ఆడుకుంటుండగా ఎర్త్ వైర్ తగిలి ఇద్దరు విద్యార్థులు..
రోడ్డుపై తెగిపడిన విద్యుత్ వైరు తగిలి మహిళ.. ఆమెను కాపాడబోయి ఆమె కుమారుడు..
ఇద్దరూ ఘటనా స్థలంలోనే మృత్యువాత
తెగిపడిన వైర్ తగిలి బాలింత.. ఆమెను కాపాడబోయిన తల్లీ మృతి
వీరిని కాపాడబోయిన మామ, అల్లుడికి గాయాలు
పెంటపాడు/నాతవరం/బాపట్ల టౌన్: పశ్చిమగోదావరి, బాపట్ల, అనకాపల్లి జిల్లాల్లో గురువారం విద్యుదాఘాతంతో ఆరుగురు మృత్యువాతపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం జట్లపాలెంలోని కొత్తపేటలో 8వ తరగతి చదువుతున్న గండికోట సూర్యప్రకాష్(13), 6వ తరగతి చదువుతున్న సూతని సాయి అఖిల్(11) గురువారం వారి ఇళ్లకు సమీపంలోని కొండేటి ప్రసాద్ ఇంటి వద్ద ఆడుకుంటూ అక్కడున్న ఎర్త్ వైర్‌ను తాకడంతో విద్యుత్ షాక్‌కు గురయ్యారు. గమనించిన బంధువులు హుటాహుటిన తాడేపల్లిగూడెంలోని ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
పిల్లల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. బాపట్ల జిల్లా చెరువు ఉప్పరపాలెం గ్రామంలో ముద్రబోయిన రమాదేవి(50) గురువారం ఉదయం సరుకులు తెచ్చుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అప్పటికే విద్యుత్ స్తంభం నుంచి తెగిపడిన వైరును గమనించని ఆమె నడుస్తూ వెళ్లి ఆ వైరును తొక్కడంతో షాక్‌కు గురై కుప్పకూలింది.
తల్లి రోడ్డుపై పడి ఉండటాన్ని గమనించిన ఆమె చిన్న కుమారుడు ముద్రబోయిన వెంకటేశ్వర్లు (28) వచ్చి పైకి లేపేందుకు ప్రయత్నిస్తూ అతను కూడా విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. ఇద్దరూ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతురాలు రమాదేవికి భర్త సాంబయ్య, మరో కొడుకు ఉన్నారు. మృతుడు వెంకటేశ్వర్లుకు భార్య తేజ, నాలుగేళ్ల కుమారుడు, మూడేళ్ల కుమార్తె ఉన్నారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెగిన వైర్ తగలడంతో..
అనకాపల్లి జిల్లా నాతవరంలో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకున్న విద్యుదాఘాతంతో తల్లి, కుమార్తె మృతి చెందగా.. మామ, అల్లుడు గాయపడ్డారు. గ్రామంలో గొంప చిన్నబ్బాయి (అప్పారావు) ఇంట్లో ఈ దుర్ఘటన జరిగింది. నాతవరం ఎస్‌ఐ వై.తారకేశ్వరరావు తెలిపిన మేరకు.. తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో చిన్నబ్బాయి కుమార్తె రొంగలి జానకి (28) ఇంట్లో బాత్‌రూమ్‌కు వెళ్లింది. భారీ వర్షం కారణంగా విద్యుత్ సర్వీసు వైరు తెగిపోయింది. చీకట్లో ఆమెకు ఆ వైరు తగలడంతో షాక్ కొట్టి కేకలు వేసింది.
ఈ కేకలు విన్న జానకి తల్లి గొంప మంగ (58) పరుగెత్తుకెళ్లి పడిపోయి ఉన్న కుమార్తెను పట్టుకుని ఆమె కూడా విద్యుదాఘాతానికి గురై కేకలు వేస్తూ పడిపోయింది. జానకి భర్త రొంగలి నాగరాజు వెళ్లి వాళ్లను కాపాడేందుకు కర్రతో విద్యుత్ వైర్లు తొలగించే ప్రయత్నం చేస్తూ.. ఆయన కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు. మంగ భర్త చిన్నబ్బాయి కూడా కర్ర సాయంతో విద్యుత్ వైర్లు తొలగించాలని ప్రయత్నించి షాక్‌కు గురయ్యాడు. ఆ ఇంట్లోంచి పెద్దగా కేకలు వినిపిస్తుండటంతో పక్కింట్లోని అంకంరెడ్డి కుమారి విద్యుత్ కార్యాలయానికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వెంటనే విద్యుత్ సరఫరా నిలిపేశారు.
ఎస్‌ఐ వై.తారకేశ్వరరావు సిబ్బందితో అక్కడికి చేరుకుని బ్యాటరీ లైట్ల వెలుగులో పరిశీలించారు. అప్పటికే మంగ, జానకి మరణించారు. తీవ్ర గాయాలతో అపస్మారకస్థితిలో ఉన్న నాగరాజుకు సీపీఆర్ చేశారు. దీంతో కదలిక వచ్చిన అతడిని 108లో నాతవరం పీహెచ్‌సీకి, అనంతరం మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి పంపించారు. చిన్నబ్బాయిని కూడా ఆస్పత్రికి తరలించారు. కాగా, మంగకు ఇద్దరు పిల్లలు. కుమారుడు రాజేష్, కుమార్తె జానకి.
విజయనగరం జిల్లా కొత్తవలస ఎస్‌ఐగా పనిచేస్తున్న రాజేష్.. తల్లి, చెల్లి మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్నబ్బాయి, ఇతర కుటుంబసభ్యుల రోదన అందరికంట తడిపెట్టించింది. జానకి 15 రోజులు కిందట రెండోసారి మగబిడ్డకు జన్మనిచ్చింది. భార్యను, కుమారుడిని చూసేందుకు మాకవరపాలెం మండలం తమ్మయ్యపాలెం నుంచి నాగరాజు అత్తగారింటికి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ దుర్ఘటన జరిగింది.


