breaking news
Satellite communications services
-
జియో మెగా ఐపీఓకు సై!
టెలిక, డిజిటల్ సేవల్లో సంచలనాలు సృష్టిస్తున్న జియో ప్లాట్‌ఫామ్స్ మెగా ఐపీఓకు ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. 49వ వార్షిక వాటాదారుల సమావేశం (ఏజీఎం)లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధిపతి ముకేశ్ అంబానీ పబ్లిక్ ఆఫర్‌ను ప్రకటించారు. శాటిలైట్ కమ్యూనికేషన్స్ రంగంలోకి జియో అడుగుపెడుతుండగా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్లీన్ ఎనర్జీ, కన్జూమర్ వ్యాపారాల్లో భారీ ప్రణాళికలకు రిలయన్స్ తెరతీసింది.ముంబై: ఇన్వెస్టర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జియో పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) దిశగా కీలక అడుగుపడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన జియో ప్లాట్‌ఫామ్స్ డైరెక్టర్ల బోర్డు ఐపీఓకు ఆమోదం తెలిపింది. శుక్రవారం సెబీకి ముసాయిదా పత్రాలను సమరి్పంచినట్లు ఏజీఎంలో ఆర్ఐఎల్ చైర్మన్, ఎండీ ముకేశ్ అంబానీ తెలిపారు. దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా రికార్డులకెక్కనున్న ఈ ఇష్యూ ద్వారా జియో రూ.10 ముఖ విలువ గల 27 కోట్ల తాజా షేర్లను జారీ చేయనుంది. ఐపీఓ ద్వారా జియో రూ.37,700 కోట్ల (4 బిలియన్ డాలర్లు) కోట్లు సమీకరించే అవకాశం ఉందని మార్కెట్ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కంపెనీ మార్కెట్ విలువను 137 బిలియన్ డాలర్లు దాదాపు (రూ.13 లక్షల కోట్లు)గా లెక్కగడుతున్నారు. జియో టాప్... దేశంలో ఇప్పటిదాకా అతిపెద్ద ఐపీఓగా రూ.27,870 కోట్ల ఇష్యూతో హ్యుందాయ్ నిలుస్తోంది. తాజాగా ఎన్ఎస్ఈ రూ.30,000 కోట్ల ఐపీఓ కోసం సెబీకి దరఖాస్తు చేసింది. ఇప్పుడు జియో ఇష్యూ పూర్తయితే ఈ రికార్డులన్నీ చెరిపేసి ‘టాప్’లేపనుంది. కాగా, 2008 తర్వాత రిలయన్స్ గ్రూప్ నుంచి వస్తున్న తొలి ఐపీఓగా కూడా ఇది నిలుస్తుంది.టెలికం టు డిజిటల్ టెక్నాలజీ దిగ్గజం 2016లో సేవలు ప్రారంభించిన జియో.. దశాబ్దకాలంలో దేశ టెలికం స్వరూపాన్ని సమూలంగా మార్చేసింది. భారత్‌లో మొబైల్ డేటా విప్లవాన్ని తీసుకొచి్చంది. ముఖ్యంగా టెలికం నుంచి.. క్లౌడ్ సరీ్వసులు, ఎంటర్ప్రైజ్ సొల్యూషన్లు, ఏఐ ఇలా వివిధ రంగాల్లోకి విస్తరించి.. పూర్తి స్థాయి డిజిటల్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌గా అవతరించింది. ఏఐ ఇన్ఫ్రాతో పాటు ప్రత్యేకంగా భారత్ కోసం ఏఐ లాంగ్వేజ్ మోడల్స్ అభివృద్ది చేసేందుకు ఎని్వడియాతో 2023లో జియో జట్టుకట్టడం తెలిసిందే. 2026 నుంచి ఏడేళ్లలో ఏఐ కార్యకలాపాల కోసం రూ. 10 లక్షల కోట్లను వెచి్చంచనున్నట్లు కూడా అంబానీ ప్రకటించారు. జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఇప్పటికే మెటా, గూగుల్, కేకేఆర్, జనరల్ అట్లాంటిక్, వంటి దిగ్గజ సంస్థలు 20 బిలియన్ డాలర్లకు పైగా ఇన్వెస్ట్ చేశాయి. ప్రస్తుతం జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఆర్ఐఎల్కు 66.43 శాతం వాటా మెజారిటీ వాటా ఉండగా.. మెటా 9.99%, గూగుల్ 7.73% వాటాలను దక్కించుకున్నాయి.