మహారాణిపేట: జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం సేకరణకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి ధాన్యం కొనుగోలు, సేకరణకు సంబంధించిన వివిధ శాఖల అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో సుమారు 2,278 హెక్టార్లలో వరి సాగైనట్లు, దాదాపు 11,600 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖాధికారి చంద్రారావు జేసీకి వివరించారు. నవంబర్ రెండో వారం నుంచి ధాన్యం దిగుబడి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, సేకరణ, రవాణా తదితర అంశాలపై ఇప్పటి నుంచే తగిన చర్యలు చేపట్టాలని జేసీ సూచించారు.
రైతులతో ముందుగానే సంప్రదించి, అవసరాన్ని బట్టి క్లస్టర్లను విభజించాలని జేసీ ఆదేశించారు. సెప్టెంబర్ నెలాఖరులోగా క్లస్టర్ల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేందుకు తగిన రవాణా సదుపాయాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ–పంట, ఈ–కేవైసీ ప్రక్రియలో పెండింగ్‌లో ఉన్న వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ధాన్యం నాణ్యత, తేమ శాతాన్ని పరిశీలించేందుకు అవసరమైన పరికరాలు అందుబాటులో ఉండేలా చూడాలని, లీగల్ మెట్రాలజీ అధికారులు తేమ శాతం, తూనికలు, నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షించాలని ఆదేశించారు. అధికారుల బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించాలని, కనీస మద్దతు ధర, నాణ్యతా ప్రమాణాలు, కొనుగోలు విధానంపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కొనుగోలు ప్రారంభానికి ముందే సంబంధిత రైస్ మిల్లులను తనిఖీ చేయాలని, ధాన్యం సేకరణ, రవాణా, నిల్వ ప్రక్రియలో ఎలాంటి వృథా జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన గన్నీ బ్యాగులను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని, రైస్ మిల్లర్లు ముందస్తుగా అవసరమైన బ్యాంకు గ్యారంటీలను సమర్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా, సకాలంలో ధాన్యం సేకరణ జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జేసీ విద్యాధరి స్పష్టం చేశారు. సమావేశంలో సివిల్ సప్లైస్ డీఎం సృజన, జిల్లా సహకార అధికారి ప్రవీణ, మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, లీగల్ మెట్రాలజీ, రవాణా శాఖ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
అధికారులను ఆదేశించిన
జేసీ గొబ్బిళ్ల విద్యాధరి


