మీ ప్రభుత్వం ఇంకా ఎంతగా దిగజారుతుంది? | YSRCP President YS Jagan mohan Reddy lashes out at CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

మీ ప్రభుత్వం ఇంకా ఎంతగా దిగజారుతుంది?

Aug 8 2026 4:13 AM | Updated on Aug 8 2026 4:13 AM

YSRCP President YS Jagan mohan Reddy lashes out at CM Chandrababu Naidu

మీ కుమారుడిని కాపాడుకోవడానికి హింసను ప్రేరేపిస్తారా? 

సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  

ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగిన నిరుద్యోగ యువతకు హింసతో సమాధానం చెప్పాలనుకుంటున్నారా? 

పారదర్శకంగా డీఎస్సీ నిర్వహించామని భావిస్తే సీబీఐ విచారణకు భయమెందుకు? 

మీ కుమారుడిని బాధ్యత నుంచి తప్పించకుండా మీ ఎమ్మెల్యేలను, పోలీసులను ఉపయోగిస్తారా? 

శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న శిబిరాలపై దాడులు చేయిస్తారా? 

రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా శిబిరాలపై నిర్బంధకాండ.. వైఎస్సార్‌సీపీ నేతలను నిర్బంధించారు 

మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును కూడా నిరుద్యోగ యువతకు లేకుండా చేశారు  

విద్యా దీవెన, వసతి దీవెన, నిరుద్యోగ భృతి బకాయిలు వెంటనే చెల్లించాలి  

మీరు ఎన్ని చేసినా డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై ఆధారాలను చెరిపేయలేరు 

ఆంధ్రప్రదేశ్‌ జెన్‌ జెడ్‌ గొంతు నొక్కలేరు.. న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు 

సాక్షి, అమరావతి: డీఎస్సీ–2025 ప్రశ్నాపత్రం లీకేజీ, నియామకాల్లో జరిగిన తీవ్రమైన అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన శాంతియుత రిలే నిరాహార దీక్షలపై తమ అనుచరులతో కలిసి టీడీపీ ఎమ్మెల్యేలు దాడులు చేయడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. మీ కుమారుడిని కాపాడుకోవడానికి మీ ప్రభుత్వం ఇంకా ఎంతగా దిగజారుతుంది? అంటూ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగిన నిరుద్యోగ యువతకు హింసతో సమాధానం చెప్పాలనుకుంటున్నారా? అంటూ నిలదీశారు.

నారా లోకేశ్‌ను బాధ్యత నుంచి తప్పించకుండా మీ ఎమ్మెల్యేలను, పార్టీ శ్రేణులను, పోలీసు యంత్రాంగాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు? అంటూ ప్రశ్నించారు. డీఎస్సీ–2025 ప్రక్రియ అంతా పారదర్శకంగానే జరిగిందని మీరు చెబుతున్నప్పుడు, సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు? అంటూ చంద్రబాబును వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. ‘మీరు దీక్షా శిబిరాలను ధ్వంసం చేయవచ్చు.. మీ పోలీసులను, పార్టీ శ్రేణులను ప్రయోగించవచ్చు.. నిరసనకారులను అరెస్టు చేయవచ్చు.. కానీ డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై ఆధారాలను మాత్రం చెరిపేయలేరు.

నిరుద్యోగ యువతలో రగులుతున్న ఆగ్రహాన్ని అణచి వేయలేరు. ఆంధ్రప్రదేశ్‌ జెన్‌–జెడ్‌ గొంతును మూయలేరు. న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు’ అని స్పష్టం చేశారు. రిలే నిరాహార దీక్ష శిబిరాలపై టీడీపీ ఎమ్మెల్యేలు అనుచరులతో కలిసి చేసిన దాడుల వీడియోలను ట్యాగ్‌ చేస్తూ శుక్రవారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో వైఎస్‌ జగన్‌ పోస్టు చేశారు. ఆ పోస్టులో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

ప్రశ్నించే హక్కు లేకుండా చేస్తారా? 
‘‘చంద్రబాబు గారూ.. మీ కుమారుడిని కాపాడుకోవడానికి మీ ప్రభుత్వం ఇంకా ఎంతగా దిగజారుతుంది? నిరుద్యోగ యువతకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని వారు అడిగితే... దానికి మీరు హింసతో సమాధానం చెప్పాలనుకుంటున్నారా? డీఎస్సీ–2025 ప్రశ్నాపత్రం లీక్, నియామకాల్లో జరిగిన తీవ్రమైన అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని కోరుతూ విజయవాడలో శాంతియుతంగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షపై మీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడి చేసి, దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేశారు. పోలీసుల కళ్ల ముందే, వారి సమక్షంలోనే టెంట్లు లాగి పడేశారు. 

మా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు నిరుద్యోగ యువతను లక్ష్యంగా చేసుకుని రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. మహిళలపై దాడులకు తెగబడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా శిబిరాలపై నిర్బంధకాండను కొనసాగించారు. చిలకలూరిపేట, కనిగిరి, యాడికి, తాడి­పత్రి, పలమనేరు, రేపల్లె, గుంటూరు, పొన్నూరు, వేమూరు, మాచర్ల, గురజాల, కందుకూరు, బాపట్లలో నిరసన శిబిరాలపై దాడులు చేశారు. నాయకులను నిర్బంధించారు. శాంతియుతంగా దీక్షలు చేస్తూ మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును కూడా నిరుద్యోగ యువతకు లేకుండా చేశారు. 

సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు? 
నారా లోకేశ్‌ను బాధ్యత నుంచి తప్పించకుండా మీ ఎమ్మెల్యేలను, పార్టీ శ్రేణులను, పోలీసు యంత్రాంగాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు? డీఎస్సీ–2025 ప్రక్రియ అంతా పారదర్శకంగానే జరిగిందని మీరు చెబుతున్నప్పుడు, సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు? ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి కష్టపడి చదివిన యువతకు న్యాయం జరగాలి. నియామకాల్లో జరిగిన అక్రమాలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. ప్రస్తుతం రూ.9,000 కోట్లకు చేరిన విద్యా దీవెన (ఫీజు రీయింబర్స్‌మెంట్‌), వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలి. మీ ఎన్నికల మేనిఫెస్టోలోని సూపర్‌ సిక్స్‌ హామీ ప్రకారం నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతిని, గత రెండేళ్ల బకాయిలతో సహా వెంటనే చెల్లించాలి. 

న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదు  
చంద్రబాబు గారూ.. మీరు దీక్షా శిబిరాలను ధ్వంసం చేయవచ్చు.. మీ పోలీసులను, పార్టీ శ్రేణులను ప్రయోగించవచ్చు.. నిరసనకారులను అరెస్టు చేయవచ్చు.. కానీ డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై ఆధారాలను మాత్రం చెరిపేయలేరు. నిరుద్యోగ యువతలో రగులుతున్న ఆగ్రహాన్ని అణచి వేయలేరు. ఆంధ్రప్రదేశ్‌ జెన్‌ జెడ్‌ గొంతు నొక్కలేరు. న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు’ అని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు.  

చేనేత కార్మికుల ప్రతి అడుగులోనూ తోడుగా నిలిచాం
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు 
ఐదేళ్లలో రూ.3,706.16 కోట్ల సాయం అందించాం  
ఆర్థికంగా, సామాజికంగా మద్దతుగా నిలిచాం 
చేనేత వ్రస్తాలకు దేశ, విదేశాల్లో మార్కెట్‌.. ఈ కామర్స్‌ సంస్థలతో ఒప్పందాలు 
ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేశాం 
ఎన్నికల హామీలను విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వం 
సాక్షి, అమరావతి: చేనేత అనేది కేవలం ఒక వృత్తి కాదని.. మన సంస్కృతికి, సంప్రదాయానికి, తెలుగువారి కళా నైపుణ్యానికి నిలువెత్తు ప్రతీక అని  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని నేతన్నలు, చేనేత కళాకారులు, వారి కుటుంబ సభ్యులందరికీ శుక్రవారం ఆయన హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 2019–24 మధ్య తమ ప్రభుత్వంలో నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపాలని, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని ప్రతి అడుగులోనూ అండగా నిలిచామని చెప్పారు. వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24 వేల చొప్పున ఐదేళ్లలో రూ.1.20 లక్షలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. 

ఈ ఒక్క పథకం ద్వారానే రూ.969.77 కోట్లు అందించామని, నేతన్నల పింఛన్ల కోసం రూ.1,396.45 కోట్లు, ఆప్కో పాత బకాయిల చెల్లింపునకు రూ.468.84 కోట్లు వెచ్చించామని చెప్పారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా మొత్తంగా రూ.3,706.16 కోట్ల సాయం అందించి నేతన్నలకు ఆర్థికంగా, సామాజికంగా మద్దతుగా నిలిచామన్నారు. చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్, పవర్‌లూమ్స్‌కు రాయితీ విద్యుత్‌ అందించామని తెలిపారు. నేతన్నలు తయారు చేసే వస్త్రాలకు దేశ, విదేశాల్లో మార్కెట్‌ కల్పించేందుకు ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని, వారి ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేశామని చెప్పారు.   

ఎన్నికల హామీలకు చంద్రబాబు తూట్లు 
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండేళ్లుగా నేతన్న నేస్తం పథకాన్ని నిలిపి వేసిందని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. ఏడాదికి రూ.25 వేలు అందిస్తామన్న ఎన్నికల హామీని అమలు చేయలేదని విమర్శించారు. హ్యాండ్లూమ్స్‌కు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్లు ఉచిత విద్యుత్‌ ఇస్తామని చెప్పి, ఆ హామీలను కూడా అమలు చేయలేదన్నారు. 

1,03,534 కుటుంబాలకు పథకం వర్తింప జేస్తామని ప్రకటించి, నేడు కేవలం 71,536 కుటుంబాలకు ఇస్తున్నట్లు ప్రకటిస్తున్నారన్నారు. ఆచరణకు వచ్చేసరికి వారిలో ఎంత మందికి ఆ సాయం అందుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌ హామీని కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. నేతన్నల హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం, చేనేత రంగ పరిరక్షణ కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement