సాక్షి, విజయవాడ: డిఎస్పీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని.. యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ రెండో రోజు రిలే నిరహార దీక్ష చేపట్టింది. ఆటోనగర్‌లో రిలే నిరాహార దీక్ష చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు.. నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. మోసపోయిన డిఎస్పీ అభ్యర్థులకు న్యాయం కోసం పోరాటం చేస్తున్నామన్నారు.
‘‘యువతను కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పోలీసుల పర్మిషన్ తీసుకుని శాంతియుత కార్యక్రమం చేస్తున్నాం. రెండు రోజుల ముందు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. ఈ రోజు ఉదయం 100 మంది పోలీసులు వచ్చి మా టెంట్ పీకేశారు.. గీత గీసి ముందుకు రాకూడదని ఏసీపీ అంటున్నారు. భారతదేశంలో ఉన్నామా? ఏ కాలంలో ఉన్నాం. భారత రాజ్యాంగం ఏపీలో నడవడం లేదు. చంద్రబాబు, లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది’’ అంటూ దేవినేని అవినాష్ మండిపడ్డారు.
..మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై కోడి గుడ్లతో దాడి చేశారు. టమోటాలతో దాడి చేశారు. టీడీపీ కార్యకర్తలు బాటిల్‌లో యూరిన్ పోసి దాడి చేశారు. ఇంతకంటే దారుణం ఉంటుందా?. దమ్ముంటే సీబీఐ ఎంక్వయిరీ వేయండి. నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పందించండి. రాత్రి అయిన తరువాత పగలు వస్తుంది.. మరో మూడేళ్లు మాత్రమే టీడీపీ అధికారంలో ఉండేది. నిరుద్యోగ యువత, విద్యార్థుల కోసం ప్రతి నియోజకవర్గంలో ర్యాలీలు చేస్తాం’’ అని దేవినేని అవినాష్ పేర్కొన్నారు.


