బి.కొత్తకోట (మదనపల్లె టౌన్) : నాయనబావి సమీపంలో యువరైతు గోపాల్‌రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆయన భార్య ప్రతిభను బి.కొత్తకోట పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితురాలి అరెస్టుకు సంబంధించి సీఐ గోపాల్ రెడ్డి మీడియాకు తెలిపిన వివరాల మేరకు.. బి కొత్తకోట మండలంలోని నాయుని బావి పంచాయతీ కామ్మోళ్లపల్లెకు చెందిన గోపాల్‌రెడ్డి భార్య ప్రతిభకు అదే పంచాయతీ కాయలవారిపల్లికి చెందిన దాదం దేవేంద్రరెడ్డితో వివాహేతర సంబంధం ఉన్న విషయం భర్తకు తెలియడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇటీవల టమోటా పంట ద్వారా వచ్చిన డబ్బులను భార్య దేవేంద్రరెడ్డికి ఇవ్వడంపై గోపాల్‌రెడ్డి మందలించినట్లు విచారణలో వెల్లడైందన్నారు.
భర్త వేధిస్తున్నాడంటూ ప్రతిభ తన తమ్ముడు రాజశేఖర్‌రెడ్డితో చెప్పి బాధపడేదని తెలిపారు. వారం రోజుల క్రితం పొలం వద్ద ఏడుస్తూ.. భర్తను అడ్డు తొలగించుకుంటేనే తనకు మనశ్శాంతి ఉంటుందని ప్రతిభ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో రాజశేఖర్‌రెడ్డి, దేవేంద్రరెడ్డి కలిసి గోపాల్‌రెడ్డి రెండో కుమారుడు తరుణ్ కుమార్ రెడ్డిని కూడా ఈ కుట్రలోకి తీసుకువచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆస్తిలో కొంత భూమిని నీ పేరున రాస్తామని ఆశ చూపి అతడిని ఒప్పించినట్లు పేర్కొన్నారు.
సెప్టెంబర్ 20న గోపాల్‌రెడ్డి పొలం వద్ద ఒంటరిగా ఉన్న సమయంలో రాజశేఖర్‌రెడ్డి, దేవేంద్రరెడ్డి, తరుణ్ కుమార్‌రెడ్డి కలిసి కరల్రు, రాయితో దాడి చేసి అతి కిరాతకంగా ప్రతిభ తన భర్త గోపాల్ రెడ్డిని హత్య చేయించినట్లు సీఐ తెలిపారు. భర్త హత్య విషయం తెలుసుకున్నప్పటికీ ఎవరికీ అనుమానం రాకుండా ప్రతిభ సంఘటనా స్థలానికి వెళ్లినట్లు విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు. ఈ కేసులో ఆమె పాత్రపై దర్యాప్తు అనంతరం సెప్టెంబర్ 23న తోకలపల్లి స్కూల్ సమీపంలో ప్రతిభను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. భర్తతో ఏర్పడిన కుటుంబ కలహాలు, మరో వ్యక్తితో ఉన్న సంబంధం చివరకు ఒక కుటుంబంలో విషాదాన్ని నింపి, ప్రతిభను జైలు పాలయ్యే పరిస్థితికి తీసుకెళ్లాయి.


