‘ఈనాడు’ కిరణ్ వియ్యంకుడికి భారీ నజరానా
హంద్రీ–నీవా సుజల స్రవంతి రెండో దశ ప్రధాన కాలువ లైనింగ్ పనుల్లో మాయాజాలం
రెండో ప్యాకేజీ అంచనా వ్యయం రూ.158.19 కోట్ల నుంచి రూ.337.9 కోట్లకు పెంపు
గతేడాది పనులను రూ.123.24 కోట్లకు ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ సంస్థకు కట్టబెట్టిన ప్రభుత్వం
నాసిరకంగా పనులు చేయడంతో కాలువలో ఒక సీజన్‌లో ప్రవాహానికి దెబ్బతిన్న లైనింగ్
ఆర్నెళ్లలోగా పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోకుండా గడువు పొడిగింపు
తాజాగా ఆ పనుల అంచనా వ్యయం రూ.179.71 కోట్ల పెంపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం రెండో ప్రధాన కాలువ లైనింగ్ పనుల్లో రెండో ప్యాకేజీ అంచనా వ్యయాన్ని రూ.158.19 కోట్ల నుంచి రూ.337.90 కోట్లకు పెంచేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేయడం ద్వారా ఈనాడు కిరణ్ వియ్యంకుడు రాయల రఘుకు చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ సంస్థకు భారీ నజరానా ఇచి్చంది. నాసిరకంగా పనులు చేయడం వల్ల ఒక సీజన్‌లో కాలువలో నీటి ప్రవాహానికే.. లైనింగ్ ఎక్కడికక్కడ దెబ్బతింది. కాంట్రాక్టు ఒప్పందం మేరకు ఆర్నెలల్లో పనులు పూర్తిచేయడంలో విఫలమైన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ సంస్థపై చర్యలు తీసుకోవాల్సిన చంద్రబాబు సర్కార్.. పనుల పూర్తికి గడువు పొడగించడమే కాకుండా.. అంచనా వ్యయాన్ని రూ.179.71 కోట్లు పెంచేయడం ద్వారా భారీ ఎత్తున ప్రయోజనం చేకూర్చిందని ఇంజినీరింగ్ నిపుణులు ఎత్తిచూపుతున్నారు.
డీపీటీ (దోచుకో.. పంచుకో.. తినుకో)కి ఇది మరో నిదర్శనమంటూ ఆరోపిస్తున్నారు. హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువకు సిమెంట్ కాంక్రీట్ లైనింగ్ చేస్తే భూగర్బ జలాలు అడుగంటిపోతాయని.. బోరు, బావులు ఎండిపోతాయంటూ రైతులందరూ ముక్తకంఠంతో తీవ్రంగా వ్యతిరేకించినా సరే 216.3 కి.మీ నుంచి 400 కి.మీ వరకు లైనింగ్ చేసే పనులకు రూ.936.70 కోట్లతో 2024 డిసెంబర్ 3న జల వనరుల శాఖ పరిపాలన అనుమతి ఇచ్చింది. ఇందులో రెండో ప్యాకేజీ (ప్రధాన కాలువ 260 కి.మీ నుంచి 300 కి.మీ లైనింగ్‌తోపాటు 285.1 కి.మీ నుంచి 287.1 కి.మీ వరకు టన్నెల్ నిర్మాణ పనులకు రూ.158.19 కోట్లు కేటాయించింది. గతేడాది ఈ పనులకు రూ.117.63 కోట్ల అంచనాతో జల వనరుల శాఖ పిలిచిన టెండర్లలో రూ.123.24 కోట్లకు కోట్ చేసిన ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ సంస్థకు కట్టబెట్టింది.
నాణ్యతకు పాతర.. అక్రమాల జాతర
హంద్రీ–నీవా రెండో దశ ప్రధాన కాలువ లైనింగ్ పనులు ఆర్నెలల్లోగా పూర్తి కావాలన్నది కాంట్రాక్టు ఒప్పందంలోని ప్రధాన నిబంధన. కానీ.. గడువులోగా పనులు పూర్తి చేయడంలో ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ విఫలమైంది. నిబంధనల ప్రకారం ఆ సంస్థపై లిక్విడేటెడ్ డ్యామేజస్ నిబంధన కింద నోటీసు జారీ చేసి.. నష్టపరిహారాన్ని వసూలు చేయాలి. కానీ.. ఆ సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అత్యంత నాసిరకంగా పనులు చేయడంలో 2025 సీజన్‌లో కాలువలో నీటి ప్రవాహానికే లైనింగ్ ఎక్కడికక్కడ దెబ్బతింది. మిగిలిన పనులను 2026 జనవరి నుంచి జూలై వరకు చేశారు.
ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.158.19 కోట్ల నుంచి రూ.337.90 కోట్లకు పెంచేస్తూ జల వనరుల శాఖ పంపిన ప్రతిపాదనపై బుధవారం కేబినెట్ ఆమోదముద్ర వేసేసింది. ఏడాదిలో సిమెంటు, స్టీల్, కంకర, డీజిల్, పెట్రోల్ వంటి ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. పైగా ఇసుక ఉచితం. ఈ నేపథ్యంలో అంచనా వ్యయం పెరగడానికి ఆస్కారమే లేదు. అలాంటప్పుడు ఒకేసారి రూ.179.71 కోట్ల మేర అంచనా వ్యయాన్ని పెంచేయడంలో ఆంతర్యమేమిటని ఇంజినీరింగ్ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. డీపీటీలో భాగంగానే అంచనా వ్యయాన్ని పెంచేశారంటూ ఆరోపిస్తున్నారు.
పోలవరం ఎడమ కాలువలోనూ ఇదే తీరు
పోలవరం ఎడమ కాలువ ఐదో ప్యాకేజీ (93.7 నుంచి 111.487 కిలోమీటర్ల వరకు) పనులను రూ.181.60 కోట్లకు సాబీర్ డ్యామ్ వాటర్ వర్క్స్ 2005 మార్చి 23న దక్కించుకుంది. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక.. ఈ పనుల్లో 5.754 కిలోమీటర్ల కాలువ తవ్వకం, 11.001 కిలోమీటర్ల పొడవున లైనింగ్, 33 కాంక్రీట్ నిర్మాణ పనులను ఏపీడీఎస్‌ఎస్ (ఆంధ్రప్రదేశ్ డీటెయిల్డ్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్)లో 60–సీ నిబంధన కింద సాబీర్ డ్యామ్ వాటర్ వర్క్స్ నుంచి తొలగించింది. ఆ పనులను రూ.142.88 కోట్లకు యనమల వియ్యంకుడు, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే (మైదుకూరు) పుట్టా సుధాకర్ యాదవ్‌కు చెందిన పీఎస్‌కే–హెచ్‌ఈఎస్ (జేవీ)కు 5ఏ ప్యాకేజీ కింద 2016 నవంబర్ 30న నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టింది.
సాబీర్ డ్యామ్ వాటర్ వర్క్స్, పుట్టా సుధాకర్ యాదవ్ సంస్థ చేసిన పనులు పోగా 5, 5ఏ ప్యాకేజీల్లో 2024 నాటికి రూ.81.63 కోట్ల విలువైన పనులు మిగిలాయి. ఆ పనుల వ్యయాన్ని 2023–24 ధరల ప్రకారం రూ.352.60 కోట్లకు పెంచేస్తూ 2024 సెప్టెంబర్ 3న ఉత్తర్వులు జారీ చేసింది. అంటే.. రూ.270.97 కోట్ల మేర అంచనా వ్యయాన్ని పెంచేసినట్లు స్పష్టమవుతోంది. ఈ పనులను ఆర్నెల్లోగా పూర్తి చేయాలని గడువు పెట్టి.. రూ.293.66 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి 2024 అక్టోబర్ 9న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ టెండర్‌లో వాటిని 4.68 శాతం అధిక ధరకు.. అంటే రూ.307.41 కోట్లకు కోట్ చేసిన రాయల రఘుకు చెందిన ‘ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్’కు చంద్రబాబు సర్కార్ కట్టబెట్టింది. అంతటితో ఆగకుండా, ఈ పనుల అంచనా వ్యయాన్ని ఒకేసారి రూ.352.60 కోట్ల నుంచి రూ.796.65 కోట్లకు పెంచేస్తూ 2026 జూన్ 5న సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అంచనా వ్యయం రూ.444.05 కోట్ల మేర పెంచేసినా ఆ పనులను రాయల రఘు సంస్థే చేస్తోండటంపై ఇంజినీరింగ్ నిపుణులు విస్తుపోతున్నారు.


