గ్రామానికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్న చట్రాపల్లి గిరిజనులు
చంద్రబాబు సర్కారుకు స్పష్టం చేసిన గిరిజన గ్రామం
భారీ వర్షాలకు చట్రాపల్లిని ముంచెత్తిన వరద
పునరావాస కేంద్రానికి రావాలని కోరిన అధికారులు.. తిరస్కరించిన గిరిజనులు
హామీ ఇచ్చిన మోడల్ కాలనీ, వంతెన, రోడ్డు నిర్మించాలని డిమాండ్
సీలేరు: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అల్లూరి సీతారామరాజు జిల్లా గాలికొండ పంచాయతీ చట్రాపల్లి గ్రామాన్ని వరద నీరు ముంచెత్తింది. దీంతో గ్రామంలోని 37 గిరిజన కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాయి. అయినా పునరావాస కేంద్రానికి రావాలన్న అధికారుల వినతిని గిరిజనులు తిరస్కరించారు. రెండేళ్ల క్రితం వర్షాలకు కొండల నుంచి వచ్చిన వరద గ్రామాన్ని ముంచెత్తినప్పుడు తమకు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పట్టుబడుతున్నారు.
2024లో కురిసిన భారీ వర్షాలకు కొండల పైనుంచి వచ్చిన వరద నీరు చట్రాపల్లి గ్రామాన్ని ముంచెత్తింది. కొండచరియలు విరిగిపడి ఒక గిరిజనుడు మృతి చెందాడు. మరికొందరు గాయపడ్డారు. అప్పటివరకు స్పందించని ప్రభుత్వం.. కొండచరియలు విరిగిపడిన తర్వాత హడావుడి చేసింది. నష్టపరిహారం అందించి గ్రామస్తులను ఆదుకుంటామని, గ్రామంలో మోడల్ కాలనీ నిర్మించి ముంపు లేకుండా చూస్తామని, రోడ్డు, రూ.25 లక్షలతో వంతెన నిర్మిస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీల్లో ఒక్కటి కూడా ఇప్పటివరకు నెరవేర్చలేదు.
వర్షాలు వచ్చిన ప్రతిసారీ పునరావాస కేంద్రానికి తరలించడం, ఆ తర్వాత వదిలేయడం జరుగుతోందే తప్ప, తమ కష్టాలను తీర్చడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కొండల నుంచి నీరంతా గ్రామంలోకి వచ్చేసింది. దీంతో ఇళ్లన్నీ నీట మునిగే పరిస్థితి తలెత్తింది. గురువారం మండల తహసీల్దార్ అన్నాజీరావు. ఎంపీడీవో రమణబాబు, పోలీసులు గ్రామానికి వచ్చి పునరావాస కేంద్రానికి రావాలని గిరిజనులను కోరారు. ఇందుకు గ్రామస్తులు ససేమిరా అనడంతో అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. సాయంత్రం 5 గంటలకు మరోసారి అధికారులు గ్రామస్తులతో మాట్లాడినా ససేమిరా అన్నారు. మోడల్ కాలనీ, రోడ్డు, వంతెన నిర్మించాలని, వర్షం నీరు గ్రామంలోకి రాకుండా చర్యలు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టారు.


