పిఠాపురం మండలం జములపల్లిలో ఏలేరు కాలువ పొంగి నీట మునిగిన పంట పొలాలు
తీవ్ర వాయుగుండం తీరం దాటినా 16 జిల్లాలపై ప్రభావం
శ్రీకాకుళం జిల్లాలో అంధకారంలోకి గ్రామాలు
పలుచోట్ల నేలకొరిగిన వృక్షాలు.. రాకపోకలకు అంతరాయం
కాలువలు, ఏర్లకు గండ్లు
విశాఖలో విరిగిపడిన కొండచరియలు
సాగు చేసిన అరకొర పంటలూ వర్షార్పణం
నేలకొరిగిన మొక్కజొన్న, అరటి, బొప్పాయి
సాక్షి, అమరావతి, నెట్‌వర్క్: తీవ్ర వాయుగుండం తీరం దాటినా 16 జిల్లాలపై ప్రభావం చూపింది. ప్రధానంగా ఉత్తరాంధ్ర భారీ వర్షాలతో విలవిల్లాడింది. గురువారం రోజంతా ఎడతెరిపి లేని వర్షాలు, ఈదురుగాలులతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. విశాఖలో కైలాసపురం, వెంకోజీపాలెం, చైతన్య నగర్ తదితర ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. విజయవాడలో భారీ వర్షానికి భవానీపురం హెచ్‌బీ కాలనీ, ఇందిరా ప్రియదర్శిని కాలనీ రోడ్లలో మోకాటి లోతులో నీళ్లు నిలిచాయి.

అనకాపల్లి, కాకినాడ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోనూ భారీ నష్టం వాటిల్లింది. నదులు, వాగులు గ్రామాలను చుట్టుముట్టాయి. వంతెనలు కూలి, రోడ్లు కోతకు గురై అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. టెక్కలి, పాతపట్నంలో 33 కేవీ స్తంభాలు, ఏడు మండలాల్లో 11 కేవీ స్తంభాలు విరిగిపోవడంతో వందలాది పల్లెలు అంధకారంలో మగ్గాయి. వేగావతి నది ఉధృతితో బొబ్బిలి పట్టణానికి తాగునీటి సరఫరాను నిలిపివేశారు. అరకులోయలో నిత్యావసరాల కోసం గిరిజనులు ప్రాణాలకు తెగించి వాగులు దాటుతున్నారు.

పొంచి ఉన్న ప్రమాదం...
రెండు రోజులు కుండపోతతో నేల పూర్తిగా నీటితో నిండిపోయింది. ఇక నీటిని పీల్చుకునే స్థితిలో లేదు. అందుకే ఇకపై కురిసే మోస్తరు వర్షం కూడా నేరుగా వాగులు, వంకల్లోకి చేరి ఆకస్మిక వరదలకు దారితీయవచ్చని తెలిపింది. అనకాపల్లి, కాకినాడ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఆకస్మిక వరదల ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొండవాలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం కూడా ఉంది.

పొంగిపొర్లుతున్న వాగులు, ఏర్లు
వర్షాలకు ఎన్టీఆర్ జిల్లాలోని కట్టలేరు, వైరాయేరు, ఏనుగు గడ్డ వాగు, ఇతర వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కోడూరు మండలం పాలకాయతిప్ప వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. రాకాసి అలలు సుమారు రెండు మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాతో పోల్చితే కృష్ణా జిల్లాలో వర్ష ప్రభావం తక్కువగా ఉంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలు, దర్శి, సంతనూతలపాడు, అద్దంకి, కొండపి నియోజకవర్గాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. రాజమహేంద్రవరంలో వర్షం నీరు, మురుగునీరు కలిసి రోడ్లపై ప్రవహించడంతో తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. కాకినాడలో వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పంపా నదిలో నీటి మట్టం పెరుగుతోంది.
రాజధానికి నిలిచిన రాకపోకలు..
రాజధాని ప్రాంతంలో తుళ్లూరు మండలం పెదపరిమి వద్ద కోటేళ్ల వాగు ఉప్పొంగడంతో అమరావతికి రాకపోకలు నిలిచిపోయాయి. తాడికొండ మండలం లాం వద్ద లో లెవల్ చప్టాపై కొండవీటి వాగు ఉప్పొంగడంతో రోడ్డుపైకి నీరు చేరింది. అమరావతి, క్రోసూరు మార్గంలో రాకపోకలు నిలిచిపోవటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ముత్తాయపాలెం వద్ద రహదారిపై సుమారు మూడు అడుగుల ఎత్తులో వర్షపు నీరు ప్రవహించింది. కొండవీటి వాగు, మేళ్లవాగు, పెదమద్దూరు వద్ద వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పొలాలు నీటమునిగాయి. పత్తి చేలలోకి నీరు చేరింది. ఎన్టీఆర్ జిల్లా వినగడప వద్ద కట్టలేరు వాగు రోడ్డెక్కడంతో 20 గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నున్న వద్ద పెదవాగు ఉధృతికి కారు కొట్టుకుపోగా స్థానికులు అందులోని దంపతులను కాపాడారు.

పంటలకు నష్టం
ఉత్తరాంధ్ర సహా రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు అపార నష్టాన్ని చేకూర్చాయి. వరితో పాటు మొక్కజొన్న, పత్తి, అరటి, బొప్పాయి తదితర ఉద్యాన పంటలు నేలకొరిగాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఆంధ్ర–ఒడిశా సరిహద్దు గ్రామాల్లో బహుదా నదిలో వరదనీరు పోటెత్తడంతో ఇచ్ఛాపురం మండలంలో పంట పొలాలన్నీ ముంపునకు గురై పూర్తిగా తుడిచి పెట్టుకుపోయాయి. పద్మనాభపురం గడ్డ ఉప్పొంగడంతో పంటల పొలాలన్నీ నీటమునిగాయి.

విజయనగరం జిల్లా చీపురుపల్లి, గరివిడి, వంగర, పూసపాటిరేగ, డెంకాడ, మెరముడిదాం, బొబ్బిలి, రేగిడి, ఆముదాల వలస, నెల్లిమర్ల మండలాల్లో పంటలకు అపార నష్టం వాటిల్లింది. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఉద్యాన పంటలతో పాటు కూరగాయల పంటలకు నష్టం వాటిల్లిందని ఆవేదన చెందుతున్నారు. వరి ఇప్పుడిప్పుడే పొట్టదశకు చేరుకుంటోంది. మరో రెండు రోజులు ఇదే రీతిలో వర్షాలు కురిస్తే వరి కొంతమేర దెబ్బతినే అవకాశాలు లేకపోలేదంటున్నారు.

లంకల్లో కూరగాయల పంటలు చాలా వరకు నీటమునగగా పలు చోట్ల అరటి, బొప్పాయి పంటలు నేలకొరిగాయి. రాయలసీమలో చీని, నిమ్మ లాంటి ఉద్యాన పంటలన్నీ ఇప్పటికే వర్షాభావంతో ఎండుముఖం పట్టాయి. నేలలో తేమ శాతం లేక ఏళ్ల తరబడి సాగుచేసిన ఉద్యాన పంటలు సైతం ఎండిపోయాయి. తాజాగా కురుస్తున్న వర్షాలు అనంతపురం, నంద్యాల జిల్లాలు మినహా మిగిలిన రాయలసీమ జిల్లాల్లో చెప్పుకోతగ్గ స్థాయిలో పడలేదు. నెల్లూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు.
విశాఖలో కుండపోత
» 24 గంటల్లో 28 సెంటీమీటర్ల వర్షం
» 50కి పైగా కేంద్రాల్లో అత్యంత భారీ వర్షం
» గంటకు 3 కి.మీ. వేగంతో నెమ్మదిగా కదిలిన తీవ్ర వాయుగుండం
ఆకాశానికి చిల్లు పడినట్లుగా కుండపోత వర్షానికి విశాఖ నగరం ఉక్కిరి బిక్కిరైంది. బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి గురువారం ఉదయం 8.30 వరకు 24 గంటల్లో విశాఖలో ఏకంగా 28 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఎండాడలో 27.7, విశాఖ విమానాశ్రయం వద్ద 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 20.4 సెంటీమీటర్లకు మించి కురిసే వర్షాన్ని వాతావరణ శాఖ అత్యంత భారీ వర్షంగా వర్గీకరిస్తుంది. ఈసారి విశాఖలో 50కిపైగా కేంద్రాల్లో ఆ స్థాయి వర్షం పడింది. నగరంలో సెపె్టంబర్ నెల మొత్తంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 19.1 సెంటీమీటర్లు. కానీ ఒక్క రాత్రిలోనే దానికి దాదాపు ఒకటిన్నర రెట్లు వర్షం కురిసింది.
బుధవారం సాయంత్రం మొదలైన వాన గురువారం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా కుండపోతగా కురిసింది. వాయుగుండం అతి నెమ్మదిగా కదలడం.. తీరం దాటే ముందు ఆరు గంటల పాటు ఇది గంటకు కేవలం 3 కిలోమీటర్ల వేగంతో కదలడంతో వర్షాలు విస్తారంగా పడ్డాయి. తీరం దాటిన తర్వాత కూడా వాయుగుండం కేంద్రం విశాఖకు 80 కిలోమీటర్ల దూరంలో ఉత్తర–ఈశాన్యంగా ఉండటం వల్ల కూడా భారీ వర్షాలు పడ్డాయి.
సముద్రం నుంచి వచ్చిన తేమ గాలులను విశాఖ చుట్టూ ఉన్న కొండలు పైకి నెట్టడంతో మేఘాలు మరింత దట్టంగా మారి కుండపోత కురిసింది. ఈ తీవ్ర వాయుగుండం 2021 సెప్టెంబర్‌లో వచ్చిన గులాబ్ తుపానును పోలి ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. పసిఫిక్ మహా సముద్రంలో కొనసాగుతున్న ఎల్‌నినో పరిస్థితులు తుపానుగా మారకుండా అడ్డుపడి ఉండవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.