ఇక జియో శాటిలైట్ ఇంటర్నెట్...శాటిలైట్ కమ్యూనికేషన్స్ (శాట్‌కామ్)లో సరికొత్త విప్లవానికి జియో శ్రీకారం చుడుతోంది. స్వదేశీ సమాచార ఉపగ్రహాలతో ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు జియో ప్లాట్‌ఫామ్స్ ఎండీ ఆకాశ్ అంబానీ ప్రకటించారు. ‘భారత్‌ను జియో నేలపై అనుసంధానించింది. ఇక అంతరిక్షం నుంచి కూడా కనెక్ట్ చేయాల్సిన తరుణం వచ్చింది. దేశంలో ఇంకా మారుమూల పల్లెల్లో, ద్వీపాల్లో ప్రజలకు టెలికం సేవలు అందుబాటులో లేవు. అలాంటి వారికి శాటిలైట్ కనెక్టివిటీ వారధిగా నిలుస్తుంది. భారత్ కోసం తక్కువ భూకక్ష్యలో తిరిగే స్వేదేశీ ఉపగ్రహ సమూహాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని జియో పరిశీలిస్తోంది’ అని ఆకాశ్ చెప్పారు. శాటిలైట్ టెలికం, బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముందుగా ప్రపంచ దిగ్గజ ఉపగ్రహ నెట్వర్క్ ప్రొవైడర్లతో జట్టుకడతామని, తద్వారా శాటిలైట్ సామర్థ్యాన్ని లీజుకు తీసుకోనున్నట్లు తెలిపారు. ‘సొంతంగా గ్రౌండ్ స్టేషన్ ఇన్ఫ్రాను నెలకొల్పుతాం. స్పేస్ నుంచి గ్రౌండ్ దాకా పూర్తి స్థాయి శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ ఎకోసిస్టమ్ ఏర్పాటే మా లక్ష్యం. ఈ చర్యలతో అంతరిక్ష రంగంలోనూ భారత స్వావలంభనను జియో బలోపేతం చేస్తుంది’ అని ఆకాశ్ పేర్కొన్నారు. కంపెనీ మొబైల్ యూజర్లందరినీ 2030 నాటికి పూర్తిగా 5జీ నెట్‌వర్క్‌లోకి తీసుకురానున్నట్లు చెప్పారు.రిలయన్స్ భవిత భద్రం.. వారసులకు వ్యాపారాల అప్పగింత ప్రణాళిక దాదాపు పూర్తయిందని ముకేశ్ చెప్పారు. ఆకాశ్, ఇషా, అనంత్ అంబానీలు ప్రస్తుతం గ్రూప్‌లోని కీలక వ్యాపారాలకు సారథ్యం వహిస్తున్నారు. రోజువారీ కార్యకలాపాలను వారే చూసుకుంటున్నారు. టెలికం, రిటైల్, డిజిటల్ సర్వీసులు, న్యూ ఎనర్జీల్లో ప్రధాన బిజినెస్‌లతో పాటు గ్రూప్ భవిష్యత్తు వృద్ధిని వారే నడిపిస్తారని ముకేశ్ పేర్కొన్నారు. ‘మీ కంపెనీ భవిష్యత్తు.. రిలయన్స్‌ను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చే వారి చేతుల్లో భద్రంగా ఉంది’ అని వాటాదారులతో ముకేశ్ చెప్పారు. ప్రస్తుతం ఆకాశ్ టెలికం.. ఇషా రిటైల్ విభాగాలను నడిపిస్తుండగా.. అనంత్‌ను గతేడాది రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించడం ద్వారా ఇంధన బిజినెస్‌లను అప్పగించారు.2030కల్లా అత్యంత చౌకగా ఏఐ ప్రతి భారతీయునికి ఏఐని అత్యంత చౌకగా అందించడమే లక్ష్యమని ఆకాశ్ పేర్కొన్నారు. మొబైల్ డేటా విప్లవం మాదిరే ఏఐలోనూ విజయం సాధిస్తామన్నారు. ‘భారత్ కోసం, భారత్ ద్వారా రిలయన్స్ రూపొందిస్తున్న ఏఐతో భవిష్యత్తులో ప్రపంచానికి కూడా సేవలందిస్తాం. ఇందుకోసం జామ్‌నగర్‌లో రిలయన్స్ ఇంటెలిజెన్స్ సొంత ఏఐ బ్యాక్‌బోన్‌ను నెలకొల్పుతోంది. ఈ ఏడాది చివరికల్లా తొలి దశలో 120 మెగావాట్ల ఏఐ ఇన్ఫ్రా ప్రాజెక్టు సిద్ధమవుతుంది’ అని ఆకాశ్ చెప్పారు. ఇప్పటికే ఏఐ కోసం గూగుల్, మెటాలతో జట్టుకట్టామన్నారు. హెల్త్‌కేర్, విద్య, వ్యవసాయ రంగాల కోసం ‘జియోభారత్ఐక్యూ’, ‘ఏఐ వ్యాపార్’ వంటి ప్రత్యేక టూల్స్‌ను ప్రవేశపెడతామని వివరించారు. కాగా, భారత్ కోసం రూపొందించే ఏఐ ప్రాజెక్టుల్లో మన యువ ఇంజినీర్లు పాలుపంచుకోవాలని ముకేశ్ పిలుపునిచ్చారు. ‘ఎక్కడో రూపొందించిన ఏఐని వాడే దేశంగా మనం మిగిలిపోకూడదు. ఏఐ క్రియేటర్‌గా, దాన్ని అదిపుచ్చుకునే శక్తిగా, ప్రపంచ లీడర్‌గా ఎదగాలి’ అని పేర్కొన్నారు.ఏజీఎంలో ఇతర ముఖ్యాంశాలు...→ సోలార్ పవర్, బ్యాటరీలు, పవన విద్యుత్, హైడ్రోజన్, కంప్రెస్డ్ బయో గ్యాస్, బయో ఎనర్జీ, కోల్ గ్యాసిఫికేషన్ వంటి రంగాలపై ఫోకస్ చేయడం ద్వారా భారత ఇంధన భద్రతకు దన్నుగా నిలవడంతో పాటు దేశాన్ని గ్రీన్–క్లీన్ ఎనర్జీ దిశగా నడిపిస్తున్నామని ముకేశ్ చెప్పారు. రానున్న కాలంలో ఆయా రంగాల్లో 2 లక్షల కొలువులు లభిస్తాయనేది కంపెనీ అంచనా. → 2025–26లో రిలయన్స్ మీడియా వ్యాపారం రూ.34,917 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. జియోహాట్‌స్టార్ దేశంలోనే అతిపెద్ద డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌గా ఆవిర్భవించింది. బిలియన్ డౌన్లోడ్ల మార్కును దాటిన తొలి భారతీయ ఓటీటీ సరీ్వసుగా కూడా నిలిచినట్లు ఆకాశ్ చెప్పారు. ఏఐ ఆధారిత కంటెంట్ ప్రొడక్షన్ ప్లాట్‌ఫామ్... జియోస్టార్ జెన్ఏఐ మీడియా స్టూడియో (జామ్స్)ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. → ఎఫ్ఎంసీజీ అనుబంధ సంస్థ రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ 2029–30 నాటికి రూ.లక్ష కోట్ల ఆదాయ మైలురాయి చేరుతుందని రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ ఇషా అంబానీ పేర్కొన్నారు. అతిపెద్ద దేశీ ఎఫ్ఎంసీజీ కంపెనీల్లో ఒకటిగా నిలపాలన్నదే తమ లక్షమని చెప్పారు.‘రిలయన్స్ వాటాదారులకు విలువను చేకూర్చడంలో జియో ఐపీఓ ఈ ఏడాది అత్యంత కీలకమైన మైలురాయిగా నిలుస్తుంది. జియోకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని కొత్త ఇన్వెస్టర్లందరికీ భరోసా ఇస్తున్నా’. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ సీఎండీ -
స్టార్‌లింక్ ఇచ్చేది 20 లక్షల కనెక్షన్లే
న్యూఢిల్లీ: అమెరికన్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థ స్టార్‌లింక్ నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌లాంటి దేశీ టెలికం సంస్థలకు ఎలాంటి పోటీ ఉండబోదని కేంద్ర టెలికం శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ప్రస్తుత సామర్థ్యాలను బట్టి స్టార్‌లింక్ భారత్‌లో గరిష్టంగా 200 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 20 లక్షల కనెక్షన్లు మాత్రమే ఇవ్వగలదని ఆయన తెలిపారు. దీనితో టెలికం సర్వీసులపై ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పారు. ఈ సర్వీసులను పొందాలంటే ముందుగా భారీ మొత్తం వెచ్చించడంతో పాటు ప్రతి నెలా సుమారు రూ. 3,000 వరకు చెల్లించాల్సి రావచ్చని మంత్రి చెప్పారు. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్కి గణనీయంగా కార్యకలాపాలున్న గ్రామీణ, మారుమూల ప్రాంతాలే లక్ష్యంగా శాట్‌కామ్ సర్వీసులు ఉండనున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బీఎస్ఎన్ఎల్ 4జీ సర్వీసుల విస్తరణ పూర్తయిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం మార్కెటింగ్‌పైనే దృష్టి పెడుతున్నట్లు, టారిఫ్‌లు పెంచే ప్రతిపాదనేదీ లేనట్లు మంత్రి వివరించారు. బీఎస్ఎన్ఎల్లో చైనా పరికరాల వినియోగంపై స్పందిస్తూ, పూర్తిగా దేశీ సాంకేతికతల వినియోగానికి ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. -
స్పెక్ట్రం చార్జీ @ 4 శాతం ఆదాయం
న్యూఢిల్లీ: స్టార్లింక్లాంటి శాటిలైట్ కమ్యూనికేషన్ (శాట్‌కామ్) కంపెనీలు అడుగుతున్న దానికంటే అధిక స్థాయిలో స్పెక్ట్రం చార్జీలు విధించేలా కేంద్రానికి టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సులు చేసింది. కంపెనీల సవరించిన ఆదాయాల్లో (ఏజీఆర్) 4 శాతాన్ని చార్జీగా నిర్ణయించాలని పేర్కొంది. ప్రతి మెగాహెట్జ్‌కి వార్షికంగా విధించే రూ. 3,500 స్పెక్ట్రం చార్జీకి ఇది అదనంగా ఉంటుంది. ఇక, పట్టణ ప్రాంతాల్లో ఉపగ్రహ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సరీ్వసులు అందించే ఆపరేటర్లు, ప్రతి యూజరుపై అదనంగా ఏటా రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో సేవలకు మాత్రం అదనంగా చార్జీలేమీ ఉండవు. టెలికం శాఖకు (డాట్) ట్రాయ్ ఈ మేరకు సిఫార్సులు చేసింది. స్పెక్ట్రంను కంపెనీలకు అయిదేళ్ల పాటు కేటాయించాలని, ఆ తర్వాత మరో రెండేళ్లు పొడిగించాలని ట్రాయ్ సూచించింది. శాట్‌కామ్ సరీ్వసులు ప్రారంభమైతే టెలికం నెట్‌వర్క్‌లు లేని మారుమూల ప్రాంతాల్లో కూడా కనెక్టివిటీని అందుబాటులోకి తెచ్చేందుకు వీలవుతుందని ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ లాహోటీ తెలిపారు. శాట్‌కామ్ కంపెనీలు అభ్యరి్ధస్తున్న రేటు కంటే ట్రాయ్ సిఫార్సు చేసిన చార్జీలు గణనీయంగా అధికంగా ఉండటం గమనార్హం. స్పెక్ట్రం చార్జీని ఏజీఆర్‌లో 1 శాతం కన్నా తక్కువగానే ఉంచాలని, అదనంగా చార్జీలేమీ విధించొద్దని ట్రాయ్‌తో సంప్రదింపుల సందర్భంగా స్టార్‌లింక్, అమెజాన్‌కి చెందిన క్విపర్ సిస్టమ్స్ కోరాయి. ఎయిర్టెల్ భాగస్వామిగా ఉన్న యూటెల్‌శాట్ వన్‌వెబ్, జియో ప్లాట్‌ఫామ్స్‌కు ఇప్పటికే శాట్‌కామ్ సేవల లైసెన్సులు లభించాయి. స్టార్‌లింక్ తుది లైసెన్సు తీసుకునే దశలో ఉంది. -
స్టార్‌లింక్ శాట్‌కామ్ వచ్చేస్తోంది..!
న్యూఢిల్లీ: భారత్‌లో శాటిలైట్ కమ్యూనికేషన్ (శాట్‌కామ్) సర్వీసులు ప్రారంభించే దిశగా తదుపరి పూర్తి చేయాల్సిన ప్రక్రియపై అమెరికన్ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్‌లింక్ దృష్టి పెట్టనుంది. ఇప్పటికే టెలికం శాఖ (డాట్) నుంచి ప్రాథమిక అనుమతులు (లెటర్ ఆఫ్ ఇంటెంట్–ఎల్వోఐ) లభించడంతో, ఇక ఒప్పంద నియమాలను అంగీకరిస్తున్నట్లు కంపెనీ సంతకాలు చేయాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అటుపైన నిర్దేశిత ఎంట్రీ ఫీజును చెల్లించాక తుది లైసెన్సు లభిస్తుందని పేర్కొన్నాయి. శాట్‌కామ్ స్పెక్ట్రం ధరను టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సు చేసే ప్రక్రియ తుది దశలో ఉందని, ఎప్పుడైనా దీనిపై ప్రకటన వెలువడొచ్చని వివరించాయి. గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్స్ బై శాటిలైట్ (జీఎంపీసీఎస్), ఐఎస్పీ, వీశాట్ సేవలకు సంబంధించి స్టార్‌లింక్‌నకు ఎల్వోఐ జారీ అయినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. డాట్ లైసెన్సుతో నెట్‌వర్క్‌ను నిర్మించుకోవడానికి స్టార్‌లింక్‌కు అనుమతులు లభించినా, కార్యకలాపాలు ప్రారంభించడానికి ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్–స్పేస్) ఆమోదం, ప్రభుత్వం నుంచి స్పెక్ట్రం అవసరమవుతుంది. ఇప్పటికే వన్‌వెబ్, జియో శాటిలైట్‌కు లైసెన్స్.. ఇప్పటికే యూటెల్‌శాట్ వన్‌వెబ్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థలకు ఈ లైసెన్సులు వచ్చాయి. స్పెక్ట్రంను కేటాయించిన తర్వాత అవి సర్వీసులు ప్రారంభించనున్నాయి. భారత్‌లో లైసెన్సు కోసం కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న స్టార్‌లింక్ ఈమధ్యే దేశీ టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంది. దీనితో భారత్‌లో తమ సొంత పంపిణీ, కస్టమర్ సర్వీస్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాల్సిన భారం లేకుండా, సంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లోకి సేవలను విస్తరించే వీలు చిక్కుతుంది. సుదూరంగా ఉండే జియోస్టేషనరీ ఉపగ్రహాలపై ఆధారపడే సాంప్రదాయ శాటిలైట్ సర్వీసులతో పోలిస్తే భూమికి కొంత సమీపంగా (550 కి.మీ. పైన ) ఉండే ’లో ఎర్త్ ఆర్బిట్’ (లియో) శాటిలైట్లను ఉపయోగిస్తుంది. ప్రస్తు తం ఇవి 7,000 ఉండగా, వీటి సంఖ్య 40,000కు పెరగనుంది. -
శాట్‌కామ్ స్పెక్ట్రంపై చర్చిస్తున్నాం: ట్రాయ్ చైర్మన్
శాటిలైట్ కమ్యూనికేషన్స్‌కి (శాట్‌కామ్) ఉపయోగించే స్పెక్ట్రంను వేలం వేయాలా లేక కేటాయించాలా అనే అంశంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో దీనిపై చర్చల ప్రక్రియ కొనసాగుతోందని ట్రాయ్ చైర్మన్ అనిల్ కుమార్ లాహోటీ తెలిపారు. టెల్కోలతో సమానంగా శాటిలైట్ సంస్థలతో కూడా వ్యవహరించాలన్న టెలికం సంస్థల డిమాండ్‌పై స్పందిస్తూ వివిధ వర్గాలు పలు రకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. అంతర్జాతీయంగా అమల్లో ఉన్నట్లుగా ఈ స్పెక్ట్రంను కేటాయించాలంటూ అమెరికన్ దిగ్గజం స్టార్‌లింక్ కోరుతుండగా, దేశీ టెల్కోలు మాత్రం వేలం వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అంతర్జాతీయంగా పాటిస్తున్న విధానాన్నే దేశీయంగానూ అమలు చేస్తామంటూ కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ట్రాయ్ నిర్దిష్ట రేటు సిఫార్సు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. సింధియా నిర్ణయాన్ని స్టార్‌లింక్ చీఫ్ ఎలాన్ మస్క్ ప్రశంసించారు. -
రెండు కంపెనీలకు ఐఎస్పీ లైసెన్స్
న్యూఢిల్లీ: జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్, భారతి గ్రూప్ ప్రమోట్ చేస్తున్న వన్‌వెబ్ తాజాగా టెలికం శాఖ నుంచి ఇంటర్నెట్ సరీ్వస్ ప్రొవైడర్ (ఐఎస్పీ) లైసెన్స్ అందుకున్నట్టు సమాచారం. శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను అందించేందుకు ఈ రెండు సంస్థలకు ఏడాది క్రితమే అనుమతులు లభించాయి. ఈ కంపెనీలు టెరెస్ట్రియల్ నెట్‌వర్క్‌లతో లేదా వీశాట్ ద్వారా శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను అందించవచ్చని ఒక అధికారి తెలిపారు. -
వన్‌వెబ్ సేవలు చౌకగా ఉండవు..
న్యూఢిల్లీ: శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీసుల సంస్థ వన్‌వెబ్ సేవల టారిఫ్‌లు పాశ్చాత్య దేశాల్లోని మొబైల్ సర్వీసుల రేట్ల స్థాయిలో ఉంటాయని కంపెనీ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ చెప్పారు. ఇవి భారత్‌లో ప్రస్తుతం అత్యంత కనిష్ట స్థాయిలో ఉన్న టారిఫ్‌లకు సమానంగా మాత్రం ఉండబోవని స్పష్టం చేశారు. ఒక ఊళ్లో 30–40 ఇళ్లు ఒక కమ్యూనిటీగా సర్వీసులను వినియోగించుకుంటే కాస్త చౌకగా ఉండవచ్చని కానీ వ్యక్తిగతంగా ఒక్కరు వాడుకోవాలంటే మాత్రం ఖరీదైనవిగానే ఉండవచ్చని మిట్టల్ చెప్పారు. ‘మొబైల్ టారిఫ్‌ల స్థాయిలో శాటిలైట్ కమ్యూనికేషన్ ధర ఉంటుందా అని ప్రశ్నిస్తే .. ప్రస్తుతం పాశ్చాత్య ప్రపంచంలో ఉన్న వాటి స్థాయిలో ఉండవచ్చు. భారత్‌లో మొబైల్ టారిఫ్‌లు నెలకు 2 – 2.5 డాలర్ల స్థాయిలో (సుమారు రూ. 164– రూ. 205) ఉన్నాయి. ఆ రేట్లకు మాత్రం శాటిలైట్ కమ్యూనికేషన్ టారిఫ్‌లు ఉండవు. ఎందుకంటే అవి అత్యంత కనిష్ట రేట్లు‘ అని ఆయన పేర్కొన్నారు. అత్యంత వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు అందించే వన్‌వెబ్‌కు సంబంధించిన 36 ఉపగ్రహాలను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదివారం ప్రయోగించిన సందర్భంగా మిట్టల్ ఈ విషయాలు తెలిపారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఎల్వీఎం–3 (లాంచ్ వెహికల్ మార్క్–3) వీటిని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దీనితో వన్‌వెబ్‌కి ఉన్న ఉపగ్రహాల సంఖ్య 618కి చేరింది. తమకు ఉపగ్రహ సర్వీసులను ఆవిష్కరించేందుకు పర్మిట్ ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పేస్‌కామ్ పాలసీని ప్రవేశపెట్టి, స్పెక్ట్రం కేటాయించే వరకు వేచి ఉండాల్సి ఉంటుందని మిట్టల్ తెలిపారు. భారత్‌లో యూజర్ శాటిలైట్ టెర్మినల్స్ తయారీ కోసం కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్లు వివరించారు. -
వన్‌వెబ్ 40 ఉపగ్రహాల ప్రయోగం..
న్యూఢిల్లీ: శాటిలైట్ కమ్యూనికేషన్స్ కంపెనీ వన్‌వెబ్ తాజా స్పేస్ఎక్స్తో కలిసి 40 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించినట్లు వెల్లడించింది. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కేప్ కెనవెరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి వీటిని ప్రయోగించినట్లు వివరించింది. దీంతో తాము మొత్తం 582 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లయిందని పేర్కొంది. కనెక్టివిటీ సామర్థ్యాలను పెంచుకోవడంలో తమ సంస్థకు ఇదొక కీలక మైలురాయని వన్‌వెబ్ సీఈవో నీల్ మాస్టర్సన్ తెలిపారు. -
Solar Flare: రికార్డు స్థాయిలో సూర్యుడి ఎండ.. జీపీఎస్, విమానాలపై ఎఫెక్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ఏప్రిల్ నెలలోనే భానుడు భగభగమని ఉగ్రరూపం చూపిస్తున్నాడు. బుధవారం సూర్యుడి నుంచి సౌరజ్వాలల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. సమాచార ఉపగ్రహాలు, జీపీఎస్వ్యవస్థల్ని దెబ్బతీసే స్థాయిలో సౌరజ్వాలలతో భానుడు విరుచుకుపడ్డాడు. ఈ విషయాన్ని కోల్కత్తా వేదికగా పనిచేసే సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ స్పేస్ సైన్సెస్(CESSI) ఇండియా వెల్లడించింది. కాగా, భారత కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం 9.27 గంటలకు ఒక్కసారిగా భారీ స్థాయిలో సౌరజ్వాలలు వెలువడ్డాయని.. ఇవి సమాచార ఉపగ్రహాలు, జీపీఎస్ వ్యవస్థలను దెబ్బతీసే స్థాయిలో ఈ సౌరజ్వాలలు ఉన్నాయని సెస్సీ(CESSI) వెల్లడించింది. ఈ సందర్బంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అసోసియేట్ ప్రొఫెసర్ దివ్యేందు నంది మాట్లాడుతూ.. సౌర అయస్కాంత క్రియాశీల ప్రాంతమైన ఏఆర్12992 నుంచి బుధవారం ఉదయం 9.27గంటలకు X2.2 తరగతికి చెందిన సౌరజ్వాలలు వెలువడ్డాయని అన్నారు. ఈ సౌరజ్వాలల ప్రభావం భారత్, ఆగ్నేయాసియా, ఆసియా పసిఫిక్ ప్రాంతంపై ప్రభావం చూపించిందని తెలిపారు. దీని వల్ల హైఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ వ్యవస్థలు స్తంభించిపోవడం, ఉపగ్రహాలు, జీపీఎస్పనితీరులో లోపాలు, ఎయిర్‌లైన్ కమ్యూనికేషన్ వ్యవస్థ ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు. అయితే, ఇలాంటి సౌరజ్వాలలు వస్తాయని ఏప్రిల్ 18నే తమ బృందం అంచనా వేసిందని ఆమె చెప్పారు. దీని ప్రభావాన్ని అంచనా వేసేందుకు తమ బృందం ప్రయత్నిస్తోందని వెల్లడించారు. సౌరజ్వాలలు అంటే.. సౌర వ్యవస్థ నుంచి ఒక్కసారిగా శక్తి వెలువడటాన్నే సౌరజ్వాలలు అంటారు. ఈ సౌరజ్వాలల వల్ల రేడియా సిగ్నల్స్, విద్యుత్ గ్రిడ్స్, నేవిగేషన్ సిగ్నల్స్ ప్రభావితమై.. విమానాలకు, వ్యోమగాములకు ముప్పు ఏర్పడే ప్రమాదముంది. ఇక, సౌరజ్వాలల తీవ్రతను బట్టి నాసా.. వీటిని A నుంచి B, C, M, X వంటి తరగతులుగా విభజించింది. కాగా, బుధవారం వచ్చిన ఎక్స్ తరగతి సౌరజ్వాల అన్నింటికన్నా తీవ్రమైనది. The #sun unleashed a massive #solarflare on Wednesday, which has the potential to impact satellite communications and global positioning systems, the Centre of Excellence in Space Sciences India (CESSI) said.@cessi_iiserkol Read:https://t.co/wnIrwm99db — India Ahead News (@IndiaAheadNews) April 20, 2022 -
శాటిలైట్ కనెక్టివిటీతో పల్లెలకు టెలికం సేవలు
న్యూఢిల్లీ: టెలికం నెట్‌వర్క్స్‌లో శాటిలైట్ కనెక్టివిటీ వినియోగించేందుకు డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డీసీసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆప్టికల్ ఫైబర్ వేయలేని ప్రాంతాల్లో టెలికం సేవలు అందించేందుకు, కఠిన భూభాగాల్లో మొబైల్ టవర్ల అనుసంధానానికి శాటిలైట్ కనెక్టివిటీ ఉపయోగపడుతుంది. 16 రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు అందించేందుకు ప్రతిపాదించిన భారత్‌నెట్ ప్రాజెక్ట్‌కు సైతం డీసీసీ ఆమోదం లభించింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.19,041 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌తో ఈ ప్రాజెక్టుకు చేపట్టనున్నారు. దీని కోసం వారం రోజుల్లో టెండర్లను టెలికం శాఖ పిలవనుంది. భారతీ గ్రూప్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థ వన్‌వెబ్‌లో పెట్టుబడులు పెట్టినందున తాజా నిర్ణయం భారతి ఎయిర్‌టెల్‌కు ప్రయోజనకరంగా ఉంటుంది. -
స్పేస్ స్టార్టప్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకున్న ఎయిర్టెల్
న్యూఢిల్లీ: శాటిలైట్ కమ్యూనికేషన్స్ కంపెనీ వన్‌వెబ్‌లో సునీల్ మిట్టల్‌కు చెందిన భారతీ గ్రూప్ మరిన్ని పెట్టుబడులకు సిద్ధపడుతోంది. తాజాగా 50 కోట్ల డాలర్లు(రూ. 3,700 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది. తద్వారా వన్‌వెబ్‌లో భారతీ గ్రూప్ అతిపెద్ద వాటాదారుగా అవతరించనుంది. దివాలా పరిస్థితులకు చేరిన వన్వెబ్ను గతేడాది యూకే ప్రభుత్వం ఆదుకుంది. గ్లోబల్ ఎల్ఈవో శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థ వన్‌వెబ్‌లో కాల్ ఆప్షన్లో భాగంగా భారతీ గ్రూప్ తాజా పెట్టుబడులను చేపట్టనుంది. మరోవైపు యూటెల్సాట్ 55 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేయనుంది. ఈ లావాదేవీల తదుపరి భారతీకి వన్‌వెబ్‌లో 38.6 శాతం వాటా లభించనుంది. యూకే ప్రభుత్వం, యూటెల్సాట్, సాఫ్ట్‌బ్యాంక్ విడిగా 19.3 శాతం చొప్పున వాటాలు పొందనున్నాయి. చదవండి: SBI: ఎస్బీఐ ‘బేసిక్’ కస్టమర్లకు షాక్ -
నింగిలోకి మరో సమాచార ఉపగ్రహం
ఫ్రెంచిగయానా నుంచి జీశాట్-16 ప్రయోగం ఉపగ్రహ సమాచార సేవలు ఇక మరింత విస్తృతం సూళ్లూరుపేట/బెంగళూరు: భారత్‌లో ఉపగ్రహ సమాచార సేవలు విస్తృతం కానున్నాయి. కొత్త సమాచార ఉపగ్రహం జీశాట్-16ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయవంతంగా నింగికి పంపింది. ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రెంచి గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రం నుంచి ఆదివారం తెల్లవారుజామున 2.10 గంటలకు ‘ఏరియన్-5 వీఏ-221’ రాకెట్ ద్వారా జీశాట్-16ను విజయవంతంగా ప్రయోగించింది. ఆదివారం 32.20 నిమిషాల్లో ప్రయోగాన్ని పూర్తి చేసి జీశాట్-16ను భూస్థిర బదిలీ కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. 2.41 గంటలకు బెంగళూరు హసన్‌లోని ఇస్రో ఉపగ్ర హ నియంత్రణ కేంద్రం ఉపగ్రహాన్ని అధీనంలోకి తీసుకుంది. ఉపగ్రహంలోని అపోజీ మోటార్లను మండించి 36 వేల కి.మీ ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెడతామని, తొలిదశ కక్ష్య పెంపును సోమవారం చేపడతామని ఇస్రో తెలిపింది. డీటీహెచ్ ప్రసారాల్లో నాణ్యత... దేశంలో ట్రాన్స్పాండర్ల కొరతను దృష్టిలో ఉంచుకుని జీశాట్-16లో 48 ట్రాన్స్పాండర్లను అమర్చినట్లు ఇస్రో పేర్కొంది. వీటిలో 12 కేయూ ట్రాన్స్పాండర్లు, 24 సీ బ్యాండ్, 12 ఎక్స్టెండెడ్ సీ బ్యాండ్ ట్రాన్స్పాండర్లు ఉన్నాయని, డీటీహెచ్ వీడియో ప్రసారాల్లో నాణ్యతను పెంచేందుకు ఇవి ఉపయోగపడతాయంది. ఒక జీశాట్ ఉపగ్రహంలో ఇంత పెద్ద సంఖ్యలో ట్రాన్స్పాండర్లను ఇస్రో అమర్చి పంపడం ఇదే తొలిసారి. 3,181.6 కిలోల బరువైన జీశాట్-16 ఉపగ్రహ ప్రయోగానికి రూ. 865 కోట్లు ఖర్చయింది. ఈ ఉపగ్రహం 12 ఏళ్లు సేవలు అందించనుంది. జీశాట్-16 ప్రయోగం విజయంపై ఇస్రో శాస్త్రవేత్తలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ అభినందించారు.


