జి.మాడుగుల ఎంపీపీ పీఠంపై ఉత్కంఠ! | - | Sakshi
Sakshi News home page

జి.మాడుగుల ఎంపీపీ పీఠంపై ఉత్కంఠ!

Nov 10 2026 12:25 AM | Updated on Nov 10 2026 12:25 AM

● ఏ పార్టీకీ దక్కని స్పష్టమైన మెజార్టీ

● వైఎస్సార్‌సీపీకి 7, టీడీపీకి 5 స్థానాలు

● కీలకంగా మారిన ముగ్గురు స్వతంత్ర ఎంపీటీసీలు

జి.మాడుగుల: మండల పరిషత్‌ అధ్యక్ష(ఎంపీపీ) పీఠంపై ఉత్కంఠ నెలకొంది. మండలంలోని 15 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ లభించలేదు. వైఎస్సార్‌సీపీ 7 స్థానాలు, టీడీపీ 5 స్థానాలు, స్వతంత్ర అభ్యర్థులు 3 స్థానాల్లో విజయం సాధించారు. దీంతో ఎంపీపీ పీఠాన్ని దక్కించుకునేందుకు రాజకీయ పార్టీలు స్వతంత్ర ఎంపీటీసీల మద్దతుపై దృష్టి సారించాయి. ఎంపీపీ పీఠాన్ని కై వసం చేసుకోవాలంటే కనీసం 8 మంది ఎంపీటీసీల మద్దతు అవసరం. వైఎస్సార్‌సీపీకి ప్రస్తుతం ఏడుగురు సభ్యుల బలం ఉండటంతో ఒక్క స్వతంత్ర సభ్యుడి మద్దతు లభిస్తే ఎంపీపీ పీఠం దక్కించుకునే అవకాశం ఉంది. టీడీపీకి మాత్రం ముగ్గురు స్వతంత్ర సభ్యుల మద్దతు అవసరం. దీంతో స్వతంత్ర ఎంపీటీసీలు ఎవరికి మద్దతు ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తయినప్పటికీ ఎంపీపీ ఎన్నికకు సంబంధించి అధికారులు ఇంకా ప్రకటన విడుదల చేయలేదు. దీంతో ఆశావహుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.

ఎంపీటీసీలకు ఎమ్మెల్యే అభినందనలు

ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం సాధించిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను పాడేరు ఎమ్మెల్యే, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు అభినందించారు. మండలంలోని 15 స్థానాలకు ఏడు స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. కె.కోడాపల్లి ఎంపీటీసీ తలారి వెంకటరమణ, గడుతూరు ఎంపీటీసీ బోనంగి చిన్న మత్స్యకొండబాబు, సింగర్భ ఎంపీటీసీ పాంగి రామకృష్ణ, బొయితిలి ఎంపీటీసీ గావెలి సుభాషిణి, పాలమామిడి ఎంపీటీసీ గెమ్మెలి కామలమ్మ, భీరం ఎంపీటీసీ నుర్మాని రాజమ్మ, పెదలువ్వాసింగి ఎంపీటీసీ వంతాల సుమిత్రలను ఆయన అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement