గోపాలపట్నం: నగరంలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను ఎయిర్‌పోర్టు క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఎయిర్‌పోర్టు క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో క్రైమ్ ఏసీపీ ఎ.వెంకటరావు, వెస్ట్ సబ్ డివిజన్ క్రైమ్ సీఐ తిరుమలరావు వెల్లడించిన వివరాలు.. మురళీనగర్, మాధవధార ప్రాంతాల్లో ఆగస్టు 17న ఇందన సుశీల, ఉషారాణిల మెడలో బంగారు గొలుసులు, పుస్తెలతాళ్లు అపహరించిన ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించిన పోలీసులు ఎస్‌ఐ కె.రవికిషోర్ ఆధ్వర్యంలో ఆరు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు మహేంద్ర సింగ్ రాపిడో బైక్ రైడర్‌గా పనిచేస్తూ మధురవాడ దరి చంద్రంపాలెంలో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాజస్థాన్‌లోని పాగౌర్ జిల్లా పంచవటి గ్రామానికి చెందిన అతడిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 40 చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. 2012 నుంచి 2015 మధ్య హైదరాబాద్‌లో జీడిమెట్ల, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, బాలానగర్, సనత్‌నగర్, బహీర్‌బాద్, మియాపూర్, అల్వాల్, 2024లో బాచుపల్లి, జగద్గిరిగుట్ట, అంధ్రప్రదేశ్‌లోని చేబ్రోలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. 2025–26 మధ్య రాజమహేంద్రవరం ప్రకాష్‌నగర్‌లో 2, శ్రీకాకుళం 2, కాజీపేట 2, అనకాపల్లి 2, కాకినాడ సర్పవరం 2, నెల్లూరు బాలాజీనగర్ 2, విశాఖలో 2 చోట్ల దొంగతనాలకు పాల్పడ్డాడు. దొంగిలించిన బంగారాన్ని కొమ్మాది జంక్షన్‌కు చెందిన మండ్రు లతారత్నాకర్ సహకారంతో అనకాపల్లి గోల్డ్ మార్కెట్‌లో విక్రయించేవారని తెలిపారు. నిందితుల నుంచి 65 గ్రాముల బంగారం, రూ.5.55 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్‌కు తరలించారు. రాత్రి వేళ ఒంటరిగా ప్రయాణించేటప్పుడు విలువైన ఆభరణాలు ధరించవద్దని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా, దాడి చేసినా.. వెంటనే 112కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.


