సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు ఏడాది పాలన సంబరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.7,29,03,156లను ఖర్చు చేసింది. ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో గత ఏడాది జూన్ 23న ఏపీ సచివాలయం వెనుక ఉన్న ప్రాంగణంలో సభ నిర్వహించారు. ఈ సభ ఖర్చులకు సంబంధించి ప్రణాళికా శాఖ జారీ చేసిన ఉత్తర్వులపై ఆర్థికశాఖ పలు వ్యాఖ్యలు చేసింది.
ఈ నేపథ్యంలో ఆ సభ నిర్వహణకు సంబంధించిన ఖర్చులపై ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ గురువారం సవివరమైన ఉత్తర్వులు జారీ చేశారు. మూడు జిల్లాల కలెక్టర్లతోపాటు ఏపీఎస్‌ఆర్‌టీసీ వీసీ అండ్ ఎండీకి ఈ మొత్తం నిధులను విడుదల చేయనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. గుంటూరు జిల్లా కలెక్టర్‌కు రూ.4,94,64,946, కృష్ణా జిల్లా కలెక్టర్‌కు రూ.2,17,76,139, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు రూ.1,15,748, ఏపీఎస్‌ఆర్‌టీసీ వీసీ అండ్ ఎండీకి రూ.15,46,323లు చొప్పున విడుదల చేయనున్నట్లు వివరించారు.


