గ్లౌసెస్టర్‌షైర్ ఇంటర్నేషనల్ హిందూ కమ్యూనిటీ అసోసియేషన్ (IHCAG) ఆధ్వర్యంలో నిర్వహించిన 2026 శ్రీ బాలాజీ శ్రీవారి కళ్యాణ మహోత్సవానికి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి మాజీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎమ్మెల్సీ , వైస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగరెడ్డి సతీష్ రెడ్డి, స్లౌ డిప్యూటీ మేయర్ చంద్ర మువ్వల, పలువురు ప్రముఖ కమ్యూనిటీ నాయకులు హాజరై కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమాన్ని టీటీడీ వేద పాఠశాల పూర్వ విద్యార్థులైన అర్చకులు వేదోక్తంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సతీష్ రెడ్డి బీబీసీ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ త్వరలో ప్రసారం కానుంది. ఇంటర్వ్యూ సందర్భంగా IHCAG నిర్వాహకులు, ప్రతినిధి శివరామ రెడ్డి గూడూరు, గ్లౌసెస్టర్‌షైర్‌లో శ్రీ బాలాజీ ఆలయాన్ని నిర్మించాలనే IHCAG లక్ష్యాన్ని వివరించారు. ఈ మహత్తర స్వప్నాన్ని సాకారం చేసేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరి సహకారం, మద్దతు అవసరమని చర్చలో పేర్కొన్నారు. ప్రతిపాదిత ఆలయం ప్రస్తుత, భవిష్యత్ తరాలకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక సేవా కేంద్రంగా నిలవనుంది.
ఈ కార్యక్రమంలో ఇంటర్వ్యూలను నిర్వహించి, మన సమాజం చేస్తున్న విలువైన సేవలను ప్రపంచానికి తెలియజేసిన మానీ మసీహ్‌కి నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆయన మహారాజు కింగ్ చార్లెస్ III నియమించిన డిప్యూటీ లెఫ్టినెంట్, బీసీసీ ప్రజెంటర్‌గా సేవలందిస్తున్నారు.

చర్చల సందర్భంగా సతీష్ రెడ్డి భారతీయ రాజకీయాలు, సమాజ సేవ, సామాజిక బాధ్యత వంటి అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. అలాగే IHCAG ఈ మహత్తర సంకల్పానికి మద్దతుగా సంకల్పం తీసుకుని, తిరుమల తిరుపతి దేవస్థానాలు (TTD) నుంచి అవసరమైన మద్దతు, నిధులను సమకూర్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు సహకరిస్తానని తన నిబద్ధతను వ్యక్తం చేశారు.
ఈ మహోన్నత కార్యక్రమానికి అందించిన ప్రోత్సాహం, మార్గదర్శకత్వం, మద్దతుకు సతీష్ రెడ్డికి నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో, భక్తులు, శ్రేయోభిలాషులు, సమాజంలోని ప్రతి ఒక్కరి నిరంతర సహకారంతో, గ్లౌసెస్టర్‌షైర్‌లో శ్రీ బాలాజీ ఆలయాన్ని నిర్మించాలనే ఎన్నో సంవత్సరాలుగా ఉన్న చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకునే దిశగా ముందుకు సాగుతున్నామన్నారు.


