బెర్లిన్‌లో ఘ‌నంగా భారత్ దివస్ వేడుకలు | Bharat Diwas Celebrated at Berlin’s Iconic Brandenburg Gate | Sakshi
Sakshi News home page

బెర్లిన్‌లో ఘ‌నంగా భారత్ దివస్ వేడుకలు

Aug 17 2026 4:10 PM | Updated on Aug 17 2026 7:09 PM

Bharat Diwas Celebrated at Berlin’s Iconic Brandenburg Gate

బెర్లిన్: జర్మనీలోని భారతీయ ప్రవాసులు ఆగస్టు 16న బెర్లిన్‌లోని చారిత్రక బ్రాండెన్‌బర్గ్ గేట్ వద్ద భారత్ దివస్‌ను ఘనంగా నిర్వహించారు. భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో జర్మనీ నలుమూలల నుంచి భారతీయ సంఘాలు, ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

భారతదేశ ఐక్యత, వైవిధ్యం, గొప్ప సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. తెలంగాణ అసోసియేషన్ చైర్‌పర్సన్, వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రఘు చెల్లిగంటి, యూపీ అసోసియేషన్‌కు చెందిన డాక్టర్ అఖిల్ అగర్వాల్, కాశ్మీరీ సమాజానికి ప్రాతినిధ్యం వహించిన వీణా చౌదరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జర్మనీలోని పలు భారతీయ సంఘాలు, కమ్యూనిటీ సంస్థలు చురుకైన సహకారం అందించాయి.

ఈ వేడుకలకు జర్మనీలో భారత రాయబారి అజిత్ గుప్తా తన సతీమణితో కలిసి హాజరయ్యారు. భారత రాయబార కార్యాలయానికి చెందిన కాన్సులర్ మంత్రి స్టాలిన్ బాబు చీకట్ల, పర్సనల్ మంత్రి డాక్టర్ మందీప్ సింగ్ తులితో పాటు పలువురు ప్రముఖ అధికారులు, అతిథులు పాల్గొన్నారు.

బ్రాండెన్‌బర్గ్ గేట్ వద్ద వందలాది మంది భారతీయ ప్రవాసులు ఒకచోట చేరడంతో దేశభక్తి, ఐక్యత, సోదరభావంతో కూడిన ప్రత్యేక వాతావరణం నెలకొంది. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే రంగురంగుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దేశంలోని భిన్నత్వాన్ని చాటుతూ, అందరినీ త్రివర్ణ పతాకం కింద ఒక్కతాటిపైకి తీసుకువచ్చాయి.

అనంతరం బ్రాండెన్‌బర్గ్ గేట్ నుంచి శాంతి స్తూపం వరకు యూనిటీ వాక్ నిర్వహించారు. శాంతి, స్నేహం, ఐక్యత, పరస్పర సహకారం అనే సందేశాన్ని ఈ వాక్ ద్వారా చాటారు.

జర్మనీలోని భారతీయ సమాజానికి ఈ వేడుక ఒక గర్వించదగిన, చిరస్మరణీయమైన సందర్భంగా నిలిచింది. భారతదేశం పట్ల తమ అనుబంధాన్ని, ఉమ్మడి వారసత్వాన్ని, భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ స్ఫూర్తిని ప్రవాస భారతీయులు ఘనంగా చాటుకున్నారు.

చదవండి: సేవే జీవిత ధ్యేయంగా.. శోభా, ప్రసాద్ రెడ్డి దంపతుల సేవా ప్రస్థానం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement