సింథియా: భారత్–శ్రీలంక ద్వైపాక్షిక సముద్ర విన్యాసాలు 13వ ఎడిషన్ స్లినెక్స్–26 విశాఖపట్నంలో ఘనంగా ముగిసింది. సెప్టెంబర్ 17 నుంచి 21 వరకు నిర్వహించిన ఈ విన్యాసాల ద్వారా ఇరుదేశాల నౌకాదళాల మధ్య వృత్తిపరమైన సంబంధాలు మెరుగుపడి, ఉత్తమ పద్ధతుల అన్వేషణ, పరస్పర కార్యచరణ సామర్థ్యం పెంపొందించేందుకు దోహదపడుతుందని ఇరు దేశాల ప్రతినిధులు పేర్కొన్నారు. హార్బర్ దశలో భారత్–శ్రీలంక నౌకాదళాల సిబ్బంది మధ్య వృత్తి పరమైన పరస్పర చర్చలు, ఇరుదేశాల నౌకలను ఒకరినొకరు సందర్శించడం, క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు. సముద్ర దశలో ఇరుదేశాల మధ్య సమన్వయంతో కూడిన సముద్ర విన్యాసాలు, వైమానిక కార్యకలాపాలు, ఇంధన సరఫరా, ప్రత్యేక దళాల విన్యాసాలు జరిగాయి. స్లినెక్స్–26 భారత్–శ్రీలంక మధ్య ఉన్న బలమైన సముద్ర భాగస్వామ్యాన్ని, సురక్షిత, సుస్థిర హిందూ మహాసముద్ర ప్రాంతం కోసం ఉమ్మడి నిబద్ధతకు అద్దంపడుతుందని నేవీ వర్గాలు అభిప్రాయపడ్డాయి.


