దగా డీఎస్సీపై ఉద్యమం ఉధృతం | Chandra Babu government brutal actions against YSRCPs peaceful protests | Sakshi
Sakshi News home page

దగా డీఎస్సీపై ఉద్యమం ఉధృతం

Aug 8 2026 4:19 AM | Updated on Aug 8 2026 4:26 AM

Chandra Babu government brutal actions against YSRCPs peaceful protests

వైఎస్సార్‌సీపీ శాంతియుత దీక్షలపై బాబు సర్కారు పాశవిక చర్యలు

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగిన పోలీస్‌ ఆంక్షలు.. పచ్చమూకల దాడులు 

కట్టడిని ఎదుర్కొని రెండో రోజు రిలే దీక్షలు విజయవంతం

ఈ ప్రభుత్వం కొత్త కొత్త జీవోలతో తమ అనుయాయులు, పేకాట రాయుళ్లకు ఉపాధ్యాయ ఉద్యోగాలను కట్టబెట్టిందని బాధిత అభ్యర్థుల మండిపాటు 

డీఎస్సీలో జాబ్‌ రావాలంటే కష్టపడటం ఒక్కటే చాలదు

స్పోర్ట్స్‌ సర్టిఫికెట్, రూ.15 లక్షలు కూడా కావాలని అర్థమైందంటూ ఆగ్రహం.. అక్రమ పద్ధతిలో పోస్టులు భర్తీ చేసి మాకు కనీసం నిరుద్యోగ భృతైనా ఇవ్వరా? అంటూ నిలదీత 

డీఎస్సీ స్కామ్‌కు బాధ్యతగా లోకేశ్‌ రాజీనామా.. సీబీఐ విచారణకు వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ 

ఫీజులు, వసతి దీవెన బకాయిలు వెంటనే విడుదల చేయాలి 

నిరుద్యోగ భృతి సహా యువతకు ఎన్నికల హామీలన్నీ చంద్రబాబు అమలు చేయాల్సిందే 

బెజవాడలో తొలిరోజు బొండా దాడులు.. మలిరోజు బుద్దా బ్యాచ్‌ కవ్వింపు చర్యలు 

తునిలో పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత 

నిరసనలకు జెన్‌జీ మద్దతు వెల్లువెత్తుతుండటంతో టీడీపీ పెద్దల్లో కలవరపాటు 

నేడూ కొనసాగనున్న దీక్షలు.. 10న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలకు వైఎస్సార్‌సీపీ పిలుపు

సాక్షి, అమరావతి :   ‘‘కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాం.. కానీ ఏం లాభం..? మాకు పేకాట రాదు.. బ్రిడ్జి గేమ్‌ సర్టిఫికెట్‌ లేదు.. చంద్రబాబు సర్కారు కొత్త కొత్త జీవోలు ప్రవేశపెట్టి తమ అనుయాయులు, పేకాట రాయుళ్లకు ఉపాధ్యాయ ఉద్యోగాలను కట్టబెట్టింది..! పేకాట తెలియకపోవడమే మా అనర్హతకు కారణమవుతుందని తెలిస్తే ఏదో విధంగా నేర్చుకునే వాళ్లం..!  

డీఎస్సీలో జాబ్‌ రావాలంటే కష్టపడటం ఒక్కటే చాలదు.. ఓ స్పోర్ట్స్‌ సర్టిఫికెట్, రూ.15 లక్షల డబ్బులు కూడా కావాలని అర్థమైంది..!  

అక్రమ పద్ధతిలో టీచర్‌ పోస్టులు భర్తీ చేసి మాకు కనీసం నిరుద్యోగ భృతైనా ఇవ్వరా..!’’ ఇదీ మెగా డీఎస్సీ స్కామ్‌పై రెండో రోజు దీక్షా శిబిరాల వద్ద బాధిత అభ్యర్థుల ఆవేదన!!   

మెగా డీఎస్సీ 2025 స్కామ్‌పై పోరులో భాగంగా రిలే దీక్షలతో వైఎస్సార్‌సీపీ చేపట్టిన శాంతియుత ఉద్యమం రెండో రోజూ నిరసనలతో హోరెత్తగా.. ప్రజాస్వామ్య హక్కులను పాశవికంగా కాలరాస్తూ చంద్రబాబు సర్కారు తన నియంతృత్వ పోకడలను కొనసాగించింది. టీడీపీ మూకల దాడులు, పోలీసుల ఆంక్షలు రెండో రోజు కూడా యథావిధిగా కొనసాగాయి. మెగా డీఎస్సీ స్కామ్‌కు బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాల్సిందేనని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని బాధిత అభ్యర్థులు, నిరుద్యోగులు, జెన్‌జీ యువత నినదించింది. 

ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి సహా ఎన్నికల హామీలన్నీ చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యమానికి జెన్‌జీ మద్దతు రోజురోజుకూ పెరగడం ప్రభుత్వ పెద్దలను తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది. దీంతో రెండో రోజు కూడా ఒకవైపు పోలీసులతో ఆటంకాలు కల్పిస్తూ.. మరోవైపు దీక్షలను భగ్నం చేసేందుకు టీడీపీ గూండాలను బరిలోకి దించారు.  

అనంతపురంలో రిలే దీక్షలో పాల్గొన్న యువతీయువకులకు మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి సంఘీభావం  

బొండాగిరీ బాటలోనే బుద్ధా..! 
బెజవాడలో తొలిరోజు వైఎస్సార్‌ సీపీ శ్రేణుల దీక్షా శిబిరం వద్ద విజయవాడ సెంట్రల్‌ టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ఆయన అనుచరులు దాడులకు తెగబడి అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. బ్రాహ్మణనేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు దీక్షా శిబిరం టెంట్‌ను తొలగించి కోడిగుడ్లు, టమాటాలు, రాళ్లు రువ్వి పచ్చమూకలు కవ్వింపు చర్యలకు దిగాయి. 

ఇక అమానవీయ చర్యలకు పరాకాష్టగా  మరింత దిగజారిపోయి బాటిల్‌లో మూత్రం పట్టుకొచ్చి నిరసనకారులపై చల్లారు. దీనికి కొనసాగింపుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న  గ్యాంగ్‌ వైఎస్సార్‌సీపీ దీక్షా శిబిరం వద్ద శుక్రవారం హల్‌చల్‌ చేసింది. శాంతియుతంగా నిర్వహిస్తున్న నిరసనను భగ్నం చేసేందుకు రెచ్చగొట్టే నినాదాలు చేశారు. పచ్చమూకలు గొడవలు సృష్టించేందుకు యత్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

          విజయవాడలో దీక్ష చేస్తున్న యువత, విద్యార్థులకు మద్దతు పలుకుతున్న దేవినేని అవినాశ్‌

                                   కడపలో రిలే దీక్షలో పాల్గొన్న యువకులు 

రోడ్డుపైనే బైఠాయించిన అబ్బయ్య చౌదరి 
దెందులూరు నియోజకవర్గం మాదేపల్లిలో వైఎస్సార్‌సీపీ చేపట్టిన దీక్షకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిని పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అంటూ వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద రోడ్డుపైనే అబ్బయ్య చౌదరి బైఠాయించారు. మాదేపల్లిలో దీక్షా శిబిరాన్ని తొలగించిన పోలీసులు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.  

                            దెందులూరులో రోడ్డుపై అబ్బయ్యచౌదరి బైఠాయింపు 

                           బెజవాడలో దీక్షాశిబిరం వద్ద టీడీపీ గూండాగిరీ..

తొండంగిలో టెంట్లు తొలగింపు.. 
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగిలో పోలీసుల తీరుతో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్‌ సీపీ రిలే దీక్షలు చేపట్టిన రెండు టెంట్లను పోలీసులు తొలగించారు. గురువారం రాత్రి తొండంగి కార్పొరేషన్‌ బ్యాంక్‌ సమీపంలో ఏర్పాటు చేసిన టెంట్‌ను తొలగించగా శుక్రవారం ఉదయం జియో కార్యాలయం వద్ద టెంట్‌ను తొలగించడంతో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేతల డైరెక్షన్‌లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని  వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. మండుటెండను లెక్క చేయక రోడ్డుపై బైఠాయించి వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిరసన తెలిపాయి.  

దీక్షలకు పెరుగుతున్న జెన్‌ జీ మద్దతు.. 
మెగా డీఎస్సీ 2025 నియామకాల్లో అక్రమాలపై కేంద్ర సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్‌తో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన దీక్షలకు జెన్‌ జీ యువత భారీగా మద్దతు పలుకుతోంది. తిరుపతి నుంచి శ్రీకాకుళం వరకు.. అనంతపురం నుంచి కోనసీమ దాకా దాదాపు అన్ని జిల్లాల్లో యువత, విద్యార్థులు, నిరుద్యోగులు, బాధిత అభ్యర్థులు భారీగా పాల్గొని కూటమి సర్కారు నిర్వాకాలపై మండిపడ్డారు. డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాతోపాటు మొత్తం నియామక ప్రక్రియపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపి, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

నేడు కొనసాగనున్న రిలే దీక్షలు.. 10న భారీ ర్యాలీలు.. 
వైఎస్సార్‌సీపీ చేపట్టిన రిలే దీక్షలు ఈ నెల 8న కూడా అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో కొనసాగుతాయని పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. ఈ నెల 10న రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించనున్నారు. ర్యాలీలు ముగిసిన తర్వాత ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెంచేలా మలిదశ ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నట్లు వైఎస్సార్‌సీపీ వెల్లడించింది.

స్పోర్ట్స్‌ కోటాలో ’పేకాట’.. డీఎస్సీలో లూడో! 
దగా డీఎస్సీపై పార్వతీపురంలో వైఎస్సార్‌ సీపీ స్కిట్‌ 
పార్వతీపురం రూరల్‌: మెగా డీఎస్సీలో ఉపాధ్యాయ పోస్టులను దొడ్డిదారిలో కట్టబెట్టి.. పేకాట, లూడో లాంటి వాటిని ప్రభుత్వం క్రీడా కోటా జాబితాలో చేర్చిందంటూ పార్వతీపురంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు శుక్రవారం వినూత్న రీతిలో నిరసన చేపట్టాయి. పట్టణంలోని వైఎస్సార్‌ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు నేతృత్వంలో రెండో రోజు రిలే నిరాహార దీక్షలు జరిగాయి. 

ఈ సందర్భంగా కూటమి నేతల్లా నటిస్తూ.. పేకాట, లూడో ఆడుతూ గెలుపొందిన వారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కష్టపడి చదివిన అభ్యర్థులను, ప్రతిభావంతులైన క్రీడాకారులను పక్కనపెట్టి.. స్పోర్ట్స్‌ కోటా పేరుతో నకిలీ సర్టిఫికెట్లు సృష్టించారని మండిపడ్డారు. అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ తక్షణమే రాజీనామా చేయాలని, సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు.  

4వ ర్యాంక్‌ సాధించినా నిరాశే..! 
పులివెందులలో డీఎస్సీ బాధిత అభ్యర్థి జిలాని 
పులివెందుల: విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే టీచర్‌ పోస్టుపై ఎంతో మక్కువతో మెగా డీఎస్సీకి రెండేళ్ల పాటు సిద్ధమైనట్లు డీఎస్సీ బాధిత అభ్యర్థి జిలాని పేర్కొన్నాడు. ఇంటికి దూరంగా ఉంటూ కడప, ప్రొద్దుటూరులో డీఎస్సీకి ప్రిపేరైనట్లు చెప్పాడు. శుక్రవారం పులివెందులలోని ఆర్డీవో కార్యాలయం వద్ద తొండూరు మండల ఇన్‌చార్జీ వైఎస్‌ మధురెడ్డి డీఎస్సీ రిలే దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిలాని మాట్లాడుతూ బీఈడీలో 75 శాతంతో ఉత్తీర్ణత సాధించానన్నారు. డీఎస్సీ రాసిన తర్వాత వందకు 71 మార్కులు, టీచింగ్‌లో 69.60 మార్కులు వచ్చాయన్నారు. దీని ప్రకారం తాను నాలుగో ర్యాంకులో ఉన్నట్లు చెప్పాడు. 

కానీ డీఎస్సీలో జాబ్‌ రావాలంటే కష్టపడటం ఒక్కటే కాదు.. ఒక స్పోర్ట్స్‌ సర్టిఫికెట్, రూ.15 లక్షల డబ్బులూ కావాలని అర్థమైందన్నారు. టీజీటీలో ఆరు పోస్టులు ఉండగా.. బీసీలకు నాలుగు పోస్టులు ఉండాలని, కానీ 1, 2, 3వ ర్యాంకర్లకు పోస్టులు ఇచ్చాక  జిల్లాలో 4వ ర్యాంకర్, టీజీటీలో 276వ ర్యాంకర్‌ను తీసేసి 2,217వ ర్యాంక్‌ వచ్చిన వ్యక్తికి పోస్టు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశాడు. డీఎస్సీలో అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, అలాంటి సమయంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ నేనున్నానని చెప్పడంతో ధైర్యం వచ్చిందన్నారు. 

నాకు పేకాట రాదు.. అందుకే ఉద్యోగం రాలేదు! 
నెల్లూరు (వేదాయపాళెం): మెగా డీఎస్సీలో స్పోర్ట్స్‌ కోటా పేరుతో అనేక అక్రమ నియామకాలు జరిగాయని బాధిత అభ్యర్థి షేక్‌ కరీంబాషా వాపోయాడు. శుక్రవారం నెల్లూరులోని కరెంటాఫీసు సెంటర్‌లో వైఎస్సార్‌ సీపీ రిలే నిరాహార దీక్ష శిబిరం వద్దకు స్వచ్ఛందంగా వచ్చిన కరీంబాషా మైకు ద్వారా తనకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తాడు. కొత్త కొత్త జీవోలు ప్రవేశపెట్టి పేకాటను బ్రిడ్జి గేమ్‌ పేరుతో ఒక క్రీడగాపరిగణించి ప్రభుత్వం తమ అనుయాయులు, పేకాట రాయుళ్లకు ఉపాధ్యాయ ఉద్యోగాలను కట్టబెట్టిందని ఆవేదన వ్యక్తం చేశాడు. 

తనకు పేకాట రాదని, తన వద్ద బ్రిడ్జి గేమ్‌ సర్టిఫికెట్‌ లేదని, కానీ తాను కష్టపడి చదివి మంచి మార్కులు సాధించానన్నారు. పేకాట తెలియకపోవడమే తన అనర్హతకు కారణమవుతుందని తెలిసి ఉంటే ఏదో విధంగా పేకాట నేర్చుకునే వాడినన్నాడు. ప్రభుత్వ ఉద్యోగానికి ఈ ఏడాదితో వయో పరిమితి దాటి పోయిందని కన్నీటి పర్యంతమయ్యాడు. అక్రమ పద్ధతిలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టిన చంద్రబాబు సర్కారు తనకు కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదని విమర్శించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement