సిద్ధంగా ఉన్న 7వేల మెగావాట్ల చౌక విద్యుత్‌ను కాదని అధిక ధరకు అదే సెకీతో ఒప్పందంపై అనుమానాలు
సెకీ నుంచి 40 ఏళ్లపాటు 1,344 మెగావాట్ల పంప్డ్ స్డోరేజ్ విద్యుత్ కొనుగోలుకు నిర్ణయం
టాటా పవర్‌తో సెకీ ఒప్పందం ప్రకారం యూనిట్ ధర రూ.3.72
అదే రేటుకు కొన్నా ఏటా రూ.1,458 కోట్లు వ్యయం.. 40 ఏళ్లకు రూ.58,300 కోట్ల ఖర్చు
ఇదే సెకీతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం యూనిట్ రూ.2.49 చొప్పున 7 వేల మెగావాట్లకు ఒప్పందం
25 ఏళ్లకు కుదుర్చుకున్న ఆ ఒప్పందంపై చంద్రబాబు అండ్ కో గగ్గోలు
ఇప్పుడు అదే సెకీతో ఏకంగా 40 ఏళ్ల దీర్ఘకాలిక ఒప్పందానికి సన్నాహం
అప్పట్లో ధర ఎక్కువని దుష్ప్రచారం.. ఇప్పుడు దానికంటే రూ.1.23 ఎక్కువ చెల్లించేందుకు సిద్ధం
చంద్రబాబు ద్వంద్వ వైఖరి వెనుక స్వార్థ ప్రయోజనాలున్నాయని విమర్శలు
రాష్ట్ర ప్రజలపై చార్జీల భారం, డిస్కంలకు నష్టమంటున్న నిపుణులు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ద్వంద్వ విధానాలు, స్వార్థ ప్రయోజనాలకు ఇది మరో నిదర్శనం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందంపై నానా రగడ చేసిన చంద్రబాబు.. ఇప్పుడు అదే సెకీతో అప్పటికంటే ఎక్కువ ధరకు విద్యుత్ కొనడానికి సిద్ధమవుతున్నారు. పైగా సెకీతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం యూనిట్ రూ.2.49 చొప్పున 7వేల మెగావాట్ల విద్యుత్ రాష్ట్రానికి సరఫరా అయ్యేందుకు సిద్ధంగా ఉంది.
అయినప్పటికి ఆ విద్యుత్‌ను తీసుకోకుండా మరల అదే సెకీ నుంచి అధిక ధరకు విద్యుత్ కొనుగోళుకు చేయాలనుకుంటున్నారు. ఈ మేరకు బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇది చంద్రబాబు ప్రభుత్వ ద్వంద్వ విధానాలకు నిదర్శనమని, ఈ నిర్ణయం వల్ల ప్రజలపై అదనపు చార్జీల భారం పడుతుందని, డిస్కంలు ఆర్థికంగా దెబ్బతింటాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
అప్పట్లో సెకీతో ఒప్పందం తప్పన్నారు
వ్యవసాయానికి పగటిపూట 9 గంటలు నిరంతరాయంగా విద్యుత్ అందించడం కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం యూనిట్ రూ.2.49 చొప్పున అంతర్రాష్ట్ర ప్రసార సిస్టం (ఐఎస్‌టీఎస్) చార్జీలు మినహాయింపుతో పాతికేళ్ల పాటు 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు సెకీతో ఒప్పందం చేసుకుంది. దీనిపై చంద్రబాబు అండ్‌కో పెద్ద ఎత్తున రాద్ధాంతం చేసింది. ఇది ఖజానాపై ఆర్థిక భారమని తప్పుడు ప్రచారం చేశారు. అతి తక్కువ ధరతో సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ, భారీ అవినీతి జరిగిందంటూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురద జల్లుతూనే ఉన్నారు. ఇంత దుష్ప్రచారానికి పాల్పడుతున్న అదే చంద్రబాబు ప్రభుత్వం అదే సెకీతో ఇప్పుడు ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలుకు సిద్ధమైంది. నాటి ఒప్పందం కంటే 15 ఏళ్లు అదనపు దీర్ఘకాలానికి. దీని వెనుక చంద్రబాబు కూటమి ప్రభుత్వ పెద్దల స్వార్ధ ప్రయోజనాలున్నాయన్న విమర్శలు వస్తున్నాయి.
పీఎస్పీతో నష్టాలు ఎక్కువే
పంప్డ్ స్టోరేజ్‌లో ముందుగా విద్యుత్‌తో నీటిని పైకి పంపి.. అవసరమైనప్పుడు తిరిగి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. నీటిని పైకి పంపడానికి ముందుగా విద్యుత్ కావాలి. కాబట్టి 1 యూనిట్‌ను తిరిగి పొందడానికి 1 యూనిట్ కంటే ఎక్కువ విద్యుత్ అవసరం. ఈ ప్రక్రియలో విద్యుత్ నష్టం తప్పదు. టాటా పవర్‌తో సెకీ కుదుర్చుకున్న ఒప్పందంలో కూడా 24.61 శాతం వార్షిక నష్టంగా పేర్కొన్నారు. అందువల్ల నిల్వ సామర్థ్యాన్ని మొత్తం విద్యుత్ ఉత్పత్తిగా పరిగణించలేమని, దీనివల్ల దీర్ఘకాలంలో స్థిర చార్జీల భారం అధికమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
40 ఏళ్లకు ఒప్పందం అవసరమా?
డిస్కంల విద్యుత్ అవసరాలు – వనరుల ప్రణాళిక ప్రకారం.. రాష్ట్రానికి 2026–27లో 92,538 మిలియన్ యూనిట్లు అవసరం కాగా అది 2028–29 నాటికి 1,05,910 మిలియన్ యూనిట్లకు చేరుతుందని అంచనా. అయితే పునరుత్పాదక విద్యుత్ కూడా భారీగా అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే పీఎం సూర్యఘర్ పథకంతో ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్, వ్యవసాయ పంపుసెట్ల సోలరైజేషన్ వంటి కార్యక్రమాల ద్వారా సౌర విద్యుత్ ఉత్పత్తి పెంచడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో 40 ఏళ్ల పాటు పీఎస్పీ విద్యుత్‌ను అధిక ధరకు కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
రూ.58,300 కోట్ల భారం
డిస్కంల తరపున ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీపీడీసీఎల్)1,344 మెగావాట్లు/10,752 మెగావాట్ అవర్ పంప్డ్ స్టోరేజ్ సామర్థ్యాన్ని సెకీ నుంచి 40 ఏళ్లకు సమకూర్చుకోవాలనే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి తాజాగా ఆమోదం తెలిపింది. ఈ విద్యుత్‌కు ప్రస్తుతానికి తుది టారిఫ్ ప్రకటించలేదు. అయితే ఈ ఏడాది టాటా పవర్‌తో ఇదే తరహా పీఎస్పీ స్టోరేజ్ ఒప్పందాన్ని సెకీ కుదుర్చుకుంది.
ఈ ఒప్పందంలో ఏడాదికి స్థిర ఛార్జీలు సుమారు రూ.1.084 కోట్లుగా నిర్ణయించారు. అదే రేటు ప్రాతిపదికగా తీసుకుని ఏపీ తీసుకునే 1,344 మొగావాట్లను లెక్కిస్తే.. ఏడాదికి సుమారు రూ.1,458 కోట్లు అవుతుంది. ఈ లెక్కన 40 ఏళ్లకు సుమారు రూ.58,300 కోట్లు. ఒక వేళ ఇంతకన్నా ఎక్కువకు తీసుకుంటే ఖర్చు మరింతగా పెరుగుతుంది. ఇదంతా డిస్కంలు చెల్లించాల్సిందే. అంటే మళ్లీ సర్దుబాటు చార్జీలు, ఇతర రూపాల్లో రాష్ట్ర ప్రజల నుంచే వసూలు చేస్తారు.
ఒక్క యూనిట్‌కు రూ.3.72
10,752 మెగావాట్ అవర్ అంటే 1,344 మెగావాట్ల సామర్థ్యంతో సుమారు 8 గంటల పాటు విద్యుత్ అందించే సామర్థ్యం. ఇలా రోజూ కచ్చితంగా జరిగితే ఏడాదికి సుమారు 392.4 కోట్ల యూనిట్లు అందించే సామర్థ్యం ఉంటుంది. ఏటా రూ.1,458 కోట్ల ఫిక్స్‌డ్ చార్జీలను ఈ గరిష్ట సామర్ధ్యంతో లెక్కిస్తే ఒక్క యూనిట్‌కు సుమారు రూ.3.72 పడుతుంది.
అంటే గత ప్రభుత్వం సెకీకి చెల్లిస్తామన్న యూనిట్ ధర రూ.2.49 కంటే ఇప్పుడు రూ.1.23 అదనంగా చెల్లించేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమైనట్టు. ఇందులో చార్జింగ్ విద్యుత్ ఖర్చు, పంపింగ్ నష్టాలు, ట్రాన్స్‌మిషన్, ఇతర ఛార్జీలు కలపలేదు. అవికూడా కలిస్తే వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది. నిజానికి సెకీ విద్యుత్ ఇప్పటికిప్పుడు తీసుకుని రాష్ట్ర అవసరాలకు వాడుకోవడానికి 7వేల మెగావాట్లు సిద్ధంగా ఉంది. దానిని కాదని అదే సంస్థతో ఇంత ఎక్కువ ధర చెల్లించి విద్యుత్ కొనాల్సిన అవసరం ఏ మాత్రం లేదు.
‘సెకీ’ సౌర విద్యుత్ ఒప్పందం.. ప్రయోజనాలు
⇒ అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా ఛార్జీలు (ఐఎస్‌టీఎస్) మినహాయించి యూనిట్ రూ.2.49 చొప్పున విద్యుత్‌ను సరఫరా చేస్తామంటూ కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ పర్యవేక్షణలో ఏర్పాటైన ప్రభుత్వ రంగ సంస్థ సెకీ తనకు తానుగా 2021 సెపె్టంబర్ 15 రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శికి లేఖ ద్వారా ప్రతిపాదించింది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ ఇస్తామని చెప్పింది కేంద్రం. ఒప్పందం జరిగింది కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య.
⇒ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఇంత చవకైన సౌర విద్యుత్ కొనుగోలు, అత్యధికంగా 7 వేల మెగావాట్ల కోసం గతంలో ఎప్పుడూ ఏ ప్రభుత్వంలోనూ ఒప్పందం జరగలేదు. డిస్కంలు కూడా ఎప్పుడూ ఇలాంటి చవకైన ధరతో, ఇంత ప్రజోపయోగకరమైన ఒప్పందం చేసుకోలేదు.
⇒ సెకీ విద్యుత్ తీసుకోవడం వల్ల ఏటా రూ.3,750 కోట్ల ఆరి్థక ప్రయోజనం చేకూరుతుంది.
⇒ రైతులకు 25 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ ఇచ్చి మంచి చేయాలనే సత్సంకల్పంతో, దూరదృష్టితో వైఎస్ జగన్ ప్రభుత్వం చేసుకున్న అద్భుత ఒప్పందమిది.
⇒ సెకీ విద్యుత్ తీసుకోకపోతే అప్పటికే పిలిచిన టెండర్ల కేసు కోర్టులో ఎప్పటికి తేలుతుందో తెలియదు. అది తేలే నాటికి పరికరాల రేట్లు, విద్యుత్ ధరలు ఎంతగానో పెరిగేవి.
⇒ కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్‌సీ), రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) రెండూ సెకీ ఒప్పందానికి ఆమోదం తెలిపాయి.
⇒ సెకీ నుంచి విద్యుత్ తీసుకోవడం వల్ల పాతికేళ్ల పాటు అంతర్రాష్ట్ర ట్రాన్స్‌మిషన్ చార్జీల నుంచి కేంద్రం మినహాయింపు ఇస్తుంది.
⇒ అదే రాష్ట్రంలో విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తే పాతికేళ్ళు సెంట్రల్ గ్రిడ్ ఛార్జీలు చెల్లించాలి. రాష్ట్రంలో అంతర్గతంగా సౌర ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తే వాటికి కావాల్సిన విద్యుత్ లైన్లు, అంతర్గతంగా విద్యుత్ ప్రసార వ్యవస్థ బలోపేతం చేయటం తప్పనిసరి. ఈ ఖర్చును బేరీజు వేసుకుంటే బయటి రాష్ట్రాల నుంచి సౌర విద్యుత్ తీసుకున్నప్పుడే తక్కువవుతోంది.
చంద్రబాబు కుట్రలు పటాపంచలు
సెకీతో వైఎస్ జగన్ ప్రభుత్వం, విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు కుదుర్చుకున్న ఒప్పందంపై కూటమి ప్రభుత్వం దు్రష్పచారం చేసింది. సీఎం చంద్రబాబు విద్యుత్ రంగంపై విడుదల చేసిన శ్వేత పత్రంలోనూ సెకీ ఒప్పందాన్ని తప్పుబడుతూ పచ్చి అబద్ధాలతో రాష్ట్ర ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేశారు. సెకీ నుంచి విద్యుత్ తీసుకుంటే జనరల్ నెట్‌వర్క్ యాక్సెస్ (జీఎన్‌ఏ) నిబంధనల ప్రకారం రూ.3 వేల కోట్ల నుంచి రూ.3500 కోట్ల వరకూ అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా చార్జీలు చెల్లించాల్సి వస్తుందని నమ్మించాలనుకున్నారు. ఎల్లో మీడియా అదే దు్రష్పచారం చేసింది.
కానీ, కేంద్ర సంస్థల నిబంధనలు, ఏపీఈఆర్‌సీ ఆదేశాలతో చంద్రబాబు కుట్రలు పటాపంచలయ్యాయి. 2023 ఫిబ్రవరి 7న సీఈఆర్‌సీ జారీ చేసిన నోటిఫికేషన్‌లోనూ అంతర్రాష్ట్ర ప్రసార ఛార్జీల మినహాయింపు గురించి స్పష్టత వచి్చంది. సీఓడీ తేదీ నుంచి 25 సంవత్సరాల పాటు ఈ మినహాయింపు వర్తిస్తుందని సీఈఆర్‌సీ వెల్లడించింది. అయినా, చంద్రబాబు అసత్యాలతో రాష్ట్ర ప్రజలను పక్కదారి పట్టించాలని ప్రయత్నించారు. ఏపీఈఆర్‌సీ ఈ ఏడాది ఆగస్టు 13న జారీ చేసిన ఆదేశాలతో కూడా చంద్రబాబు, ఎల్లో మీడియా ప్రచారమంతా అబద్ధమని స్పష్టమైంది.
పైగా గతంలో చంద్రబాబు ప్రభుత్వం రెండింతలకు పైగా ధరలకు ఒప్పందాలు చేసుకొని ప్రజలపై భారం వేయడం తెలిసిందే. చంద్రబాబు చేసిన పని వల్ల డిస్కంలు ఏటా రూ.3,500 కోట్లు చొప్పున దశాబ్దాల పాటు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయాన్ని దాచి అప్పట్లో విద్యుత్ ఉత్పత్తి లోటు ఉందని టీడీపీ పచ్చి అబద్ధాలు చెప్పింది. ఫలితంగా బాబు హయాంలో విద్యుత్ రంగం కుదేలైంది.
2019లో వైఎస్ జగన్ సీఎం అయ్యాక విప్లవాత్మక నిర్ణయాలతో ఈ రంగాన్ని గాడిలో పెట్టారు. 2024లో మళ్లీ చంద్రబాబు రావడంతో గతం పునరావృతం అవుతోందని విద్యుత్ రంగం నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మళ్లీ అదే కోవలో అత్యధిక ధరలకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకునేందుకు చంద్రబాబు రంగం సిద్ధం చేయడమే ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు.


