స్థానిక ఎన్నికల్లో అడ్డదారుల్లో గెలిచేందుకు కుట్రలు చేస్తారు
ఎదుర్కొనేందుకు అంతా సిద్ధంగా ఉండండి
బలమైన అభ్యర్థులను వేగంగా గుర్తించండి.. వారినే నిలబెట్టండి.. పార్టీలో అందరితో మాట్లాడి అభిప్రాయాలు తీసుకోండి
పలు దఫాలుగా చర్చించిన తర్వాతే అభ్యర్థుల జాబితా రూపొందించండి
ఈ ఎంపికలో మన నిర్ణయాలు రేపు ఎన్నికల్లో ఉపయోగపడాలి
పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ దిశానిర్దేశం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసుల బలాన్ని ఉపయోగించుకుని అడ్డదారుల్లో గెలిచేందుకు సీఎం చంద్రబాబు ఎన్నో కుట్రలు చేస్తారని, వాటన్నింటినీ ఎదుర్కొనేందుకు అంతా సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లతో ఆయన సమావేశమయ్యారు.
ప్రజా సమస్యలపై పోరాటాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నుంచి బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని, వీలైనంత వేగంగా ఆ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని నిర్దేశించారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..
అందరి అభిప్రాయంతో అభ్యర్థుల ఎంపిక
రాష్ట్రంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపాలి. వీలైనంత వేగంగా ఆ అభ్యర్థుల ఎంపిక పూర్తి కావాలి. అభ్యర్థుల ఎంపికలో మనం తీసుకునే నిర్ణయాలు రేపు వచ్చే ఎన్నికల్లో ఉపయోగపడాలి. పార్టీలో అందరితో మాట్లాడి అభిప్రాయాలు తీసుకోండి. పలు దఫాలుగా వారితో చర్చించి అభ్యర్థుల జాబితా రూపొందించండి. పార్టీని ఒక్కతాటిపైకి తీసుకు వచ్చి ఎన్నికల్లో ముందుకు నడపాలి. ఎప్పటికప్పుడు స్థానిక నాయకత్వాన్ని పర్యవేక్షిస్తూ బలోపేతం చేయాలి.
అవన్నీ ప్రజల్లో గట్టిగా ఎండగట్టాలి
‘రాష్ట్రంలో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు పోలీసుల బలాన్ని ఉపయోగించుకోవడంతో పాటు అడ్డదారులతో సీఎం చంద్రబాబు ఎన్నో కుట్రలు చేస్తారు. వాటన్నింటినీ ఎదుర్కోవడానికి మీరంతా సిద్ధంగా ఉండాలి. అందుకోసం ఎక్కడికక్కడ ప్రత్యామ్నాయాలు ఉంచుకోవాలి. అలాగే ఈ రెండున్నరేళ్ల చంద్రబాబు పాలనలో వైఫల్యాలు, మోసాలు, వెన్నుపోట్లను ప్రజలకు గట్టిగా వివరించాలి.
వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న దారుణాలనూ ప్రస్తావించాలి. వీటన్నింటితో పాటు, చంద్రబాబు పాలన వల్ల ప్రజలకు జరిగిన నష్టాలను, కష్టాలను సమగ్రంగా చెప్పాలి’ అని వైఎస్ జగన్ నిర్దేశించారు. వైఎస్సార్‌సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్లు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాలనాయుడు, పీవీ మిథున్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.


