎంఐఎస్)కి ఆమోదముద్ర వేసింది. ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్) వంటి సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను గుర్తించి వారి చేత ప్రచారం చేయించడానికి కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేయనున్నారు. డిజిటల్ ప్రచారం, ప్రజా సమాచారాన్ని బలోపేతం చేయడానికి సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లతో సమావేశాలు నిర్వహించి ఆంధ్రప్రదేశ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పాలసీ ముసాయిదాను రూపొందించనున్నట్లు మంత్రి కొలుసు పార్థసారధి ప్రకటించారు. ఈ పాలసీ కింద లక్ష మందికిపైగా ఫాలోయర్స్ ఉన్నవారు వారే స్వయంగా ఒక వీడియో తయారు చేస్తే రూ15,000 చెల్లిస్తారు. అదే ఫాలోవర్స్ సంఖ్య 50,000 నుంచి లక్షలోపు ఉంటే రూ.7,500, ఫాలోవర్స్ 25,000 నుంచి 50వేలు లోపు ఉంటే రూ.5,000, 10వేల నుంచి 25వేల లోపు ఫాలోవర్స్ ఉంటే రూ.2,500 ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించారు. అదే ప్రభుత్వమే కంటెంట్ ఇస్తే రూ.500 నుంచి రూ.1,500 వరకు చెల్లిస్తారు. ఈ విధంగా ఒకొక్క ఇన్‌ఫ్లుయెన్సర్‌కు గరిష్టంగా నెలకు రూ.1.50 లక్షలు చెల్లించనున్నారు. ఇందుకోసం విశ్వసనీయ ఇన్‌ఫ్లుయెన్సర్లను గుర్తించి, ధ్రువీకరించి వీరందరినీ ఎంప్యానల్ చేసి తొలుత ఏడాదిపాటు వినియోగించుకుంటామని, ఆపైన అవసరమైతే మరో రెండేళ్లు వినియోగించుకుంటామని తెలిపారు.
టీడీపీ కార్యకర్తలకు ఉపాధి కోసమే..
లోకేశ్ యువగళం పాదయాత్రలో పనిచేసిన టీడీపీ కార్యకర్తలకు ఉపాధి కల్పించడానికి ఏపీ డిజిటల్ కార్పొరేషన్‌ను అడ్డంగా వాడుకుంటున్నారు. కార్యకర్తలను భారీ వేతనాలతో ఏపీ డిజిటల్ కార్పొరేషన్‌లో నియమించుకున్నారు. సోషల్ మీడియా ప్రత్యేక అధికారి, కంటెంట్ డెవలపర్స్, అనలిస్టులు, డిజిటల్ ప్రచారకులు పేరిట 85 మందికిపైగా ఔట్‌సోర్సింగ్ విధానంలో నియమించుకొని వీరికి నెలకు రూ.25 వేల నుంచి రూ.1.75 లక్షల వరకు వేతనాలు చెల్లిస్తున్నారు. వీరికి అదనంగా ప్రతీ మంత్రి పేషిలో జరిగే కార్యకలాపాలు తక్షణం తెలుసుకోవడానికి 48 మంది సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్‌ను నియమించారు. వీరంతా ఆ మంత్రిత్వ శాఖలో జరిగే కార్యక్రమాలు కాకుండా ప్రతిపక్షాలను విమర్శిస్తూ పోస్టింగ్‌లు, కథనాలను తయారు చేస్తుంటారు. గత రెండేళ్ల కాలంలో కేవలం సోషల్ మీడియా కార్యకర్తల కోసమే సుమారు రూ.160 కోట్ల వరకు ప్రజాధనం వ్యయం చేయడం గమనార్హం. ఇప్పుడు దీనికి అదనంగా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను నియమించుకొని మరిన్ని వందల కోట్లు దోచిపెట్టడానికి రంగం సిద్ధం చేస్తోంది.
అబద్ధపు ప్రచారానికి ప్రజల సొమ్మా?
చంద్రబాబు ఎన్నికల వాగ్దానాన్ని నమ్మి పింఛన్ కోసం ఎదురు చూస్తున్న 50 ఏళ్లు దాటినవారు చాలా మంది ఉన్నారు. అటువంటి వారందరికీ మొండిచేయి చూపించి సోషల్ మీడియా వారికి నెలనెలా లక్షలకు లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా దుర్మార్గం. మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం గొప్పగా పనిచేస్తోందంటూ సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం చేసేవారికి ప్రజల సొమ్మును ధారాదత్తం చేస్తున్నారంటే ఇంతకంటే అన్యాయం ఎక్కడా ఉండదు.
– గుణ్ణం రామకృష్ణ, కొత్తూరు, రామచంద్రపురం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
హామీలకు దిక్కులేదు కానీ..
హామీలు అమలు చేసేందుకు ఖజానాలో సొమ్ములేదని చంద్రబాబు చెబుతున్నారు. టీడీపీ అనుకూల సోషల్ మీడియా యాక్టివిస్టులకు లబ్ధి చేకూర్చేందుకు జీఓ జారీచేశారు. ప్రజాధనంతో ప్రచారానికి తెరతీశారు. ఇదెక్కడి అన్యాయం. నిరుద్యోగ భృతి లేదు. ఆడబిడ్డ నిధి లేదు. పింఛన్లు లేవు. పార్టీ అనుకూల వర్గాలకు లబ్ధిచేకూర్చడాన్ని ప్రజలు గమనిస్తున్నారు.
– రాజేంద్రనాయుడు, పొట్లి గ్రామం, విజయనగరంజిల్లా
మీ కార్యకర్తలకు దోచిపెట్టేందుకేనా..
చంద్రబాబు ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచారు. హామీలను అటకెక్కించారు. రాజకీయ లబ్ధి కోసమే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పేరుతో ఐటీడీపీ కార్యకర్తలకు భారీగా నిధులు దోచిపెట్టేందుకు సిద్ధమయ్యారు. నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు. ఆడబిడ్డ నిధిలేదు. 50 ఏళ్లకే పింఛన్ లేదు. కానీ సోషల్ మీడియా పేరుతో ఏ విధంగా డబ్బులు ఇస్తారు?
– గాతల సందీప్, జువ్వలపాలెం, పశ్చిమగోదావరి జిల్లా
సొంత డబ్బాకు... ప్రజాధనమా....!
బాబు సర్కార్ సొంత ప్రచారం కోసం ప్రజాధనాన్ని వెచ్చించేందుకు మరో ఎత్తు వేసింది. స్థానిక ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా ఇన్‌ప్లూయన్సర్స్ పాలసీ అంటూ సరికొత్త డ్రామాకు తెరలేపారు. ఇది కేవలం టీడీపీ కార్యకర్తలకు ప్రజాధనాన్ని ధారాదత్తం చేసేందుకు పన్నిన కుట్ర. రాష్ట్రంలో నిరుద్యోగులు రోడ్డున పడి అల్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండన్నరేళ్లు గడిచినా నిరుద్యోగ భృతి ఊసే లేదు. ఆడబిడ్డ నిధి అంటూ ప్రగల్భాలు పలికి మహిళలను నిలువునా ముంచేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు 50ఏళ్లకే పింఛ¯న్ మాటే ఎత్తడంలేదు. ఇంతదారుణంగా ఇచ్చిన హామీలకు తిలోదకాలు వదిలి, టీడీపీ కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు ఇన్‌ఫ్లూయన్సర్ పాలసీని తెస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలను నమ్మించే ప్రయత్నం తప్ప ప్రజలకు ఒరిగేది ఉండదు.
– సుందరరాజు, నేషనల్ లా స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు, తిరుపతి


