జీవో–102 మాయాజాలం
వెనుకబడిన తరగతుల విద్యార్థుల ఆశలపై చంద్రబాబు సర్కారు నీళ్లు
డీఎస్సీకి ముందు స్పోర్ట్స్ కోటా జీవోల తరహాలో 102 జీవో తెచ్చిన ప్రభుత్వం
అత్యుత్తమ ర్యాంక్‌లు సాధించిన రిజర్వేషన్ విద్యార్థులకు ఓపెన్ కేటగిరీలో కాకుండా రిజర్వేషన్ కేటగిరీల్లో సీట్ల కేటాయింపు
70 ఎంబీబీఎస్ సీట్లు నష్టపోతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మెరిట్ విద్యార్థులు
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ పేరిట ప్రతిభావంతులను దగా చేసినట్టే డాక్టర్ కావాలన్న ప్రతిభావంతులైన విద్యార్థుల ఆశలను చంద్రబాబు ప్రభుత్వం నీరుగారుస్తోంది. డీఎస్సీ నోటిఫికేషన్‌కు ముందు కుట్రపూరిత జీవోలు తెచ్చి స్పోర్ట్స్ కోటా కింద టీచర్ పోస్టులను అడ్డదారుల్లో అమ్మేసుకున్నారు. అదే తరహాలో 2026–27 విద్యా సంవత్సరం ఎంబీబీఎస్ ప్రవేశాలకు ముందు జీవో–102 తీసుకొచ్చి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు చంద్రబాబు సర్కారు తీవ్ర అన్యాయం తలపెట్టింది.
నీట్ యూజీ మెరిట్ ఆధారంగా ఓపెన్ కేటగిరీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు దక్కాల్సిన ప్రభుత్వ సీట్లను వారికి దక్కకుండా ప్రభుత్వమే కుట్ర చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండు విడతలుగా ప్రభుత్వ కోటా ఎంబీబీఎస్ సీట్లను ఆరోగ్య విశ్వవిద్యాలయం భర్తీ చేసింది. దీంతో మెరిట్ ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు దక్కాల్సిన 70కు పైగా సీట్లు గల్లంతయ్యాయి.
వైఎస్ జగన్ హయాంలో విద్యార్థులకు మేలు జరిగేలా..
రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో పారదర్శక విధానాలను మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా కార్యదర్శి స్థాయిలోని ఇద్దరు ఐఏఎస్‌లు, ఇద్దరు నిపుణులైన విద్యావేత్తలు, ఇద్దరు న్యాయవాదులతో కమిటీ వేసి అధ్యయనం చేయించింది. ఆ కమిటీ సిఫార్సుల మేరకు 2020 డిసెంబర్‌లో జీవో–151 తెచ్చింది. అప్పటి నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్ సమయంలో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న అన్ని వైద్య, దంత కాలేజీలకు ఒకేసారి ప్రా«ధాన్యత క్రమంలో విద్యార్థులు ఆప్షన్లుగా ఎంచుకునేవారు.
ఈ క్రమంలో కౌన్సెలింగ్ సమయంలో విద్యార్థుల నీట్ ర్యాంక్‌ల ఆధారంగా తొలుత ఓపెన్ కేటగిరీ సీట్లను కేటాయించే వారు. విద్యార్థులు అందుబాటులో ఉన్న అన్ని కాలేజీలను ఆప్షన్లులుగా ఎంచుకోవడంతో వారిచి్చన ప్రాధాన్యత ఆధారంగా తొలుత ఓపెన్ సీట్లన్నీ భర్తీ చేసేవారు. ఓపెన్‌లో సీట్లు దక్కించుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులను మెరిటోరియస్ రిజర్వ్‌డ్ కేటగిరీ (ఎంఆర్‌సీ) కింద పరిగణించి, వారికి తదుపరి స్లైడింగ్ అవకాశం ఇచ్చేవారు. ఓపెన్‌లో సీటు దక్కించుకున్న కాలేజీ కంటే వారి రిజర్వేషన్ కేటగిరీలో ఇంకా మంచి కాలేజీలో సీట్ వస్తే ఇచ్చేవారు. మిగిలిన సీట్లను సైతం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రవేశాల్లో రిజర్వేషన్ల అమలు కోసం ప్రవేశపెట్టిన జీవో–550కు భంగం వాటిల్ల కుండా భర్తీ చేసేవారు.
చంద్రబాబు సర్కారు రాగానే..
ఇలా 2020 నుంచి 2025 వరకూ సాఫీగా సాగిన కౌన్సెలింగ్ ప్రక్రియకు చంద్రబాబు ప్రభుత్వం తెచ్చిన జీవో–102 గొడ్డలి పెట్టుగా మారింది. 2026–27 కౌన్సెలింగ్ ప్రారంభించడానికి ముందు ఈ ఏడాది జూలై 30న ప్రభుత్వం జీవో–102 జారీ చేసింది. అన్ని రౌండ్ల కౌన్సెలింగ్‌కు ఒకేసారి కాకుండా ప్రతి రౌండ్‌కు విద్యార్థులు ఆప్షన్లు నమోదుచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అదేవిధంగా విద్యార్థులు అందుబాటులో ఉన్న కళాశాలలను తప్పనిసరిగా ఆప్షన్లుగా ఎంచుకోవాలన్న నిబంధనను పూర్తిగా ఎత్తేశారు.
ప్రభుత్వమే అన్ని కాలేజీలను ఆప్షన్లుగా ఎంచుకునే అవసరం లేదని తేల్చేయడంతో విద్యార్థులు తమకు నచ్చిన కొన్ని కాలేజీలనే ఆప్షన్లుగా నమోదు చేసుకున్నారు. దీంతో అసాధారణ ప్రతిభ కనబరిచిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు ఓపెన్ కేటగిరీకి కాకుండా వారి రిజర్వేషన్లకు పరిమితం అయ్యే దుస్థితిని ప్రభుత్వమే సృష్టించినట్లయింది.
మెరుగైన ర్యాంకర్‌కు రిజర్వేషన్.. తక్కువ ర్యాంకర్‌కు ఓపెన్
చంద్రబాబు ప్రభుత్వం తెచ్చిన జీవో–102 ఫలితంగా నీట్ యూజీలో అసాధారణ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు రిజర్వేషన్ కేటగిరీలకు, వారి కంటే తక్కువ ర్యాంక్ సాధించిన వారు ఓపెన్ కేటగిరీల్లో సీట్లు పొందాల్సి వచ్చింది. మొదటివిడత సీట్ల కేటాయింపుల్లో ఆంధ్రా యూనివర్సిటీ రీజియన్‌లో ఓపెన్ కేటగిరీలో కటాఫ్ ర్యాంక్ 71,547, ఎస్వీయూ రీజియన్‌లో 94,966 నమోదైంది. అయితే, ఈ రెండు రీజియన్లలోనూ ఓపెన్ కటాఫ్ కంటే ఎంతో మెరుగైన ర్యాంక్ తెచ్చుకున్న విద్యార్థులకు హెల్త్ యూనివర్సిటీ రిజర్వేషన్ విభాగాల్లో సీట్లే కేటాయించింది. ఇలా రెండు రీజియన్లలో 70 మందికిపైగా విద్యార్థులను రిజర్వేషన్ కోటాలోకి తోసేశారు. గుంటూరు మెడికల్ కాలేజీలో 31,325 ర్యాంక్ సాధించిన విద్యార్థికి బీసీ–బీ కేటగిరి కింద సీటు ఇచ్చారు.
ఇదే కాలేజీలో బీసీ–బీ కేటగిరీకి చెందిన 55,233 ర్యాంక్ సాధించిన విద్యార్థికి ఎంఆర్‌సీ కింద సీటు కేటాయించారు. ఇలా 31,325 ర్యాంక్ సాధించిన విద్యార్థి కంటే ఎక్కువ ర్యాంక్ సాధించిన 14 మంది బీసీ–బీ విద్యార్థులు ఎంఆర్‌సీలో గుంటూరు మెడికల్ కాలేజీలోనే సీట్లు దక్కించుకున్నారు. ఇక రెండు రీజియన్లలోనూ ఓపెన్ కటాఫ్ కంటే మెరుగ్గా 23,550, 30,307, 30,611, 31,325, 37,039 వంటి ర్యాంక్‌లు సాధించిన విద్యార్థులను రిజర్వేషన్ విభాగాల్లో సర్దుబాటు చేశారు. సుప్రీంకోర్టు తీర్పులు, జీవో–550 ప్రకారం అసాధారణ ప్రతిభ కనబరిచిన 70 మంది విద్యార్థులు ఓపెన్ కేటగిరీలో సీట్లు దక్కించుకుని ఉంటే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విభాగాలకు చెందిన మరో 70 మందికి ఎంబీబీఎస్ సీట్లు దక్కేవి. అలా దక్కకుండా ప్రభుత్వమే వెనుకబడిన వర్గాల విద్యార్థులకు జీవో–102తో వెన్నుపోటు పొడిచింది.
షరతు ఎత్తేసి.. అన్ని కాలేజీలు ఎంచుకోవాలని సూచన
జీవో–151 ప్రకారం విద్యార్థులు అన్ని కాలేజీలను తప్పనిసరిగా ఆప్షన్లుగా ఎంచుకోవాలనే షరతు ఉండేది. ఈ షరతుతో విద్యార్థులకు అన్యాయం కలిగిన సందర్భాలు రాష్ట్రంలో ఇప్పటివరకూ చోటు చేసుకోలేదు. ఇదిలా ఉండగా అకారణంగా జీవో–151 రద్దు చేసి జీవో–102 తీసుకురావడం ద్వారా విద్యార్థులు అన్ని కాలేజీలను ఎంపిక చేసుకునే పద్ధతిని ఎత్తేసి మొదటి రౌండ్ కౌన్సెలింగ్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు తీవ్రంగా నష్టపోయాక వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ విద్యార్థులకు ఉచిత సలహాలు ఇచ్చారు. అందుబాటులో ఉన్న కాలేజీలను విద్యార్థులు ఎంపిక చేసుకోవాలని సూచించారు. గుంటూరు కాలేజీలో బీసీ–బీ కోటాలో సీటు దక్కించుకున్న విద్యార్థి రెండో రౌండ్‌లో సీటు అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా రెండు ఆప్షన్లు నమోదు చేసిన వెంటనే మిగిలిన కాలేజీలు ఎంపిక చేసుకోవడానికి వీల్లేకుండా పోయింది. దీంతో బాబు సర్కార్ చేసిన మార్పులపైనా విద్యార్థులు, తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


