మహారాణిపేట: ప్రివెంటివ్ విజిలెన్స్ క్యాంపెయిన్, విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్–2026లో భాగంగా విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఆడిటోరియంలో బుధవారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం జరిగింది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీసీఐఎల్), వీపీఏ విజిలెన్స్ విభాగాలు సంయుక్తంగా ‘ముందస్తు నిఘా, క్రమశిక్షణ చర్యల నిర్వహణ’ అనే అంశంపై ఈ సదస్సు నిర్వహించాయి. వీపీఏ, డీసీఐఎల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ టి.అరుణ్ ప్రసాద్ మార్గదర్శకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ డాక్టర్ జి.త్రినాథ్ కుమార్ వక్తగా పాల్గొని ప్రివెంటివ్ విజిలెన్స్, క్రమశిక్షణ చర్యల విధివిధానాల గురించి వివరించారు. వీపీఏ, డీసీఐఎల్ సంస్థలకు చెందిన పలువురు అధికారులు, ఉద్యోగులు పాల్గొని ముందస్తు విజిలెన్స్ చర్యలు, పొరపాట్లను ముందుగానే గుర్తించి అరికట్టడం, చట్టబద్ధమైన క్రమశిక్షణ చర్యలను సరైన రీతిలో ఎలా అమలు చేయాలనే విషయాలపై అవగాహన పొందారు. అధికారుల్లో విజిలెన్స్‌పై అవగాహన పెంచడం, వారి సామర్థ్యాన్ని బలోపేతం చేయడం ద్వారా సంస్థాగత పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం, నిజాయితీలను మరింతగా పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.


