విశాఖపట్నం: స్పీడ్ బ్రేకర్‌ను గమనించకపోవడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు బ్రెయిన్ డెడ్ అయింది. యలమంచిలి–గాజువాక రహదారిలో గొర్లివానిపాలెం సమీపంలోని లారస్ ఎన్‌క్లేవ్ వద్ద ఈ నెల 21న రాత్రి ఈ ప్రమాదం జరిగింది. దేశపాత్రునిపాలెంకు చెందిన రవ్వ శేఖర్ తన భార్య వెంకటలక్ష్మి(28)తో కలిసి ద్విచక్ర వాహనంపై ప్రార్థనకు వెళ్తుండగా స్పీడ్ బ్రేకర్ వద్ద ప్రమాదం జరిగింది.
దీంతో దంపతులిద్దరూ రోడ్డుపై పడిపోగా.. వెంకటలక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు. గాజువాకలో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. అవయవదానంపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడంతో వారు అంగీకరించినట్లు పరవాడ సీఐ ఎల్. భాస్కరరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


