మహారాణిపేట: భారీ వర్షాలకు కేజీహెచ్‌లోని పలు వార్డులు, కార్యాలయాల్లోకి వర్షపు నీరు చేరింది. ఆయుర్వేద ఓపీ, గైనిక్, పిల్లల వార్డులతోపాటు రాజేంద్రప్రసాద్, భావనగర్ వార్డుల్లో రోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గోడల నుంచి నీరు కారడంతోపాటు విద్యుత్ వైర్లు, మీటర్ల వద్దకు నీరు చేరడంతో ప్రమాద భయం నెలకొంది. ఆయుర్వేద ఓపీ విభాగం 11–ఎలోకి కిటికీలు, తలుపుల నుంచి నీరు చేరింది. మందులు నిల్వ చేసే గదిలోకి నీరు రావడంతో కొన్ని మందులు తడిసినట్లు కనిపించాయి. మరోవైపు డీసీఎస్‌ఆర్‌ఎంవో కార్యాలయంలో సుమారు రెండు అడుగుల మేర నీరు చేరడంతో సిబ్బంది కూర్చునే పరిస్థితి లేకుండా పోయింది. సీలింగ్ పెచ్చులు సైతం ఊడిపడ్డాయి. వర్షం పడిన ప్రతిసారీ ఇదే పరిస్థితి ఎదురవుతోందని రోగులు ఆవేదన వ్యక్తం చేశారు.


