ముంచంగిపుట్టులో భారీగా తిరస్కరణకు గురైన బ్యాలెట్ పత్రాలు జెడ్పీటీసీకి 2,110.. ఎంపీటీసీలకు 1,814 చెల్లని ఓట్లు జెడ్పీటీసీకి 251, ఎంపీటీసీలకు 478 ఖాళీ బ్యాలెట్ పత్రాలు
చెల్లని ఓట్లు..
కొంపముంచాయ!
ముంచంగిపుట్టు: ఓటు వేయడంలో అవగాహన లేకపోవడం అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపిందా..? చెల్లని ఓట్లు, ఖాళీ బ్యాలెట్ పత్రాలే కొన్నిచోట్ల ఫలితాలను తారుమారు చేశాయా..? ప్రస్తుతం మండలంలో ఇదే చర్చ జరుగుతోంది. ఈ నెల 5న నిర్వహించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక ల్లో భారీ సంఖ్యలో ఓట్లు చెల్లకుండా పోవడం, మరికొన్ని బ్యాలెట్ పత్రాలపై ఎలాంటి గుర్తుకు ఓటు వేయకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముంచంగిపుట్టు మండలంలో మొత్తం 38,935 మంది ఓటర్లు ఉండగా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 24,612 ఓట్లు పోలయ్యాయి. వీటిలో జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 2,110 ఓట్లు చెల్లనివిగా నమోదయ్యాయి. ఎంపీటీసీ ఎన్నికల్లో 1,814 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. వీటికి అదనంగా జెడ్పీటీసీ ఎన్నికల్లో 251, ఎంపీటీసీ ఎన్నికల్లో 478 బ్యాలెట్ పత్రాలపై ఓటర్లు ఏ గుర్తుకూ ఓటు వేయకుండా ఖాళీగా బ్యాలెట్ బాక్సుల్లో వేశారు.
స్వల్ప మెజార్టీలతో గెలుపు
● బాబుశాల సెగ్మెంట్‌లో అత్యధికంగా 355 చెల్లని ఓట్లు నమోదవగా, 57 ఖాళీ బ్యాలెట్ పత్రాలు ఉన్నాయి. ఇక్కడ టీడీపీ అభ్యర్థి 149 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
● మాకవరం సెగ్మెంట్‌లో 151 ఓట్లు చెల్లనివిగా, 33 బ్యాలెట్ పత్రాలు ఖాళీగా నమోదయ్యాయి. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి కేవలం నాలుగు ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలుపొందారు.
● దారెల సెగ్మెంట్‌లో తొలుత వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రెండు ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్లు ప్రకటించారు. అయితే టీడీపీ అభ్యర్థి రీకౌంటింగ్ కోరడంతో అధికారులు మరోసారి ఓట్లను లెక్కించారు. అనంతరం ఐదు ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారు. ఈ సెగ్మెంట్‌లో 93 చెల్లని ఓట్లు, 66 ఖాళీ బ్యాలెట్ పత్రాలు నమోదయ్యాయి.
ఓటు వినియోగంపై అవగాహన అవసరం
గిరిజన ప్రాంతాల్లో చాలామంది నిరక్షరాస్యులు ఉండటం, బ్యాలెట్ పత్రంపై ఓటు ఎలా వేయాలనే అంశంపై తగిన అవగాహన లేకపోవడం చెల్లని ఓట్లు పెరగడానికి కారణమై ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ప్రచారంతోపాటు ఓటు వేసే విధానంపైనా ఓటర్లకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. లేకుంటే చెల్లని ఓట్లు, ఖాళీ బ్యాలెట్ పత్రాలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
దారెల సెగ్మెంట్‌లో రీకౌంటింగ్ నిర్వహిస్తున్న అధికారులు (ఫైల్)


