నాతవరం : పండంటి బాబు పుట్టి 15 రోజులైంది...పుట్టింట్లో తల్లిదండ్రులతో ఆనందంగా గడుపుతోంది. బిడ్డ పుట్టిన ఆనందం పంచుకోవడానికి భర్త కూడా అత్తవారింటికి వచ్చాడు. రాత్రి కుటుంబ సభ్యులంతా సరదాగా కబుర్లు చెప్పుకుని భోజనాలు చేసి హాయిగా నిద్రించారు. కానీ తెల్లవారకముందే ఆ కుటుంబంలో ఆనందం తలకిందులైంది. చిమ్మచీకట్లో విద్యుత్ వైర్ల రూపంలో విద్యుదాఘాతం బాలింత ఉసురు తీసింది. ఆమెను కాపాడాలని ఆతృతతో కుమార్తెను పొదివిపట్టుకున్న తల్లి కూడా విద్యుదాఘాతానికి బలైంది. ఈ విషాద ఘటన నాతవరంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ వై.తారకేశ్వరరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. నాతవరం గ్రామానికి చెందిన గొంప చిన్నబ్బాయి అలియాస్ అప్పారావు కుటుంబ సభ్యులతో కలసి బుధవారం రాత్రి భోజనాలు చేసి నిద్రించారు. గురువారం తెల్లవారు 3:30 గంటల సమయంలో చిన్నబ్బాయి కుమార్తె రొంగలి జానకి (28) ఇంటిలోపల బాతురూమ్‌కు వెళ్లింది. భారీ వర్షం కారణంగా ఇంటికి విద్యుత్ కోసం ఏర్పాటు చేసిన సర్వీసు వైరు తెగిపోయి కిందికి వేలాడుతోంది. చీకట్లో ఆ వైర్లను జానకి పట్టుకోవడంతో షాక్ కొట్టి కింద పడిపోయి పెద్దగా కేకలు వేసింది. ఇది విన్న జానకి తల్లి మంగ(58) పరుగెత్తి కెళ్లి కుమార్తెను కాపాడాలన్న ఆతృతతో గట్టిగా పట్టుకోవడంతో ఆమె కూడా షాక్‌కు గురై కింద పడిపోయి కేకలు వేసింది. ఆ కేకలు విన్న జానకి భర్త రొంగలి నాగరాజు కూడా భార్యను అత్తను కాపాడేందుకు చెక్క కర్రతో విద్యుత్ వైర్లు తొలగించే ప్రయత్నం చేసి షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఆ ఇంట్లో పెద్దగా కేకలు వినిపిస్తున్న విషయాన్ని ఇంటి పక్కనే నివాసం ఉంటున్న అంకంరెడ్డి కుమారి గమనించి వెంటనే విద్యుత్ కార్యాలయానికి, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విద్యుత్ సరఫరా నిలుపుదల చేశారు. భారీ వర్షం కురుస్తుండగా నాతవరం ఎస్‌ఐ వై.తారకేశ్వరరావు సిబ్బందితో సంఘటన స్థలానికి గొడుగులతో చేరుకున్నారు. ఇంటి లోపల సంఘటన స్థలంలో విద్యుత్ షాక్ కొట్టి నేలపై పడి ఉన్న వారిని బ్యాటరీ లైట్ల వెలుతురులో పరిశీలించగా తల్లి మంగ, కుమార్తె జానకి మరణించి పడిఉన్నారు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్న రొంగలి నాగరాజు ఛాతీపై బలంగా ఒత్తిడి చేయడంతో కదలిక వచ్చింది. వెంటనే అతనిని 108లో నాతవరం పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నర్సీపట్నం ఏరియా అసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కళ్ల ముందే భార్య మంగ, కుమార్తె జానకి మరణించడంతో చిన్నబ్బాయి భోరున విలపించాడు. జరిగిన ప్రమాదంపై ఎస్‌ఐ తారకేశ్వరరావు కేను నమోదు చేసి పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను నర్సీపట్నం ఏరియా అసుపత్రికి తరలించారు.
విగత జీవులుగా తల్లి, చెల్లి...
మృతురాలు మంగకు కుమార్తె జానకితో పాటు కుమారుడు రాజేష్ ఉన్నారు. రాజేష్ విజయనగరం జిల్లాలో ఎస్‌ఐగా పని చేస్తున్నారు. తల్లి, చెల్లి మరణించారన్న వార్త తెలిసి గురువారం తెల్లవారునే బయలుదేరి ఇంటికి వచ్చిన రాజేష్ మృతదేహాలను చూసి బోరున విలపించారు.
జానకి 15 రోజుల బాలింత
జానకిని మాకవరపాలెం మండలం తమ్మమ్యపాలేనికి చెందిన నాగరాజుకు ఇచ్చి వివాహం చేశారు. వారికి మొదటి బిడ్డ ఐదేళ్ల బాబు ఉండగా, రెండో కాన్పులో మళ్లీ బాబు పుట్టాడు. భార్య జానకిని చూసేందుకు నాగరాజు అత్తవారింటికి నాతవరం వచ్చాడు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులంతా ఆనందంగా ఉన్న తరుణంలో ఈ దుర్ఘటన చోటుకుని తీవ్ర విషాదంలో ముంచింది. బీఎస్సీ నర్సింగ్ చదువుకున్న జానకి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపరేషన్‌లో ఉన్నారు.


