మేం స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలని కోరడం లేదు
2026 జనవరి 1ని అర్హత తేదీగా తీసుకోవద్దని మాత్రమే చెబుతున్నాం
దీనివల్ల పెద్ద సంఖ్యలో పౌరులు ఓటు హక్కు కోల్పోతారు
స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక, పారదర్శక ఎన్నికలు జరిగే అవకాశం ఉండదు
ఈ విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏకపక్ష వైఖరిని ప్రదర్శిస్తోంది
ఎన్నికలకు సర్ ప్రక్రియ తర్వాతి తుది ఓటర్ల జాబితానే ప్రాతిపదిక కావాలి
హైకోర్టులో వైఎస్సార్‌సీసీ తరఫున ముగిసిన సీనియర్ నాయవాది శ్రీరామ్ వాదనలు
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ముగిసి, తుది ఓటర్ల జాబితాను ప్రచురించిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని వైఎస్సార్‌సీపీ హైకోర్టును అభ్యర్థించింది. ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రమణ్య శ్రీరాం తుది వాదనలు వినిపిస్తూ.. ‘మేం ఎన్నికలను వాయిదా వేయాలని కోరడంలేదు.
సర్ ప్రక్రియ ముగిసి, తుది ఓటర్ల జాబితాను ప్రచురించిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నాం. 2026 జనవరి 1ని అర్హత తేదీగా తీసుకుని అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎస్‌ఈసీ చర్యలు చేపట్టడం సరికాదు. దీనివల్ల పెద్ద సంఖ్యలో పౌరులు ఓటు హక్కు కోల్పోతారు. నామినేషన్ల ముగింపు తేదీ నాటికి జరిగే అన్ని సవరణలను పరిగణనలోకి తీసుకుని అనుబంధ ఓటర్ల జాబితా విడుదలచేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. సర్‌లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో రాష్ట్రంలో సుమారు 15.22 లక్షల మంది మరణించిన వారు, 7.37 లక్షల నకిలీ ఓట్లు, పెద్ద సంఖ్యలో శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్లు నమోదై ఉన్నాయి.
సర్‌ప్రక్రియ పూర్తికాకముందే 01.01.2026 అర్హత తేదీతో పాత, తప్పుల తడకగా ఉన్న అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలకు వెళ్లడం వల్ల ఒకే ప్రాంతంలో అసెంబ్లీకి ఒక జాబితా, స్థానిక సంస్థలకు మరొక జాబితా ఉంటుంది. మరణించిన, నకిలీ ఓటర్లు స్థానిక జాబితాలో కొనసాగడం వల్ల రిజర్వేషన్లు, రోటేషన్ విధానం దెబ్బతింటుంది. పంచాయతీ రాజ్ చట్టం, మున్సిపాలిటీల చట్టం ప్రకారం స్థానిక సంస్థలకు ప్రత్యేకమైన ఓటర్ల జాబితా ఉండదు. అది పూర్తిగా అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగానే తయారవుతుంది. చట్ట సవరణల ద్వారా జూలై 1ని కూడా అర్హత తేదీగా ఆమోదించినప్పటికీ, రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం 01.01.2026 తేదీనే ఎంచుకోవడం ఏకపక్షం.
ఎన్నికల సంఘం తీరు వల్ల స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉండదు. పారదర్శకతకు స్థానం లేకుండా పోతుంది’ అని వివరించారు. కాగా, రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది నర్సీపట్నం అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ, సవరించిన తుది జాబితా కోసం వేచిచూస్తే ఎన్నికల సన్నాహకాలన్నీ వృధా అవుతాయన్నారు. సర్ ప్రక్రియ ముగిసే వరకు స్థానిక ఎన్నికలను ఆపాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ పేర్కొన్నారు.
తీర్పు రిజర్వ్
» సర్ ప్రక్రియ ముగిసి, తుది ఓటర్ల జాబితాను ప్రచురించిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
» బీసీ జనగణన చేపట్టి, అందుకు అనుగుణంగా రిజర్వేషన్ ఖరారు చేసి, ఆ తరువాతే స్థానిక సంస్థలు, గ్రామపంచాయితీలకు ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు దాఖలు చేసిన పిల్‌లో కూడా గురువారం వాదనలు ముగిశాయి. ఈ వ్యాజ్యంలో కూడా సీజే ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ, బీసీ జన గణన చేసిన తరువాతే స్థానిక ఎన్నికలు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పలు సందర్భాల్లో ఇదే హైకోర్టు ఆదేశించిందన్నారు.
» గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలను ఏబీసీడీఈలుగా ఉపవర్గీకరించి రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ విజయనగరం జిల్లాకు చెందిన దుర్గాప్రసాద్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో కూడా వాదనలు ముగిశాయి. ఇందులో కూడా ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.


