పైపుల ద్వారా పెద్ద చెరువులోకి విడుదల చేస్తున్న రసాయన వ్యర్థ జలాలు
పరవాడ: నిబంధనలకు విరుద్ధంగా చెరువులు, గెడ్డల్లోకి రసాయన వ్యర్థ జలాలను విడుదల చేస్తున్న ఫార్మా యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని సిటు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. గురువారం ఆయన పెద్ద చెరువును పరిశీలించి, మీడియాతో మాట్లాడారు. వర్షాలు పడినప్పుడల్లా ఫార్మా పరిశ్రమల యాజమాన్యాలు శుద్ధి చేయని రసాయన వ్యర్థాలను యథేచ్ఛగా చెరువులు, గెడ్డలు, కాలువల్లోకి విడుదల చేస్తుండడం వలన ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కిడ్నీ, చర్మ, క్యాన్సర్, గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు గురై నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


