ఇంట్లోనే ఓ దారుణ హత్య.. బయట నుంచి చూస్తే అనుమానం ఓ వ్యక్తిపై.. దర్యాప్తు ముందుకు సాగేకొద్దీ మరో వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. అసలు హత్యకు కుట్ర పన్నింది ఎవరు? కిరాయి హంతకులను రంగంలోకి దించింది ఎవరు? పోలీసులు ఒక్కో ఆధారాన్ని సేకరిస్తున్న కొద్దీ.. కేసు ఊహించని మలుపులు తిరిగింది. ముఖ్యంగా నిందితుల వాంగ్మూలాలు, ఫోన్ కాల్స్, కొత్త సిమ్ కార్డు వ్యవహారం పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారాయి. అలా దిమ్మతిరిగిపోయే ట్విస్ట్ బయటపడింది.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఫార్మాస్యూటికల్ డీలర్ వినీత్ మనోచా (60) సెప్టెంబర్ 5న తన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. కత్తితో దాడి చేసి చంపినట్లు పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన మరుసటి రోజే.. వినీత్ దగ్గర గతంలో పని చేసిన విశాల్ గౌతమ్, రాజ్‌కిశోర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. అయితే వినీత్ కోడలు ఇచ్చిన సుపారీతోనే తాము హత్య చేశామని చెప్పడంతో కేసు చిక్కుముడి వీడిందని పోలీసులు భావించారు.
తొలుత కేసు దర్యాప్తు మొత్తం షాలూ చుట్టూనే తిరిగింది. చిన్న చిన్న ఖర్చులకు కూడా తాను మామ దగ్గర చేయి చాచడం, నచ్చినట్లు తనను బతకనీయకపోవడం, పైగా భర్తను పదే పదే అవమానించడంతోనే కోపంతో ఆమె ఆ ఘాతుకానికి పాల్పడి ఉంటుందని పోలీసులు భావించారు. అయితే విచారణలో ఆమె తనకేం పాపం తెలియదని కన్నీరు మున్నీరు అయ్యింది. ఈలోపు.. కేసు ముందుకు సాగుతున్న కొద్దీ పోలీసులకు మరిన్ని అనుమానాలు తలెత్తాయి. పైగా నిందితుడు విశాల్ నుంచి వినీత్ కొడుకు సుబ్రత్‌కు ఫోన్‌కాల్స్ వెళ్లడం.. కేసును మరో మలుపు తిప్పింది.
విశాల్, రాజ్‌కిశోర్, షాలూలను 24 గంటల కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. వారితో పలు దఫాలుగా విచారణ జరిపారు. అనంతరం సుబ్రత్‌ను కూడా వారితో ఎదురెదురుగా కూర్చోబెట్టి ప్రశ్నించారు. ఈ విచారణ అనంతరం సుబ్రత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తన తండ్రి పిసినారితనంతో విసిగిపోయానని.. ఆస్తి కోసం హత్య చేయాలని సుబ్రత్ కోరాడని, ఇందుకు తమకు రూ.6 లక్షలు ఇస్తానని చెప్పాడని విశాల్ తెలిపినట్లు పోలీస్ కమిషనర్ రఘుబీర్ లాల్ వెల్లడించారు.
విశాల్ వాంగ్మూలంలో మరో కీలక అంశం బయటపడినట్లు పోలీసులు తెలిపారు. తాను పోలీసులకు చిక్కితే సుబ్రత్ భార్య షాలూ పేరును చెప్పాలని సుబ్రత్ సూచించినట్లు తేలింది. దీంతో ఈ కేసులో షాలూ ప్రమేయం లేదని.. ఆమెను భర్తే ఉద్దేశపూర్వకంగా ఇరికించాడని తేలింది. విశాల్‌వాంగ్మూలం ఆధారంగా.. కాల్ రికార్డులు, డిజిటల్ ఆధారాలు, ఇతర పరిస్థితుల ఆధారాలతో వాటిని పరిశీలిస్తున్నారు. సుబ్రత్ ఇంకా నేరం అంగీకరించకపోవడంతో.. అతని నుంచి వివరాలు రాబట్టేందుకు పోలీసులు కస్టడీ కోరే అవకాశం కనిపిస్తోంది.
కొత్త సిమ్.. తొలి కాల్ అతడికే
మరోవైపు విచారణ సందర్భంగా షాలూ కన్నీటి పర్యంతమై.. సుబ్రత్‌ను కాపాడేందుకే తనను ఈ కేసులో ఇరికించారని వాపోయినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు రెండు రోజుల ముందు విశాల్ కొత్త సిమ్ కార్డు తీసుకున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. ఆ నంబర్ నుంచి అతను చేసిన తొలి కాల్ సుబ్రత్‌కే వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు ముందు ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.
తొలుత కోడలే హత్యకు సుపారీ ఇచ్చిందని భావించిన పోలీసులకు.. చివరికి అదే కేసులో ఆమెను ఇరికించేందుకు ప్రయత్నం జరిగిందనే ఆరోపణలు తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది. కొత్త సిమ్.. తొలి కాల్.. కాంట్రాక్ట్ కిల్లర్ వాంగ్మూలం.. ఇలా ఒక్కో ఆధారం వెలుగులోకి వస్తుండటంతో ఈ కేసు మలయాళం క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించేలా ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతోంది.
ఇదీ చదవండి: హర్ముజ్‌లో దాడి.. భారతీయుడి దుర్మరణం


