సేవను జీవిత పరమార్థంగా, దాతృత్వాన్ని జీవన విధానంగా మలుచుకున్న శోభా రెడ్డి, ప్రసాద్ రెడ్డి దంపతులు సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. భారత్‌తో పాటు అమెరికాలోనూ చిన్నారులు, పేద కుటుంబాలు, వెనుకబడిన వర్గాల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
ఇటీవల కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో పాఠశాల విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు ఆహార రవాణా వాహనాల కొనుగోలుకు 25 వేల అమెరికన్ డాలర్ల విరాళం అందించారు. రోజూ సుమారు 15 వేల మంది విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించే లక్ష్యంతో అక్షయపాత్ర ఫౌండేషన్ నిర్మించనున్న వంటశాలకు 2.5 లక్షల డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. నెల్లూరు సమీపంలోని వెంకటాచలం వద్ద ఐదు ఎకరాల భూమి సమీకరణ ప్రక్రియ కొనసాగుతోంది.
అలాగే, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచిత పాదరక్షలు అందించే కార్యక్రమాన్ని ప్రథమ్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో ప్రారంభించారు. తొలిదశలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని పది కేంద్రాల్లో దీనిని అమలు చేస్తున్నారు. ఆరోగ్య సేవల్లోనూ వారి సహకారం విశేషం.
చెన్నైలోని శంకర నేత్రాలయ కోసం అత్యాధునిక మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ ఏర్పాటుకు 5.5 లక్షల అమెరికన్ డాలర్ల విరాళం అందించారు. దీంతో ఈ యూనిట్ ద్వారా మారుమూల ప్రాంతాల్లో నేత్ర వైద్యం, శస్త్రచికిత్సలు అందించనున్నారు. ఇప్పటికే ఏపీలో ఎనిమిది నేత్ర శిబిరాలు నిర్వహించగా, తదుపరి శిబిరాన్ని తమిళనాడులో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ప్రసాద్ రెడ్డి శంకర నేత్రాలయ యూఎస్‌ఏకు బోర్డు సలహాదారుగా, బ్రాండ్ అంబాసిడర్‌గా సేవలందిస్తున్నారు. అలాగే, తన సంస్థ లాభాల్లో సుమారు 13 శాతాన్ని ప్రతి ఏడాది డల్లాస్ ప్రాంతంలోని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందిస్తున్నారు. ఈ సేవలకు గుర్తింపుగా న్యూజెర్సీ సెనెట్, అసెంబ్లీ ఆయనను సత్కరించాయి. శంకర నేత్రాలయం ప్రతిష్ఠాత్మక ‘శంకర రత్న’ పురస్కారంతోనూ ఆయనను గౌరవించనుంది.
ప్రసాద్ రెడ్డి సేవా ప్రస్థానంలో తన భార్య శోభా రెడ్డి ప్రోత్సాహం, సహకారం కీలకంగా నిలుస్తున్నాయి. చిన్నారుల సంక్షేమం, విద్య, పోషకాహారం, ఆరోగ్యం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఈ దంపతులు చేస్తున్న సేవలు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.


