
ఆ సంస్థతో టెల్కోలకు పోటీ ఉండదు
కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ: అమెరికన్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థ స్టార్‌లింక్ నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌లాంటి దేశీ టెలికం సంస్థలకు ఎలాంటి పోటీ ఉండబోదని కేంద్ర టెలికం శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ప్రస్తుత సామర్థ్యాలను బట్టి స్టార్‌లింక్ భారత్‌లో గరిష్టంగా 200 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 20 లక్షల కనెక్షన్లు మాత్రమే ఇవ్వగలదని ఆయన తెలిపారు. దీనితో టెలికం సర్వీసులపై ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పారు. ఈ సర్వీసులను పొందాలంటే ముందుగా భారీ మొత్తం వెచ్చించడంతో పాటు ప్రతి నెలా సుమారు రూ. 3,000 వరకు చెల్లించాల్సి రావచ్చని మంత్రి చెప్పారు.
ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌కి గణనీయంగా కార్యకలాపాలున్న గ్రామీణ, మారుమూల ప్రాంతాలే లక్ష్యంగా శాట్‌కామ్ సర్వీసులు ఉండనున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సర్వీసుల విస్తరణ పూర్తయిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం మార్కెటింగ్‌పైనే దృష్టి పెడుతున్నట్లు, టారిఫ్‌లు పెంచే ప్రతిపాదనేదీ లేనట్లు మంత్రి వివరించారు. బీఎస్‌ఎన్‌ఎల్‌లో చైనా పరికరాల వినియోగంపై స్పందిస్తూ, పూర్తిగా దేశీ సాంకేతికతల వినియోగానికి ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు.