సాక్షి, తాడేపల్లి: ఏపీలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున బలమైన, మంచి అభ్యర్థులను వేగంగా గుర్తించాలని పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్లకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ సూచించారు. పార్టీని ఒక్కతాటిపైకి తీసుకు వచ్చి ఎన్నికల్లో ముందుకు నడపాలి.. స్థానిక నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ బలోపేతం చేయాలని వైఎస్ జగన్ ఆదేశించారు. పోలీసుల బలంతో, అడ్డదారుల్లో ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతారు. వాటిని ఎదుర్కొనేందుకు అన్నిరకాలుగా సిద్ధం కావాలన్నారు.
తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లతో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ సమావేశమయ్యారు . ప్రజా పోరాటాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ వ్యూహం తదితర అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు సహా తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ..‘స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్థంగా ఉండాలి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులను గుర్తించాలి. అభ్యర్థుల ఎంపికలో మనం తీసుకునే నిర్ణయాలు రేపు వచ్చే ఎన్నికల్లో ఉపయోగపడాలి. పార్టీలో అందరితో మాట్లాడి అందరి అభిప్రాయాలు తీసుకోండి. పలు దఫాలుగా వారితో చర్చించి అభ్యర్థుల జాబితాను తయారు చేయండి. పార్టీని ఒక్కతాటిపైకి తీసుకు వచ్చి ఎన్నికల్లో ముందుకు నడపాలి. స్థానిక నాయకత్వాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ బలోపేతం చేయాలి.
రెండున్నరేళ్ల చంద్రబాబు పాలనలో వైఫల్యాలను, ప్రజలకు జరిగిన వెన్నుపోట్లను ప్రజలకు వివరించాలి. ప్రతి గడప వద్దకూ వెళ్లి, మన పాలనలో మంచి జరిగిన విషయాలను చెప్పాలి. అలాగే, కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న వెన్నుపోటు, దారుణాలను వివరించాలి. ఈ రెండున్నరేళ్ల పాలనలో చంద్రబాబు పాలన వల్ల ప్రజలకు జరిగిన నష్టాలను, కష్టాలను సమగ్రంగా చెప్పాలి. పోలీసు బలంతో, అడ్డదారుల్లో స్థానిక ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతారు. వాటిని ఎదుర్కొనేందుకు అన్నిరకాలుగా సిద్ధం కావాలి. ఎక్కడికక్కడ ప్రత్యామ్నాయాలు ఉంచుకోవాలి’ అని సూచించారు.
ఇదీ చదవండి: వైఎస్సార్‌సీపీ రాజశేఖర్ మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి


