సాక్షి, లండన్: బ్రిటన్‌లోని గ్లౌసెస్టర్‌షైర్‌లో శ్రీ బాలాజీ ఆలయం నిర్మించాలన్న చిరకాల స్వప్నం సాకారం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ ఆలయాన్ని ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక సేవా కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కమ్యూనిటీ నాయకులతో కలిసి బీబీసీ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆలయ నిర్మాణ ప్రణాళికపై చర్చించారు.
ఈ బీబీసీ ఇంటర్వ్యూలో సతీష్‌రెడ్డి, స్లౌ డిప్యూటీ మేయర్ చంద్ర మువ్వలతో పాటు పలువురు కమ్యూనిటీ నాయకులు పాల్గొన్నారు. గ్లౌసెస్టర్‌షైర్(Gloucestershire)లో బాలాజీ ఆలయాన్ని ఏర్పాటు చేయాలన్న తమ లక్ష్యం, ఇందుకు విస్తృత కమ్యూనిటీ మద్దతు అవసరం గురించి వివరించారు. ఆలయం ప్రస్తుత తరంతో పాటు భవిష్యత్ తరాలకు కూడా ఆధ్యాత్మిక, సాంస్కృతిక అనుబంధానికి వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.
టీటీడీ నిధుల కోసం సంకల్పం
ఈ సందర్భంగా సతీష్ రెడ్డి భారతీయ రాజకీయాలు, కమ్యూనిటీ సేవ తదితర అంశాలపై మాట్లాడారు. బాలాజీ ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నుంచి సహకారం పొందేందుకు కృషి చేస్తానని సంకల్పం తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందుకు ఆయన అందిస్తున్న ప్రోత్సాహం, సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.
‘కమ్యూనిటీ మద్దతుతో కల సాకారం’
బీబీసీ ప్రజెంటర్, కింగ్ చార్లెస్ నియమించిన డిప్యూటీ లెఫ్టినెంట్ మ్యానీ మసీహ్ ఈ ఇంటర్వ్యూలను నిర్వహించారు. బ్రిటన్‌లోని భారతీయ సమాజాల్లో జరుగుతున్న సేవా కార్యక్రమాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు బాలాజీ ఆలయ నిర్మాణ ప్రయత్నాలపై కూడా చర్చించారు. విస్తృత కమ్యూనిటీ మద్దతు, దైవ ఆశీస్సులతో గ్లౌసెస్టర్‌షైర్‌లో బాలాజీ ఆలయం నిర్మించాలన్న చిరకాల ఆకాంక్షను సాకారం చేసుకుంటామని నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చదవండి: ఆస్ట్రేలియాలో ఘనంగా ఐసీఎస్ కన్వెన్షన్ వేడుకలు


