భారత నేవీకి భారీ 'సపోర్ట్‌' | First Fleet Support Ship to be launched on October 6th | Sakshi
Sakshi News home page

భారత నేవీకి భారీ 'సపోర్ట్‌'

Sep 25 2026 4:28 AM | Updated on Sep 25 2026 4:28 AM

First Fleet Support Ship to be launched on October 6th

ఎఫ్‌ఎస్‌ఎస్‌–1కి ప్రొపెల్లర్‌ నిర్మాణ పనులు

అక్టోబర్‌ 6న జలప్రవేశం చెయ్యనున్న తొలి ఫ్లీట్‌ సపోర్ట్‌ షిప్‌

యుద్ధ నౌకలు పోర్టుకు తిరిగి రాకుండా నిరంతర సరఫరాలు

నడిసముద్రంలోనే సకాలంలో నిత్యావసరాలు

నేవీకి నీరు, ఆహారంతోపాటు ఇంధనం, ఆయుధాలు అందజేత 

మరో చారిత్రిక ఘట్టానికి సిద్ధమవుతున్న విశాఖ షిప్‌యార్డ్‌

సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళ సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేసే ప్రతిష్టాత్మక ఫ్లీట్‌ సపోర్ట్‌షిప్‌ (ఎఫ్‌ఎస్‌ఎస్‌) ప్రాజెక్టులో అత్యంత కీలక ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఎస్‌ఎల్‌)లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంటున్న తొలి భారీ యుద్ధనౌక ‘ఎఫ్‌ఎస్‌ఎస్‌–1’ అక్టోబర్‌ 6న జలప్రవేశం (ఫ్లోట్‌అవుట్‌) కానుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉంది.

సంక్లిష్ట ప్రొపెల్లర్‌ అమరికలో చరిత్ర
నౌకను సిద్ధం చేయడంలో భాగంగా, షిప్‌యార్డ్‌ ఇంజనీర్లు అసాధా­రణ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. నౌకను వేగంగా ముందుకు నడిపేందుకు కీల­క­మైన ప్రొపెల్లర్‌ సిస్టమ్‌ని అత్యంత ఖచ్చి­తత్వంతో అమర్చారు. టెయిల్‌ షాఫ్ట్, కంట్రోలబుల్‌ పిచ్‌ ప్రొపెల్లర్‌ బ్లేడ్లతో కూడిన ఈ మొత్తం అసెంబ్లీ బరువు ఏకంగా 81 టన్నులు. 7 మీటర్ల వ్యాసం ఉండే ఈ ప్రొపెల్లర్‌లో ఒక్కొక్కటి 7 టన్నుల బరువుండే నాలుగు బ్లేడ్లను విజయవంతంగా బిగించారు. ఇంతటి భారీ యంత్ర భాగాలను నౌక కింద అమర్చడం సాధారణ విషయం కాదు.  

నౌక కింద ఉండే హల్‌ స్ట్రక్చర్‌­కు, బ్లేడ్‌ తిరిగే ప్రదేశమైన స్వీప్‌ సర్కమ్‌­ఫరెన్స్‌కు మధ్య కేవలం 40 సెం.మీ ఖాళీ మాత్రమే ఉంది. ఏ చిన్న పొరపాటు జరిగి­నా మొత్తం అసెంబ్లీ దెబ్బతింటుంది, మళ్లీ అమర్చ­డాని­కి ఆస్కారం ఉండదు. కానీ, ఇంజనీర్లు ప్రతి మిల్లీమీ­టర్‌ను లెక్కవేసు­కుంటూ, ఎలాంటి లోపం లేకుండా ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశా­రు. గతంలో 36 టన్నుల ప్రొపెల్లర్లను అమర్చిన హెచ్‌­ఎస్‌ఎల్‌..  ఈసారి తొలిసారిగా ఏకంగా 81 టన్ను­ల అసెంబ్లీని అమర్చి తన పాత రికార్డులను తానే తిరగరాసింది.

నిరంతరాయంగా శత్రువులపై నిఘా
భారత రక్షణ మంత్రిత్వ శాఖ నౌకాదళం కోసం సుమారు రూ.19,000 కోట్ల వ్యయంతో 5 ఫ్లీట్‌ సపోర్ట్‌ షిప్‌లని నిర్మించే బాధ్యతను 2023 ఆగస్టులో హెచ్‌ఎస్‌ఎల్‌ దక్కించుకుంది. సుమారు 44 వేల టన్నుల బరువు, 225 మీటర్ల పొడవుండే ఈ భారీ నౌకలు యుద్ధ సమ­యా­ల్లోనూ, సుదీర్ఘ సముద్ర ప్రయాణాల్లోనూ యుద్ధ నౌకలకు ఇంధనం, నీరు, ఆయుధాలు, ఆహారం వంటి అత్యవసర సరఫరాలను నడిసముద్రంలోనే అందిస్తాయి. దీనివల్ల యుద్ధ నౌకలు మళ్లీ పోర్టుకు రాకుండా ఎక్కువ రోజుల పాటు సముద్రంలో ఉండి శత్రువులపై నిఘా పెట్టగలవు. నౌకాదళ సామర్థ్యాన్ని రెట్టింపు చేసే ఈ ప్రాజెక్టులో నిర్మిస్తున్న తొలి నౌకే ఈ ఎఫ్‌ఎస్‌ఎస్‌–1.

పూర్తి స్వదేశీ పరిజ్ఞానం
ఈ అత్యంత క్లిష్టమైన ఏర్పాటు కోసం షిప్‌యార్డు బృందం బయటి దేశాలపై ఆధారపడకుండా వినూత్న పరిష్కారాలను అన్వేషించింది. సొంతంగా కస్ట­మ్‌ డిజైన్‌ లిఫ్టింగ్‌ ఫిక్చర్‌ని తయారు చేసింది. హైడ్రాలిక్‌ మొబైల్‌ లో–బెడ్‌ షిఫ్టర్‌ ద్వారా బరువైన షాఫ్ట్‌ను సురక్షితంగా, ఖచ్చితమై­న స్థానానికి చేర్చారు. తక్కువ ఎత్తు ఉన్న ప్రాంతంలోనూ పనులు సులువుగా జరిగే­లా ఎత్తయిన స్టేజింగ్‌ ప్లాట్‌ఫా­రమ్‌­లను  ఏర్పాటు చేసి, సరి­కొత్త ‘టెయిల్‌ షాఫ్ట్‌ ఇన్‌సర్షన్‌’ టెక్నిక్‌ని కూడా వినియోగించా­రు.

హైడ్రా­లిక్‌ కప్లింగ్‌ పుష్‌ షాఫ్ట్‌ ఇన్‌సర్షన్‌ టెక్నిక్‌ వాడారు. ఈ అద్భుత ఘట్టం హెచ్‌ఎస్‌ఎల్‌కు చెందిన హల్, ఇంజినీరింగ్, క్వాలిటీ కంట్రోల్‌ బృందాలు, కాంట్రాక్టు సర్వీసు భాగస్వామ్య సంస్థలు సంయుక్తంగా పనిచే­శాయి. ప్రణాళికలో ఖచ్చితత్వం, ఆచర­ణలో ఆవిష్కరణలతో.. ఇండియన్‌ నేవీకి అవసరమైన అత్యంత సంక్లిష్ట ప్రాజె­క్టులను చేపట్టడంలో మేక్‌ ఇన్‌ ఇండియా స్ఫూర్తిని హెచ్‌ఎస్‌ఎల్‌ ముందుకు తీసు­కెళ్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement