భద్రత చర్యలపై దృష్టి పెట్టండి
పరిశ్రమకు సీఈఏ అనంత నాగేశ్వరన్ సూచన
న్యూఢిల్లీ: కృత్రిమ మేథతో (ఏఐ) పొంచి ఉన్న రిస్క్ లను ఆర్థిక రంగం తేలిగ్గా తీసుకోకూడదని ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి. అనంత నాగేశ్వరన్ హెచ్చరించారు. వేరే ఏఐ సిస్టమ్‌లలోకి చొరబడేందుకు ఏఐ ఏజెంట్లు ప్రయత్నం చేస్తున్న ఉదంతాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో టెక్నాలజీతో ప్రయోజనాలు పొందాలనే తాపత్రయంతో దాన్ని వాడుకోవడానికి ముందు, దాన్నుంచి తలెత్తే రిస్క్ లను ఎదుర్కొనే భద్రత చర్యలపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఏఐ ముప్పులు వాస్తవ రూపం దాల్చే వరకు పట్టించుకోకుండా చూస్తూ కూర్చునేంత సమయం మన దగ్గర లేదన్నారు. పరిశ్రమల సమాఖ్య అసోచాం నిర్వహించిన మూడో ఫిన్టెక్ ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు పేర్కొన్నారు. ఏఐ సామర్థ్యం పెరిగినా, వినియోగం మానవ పర్యవేక్షణలోనే ఉండాలని వివరించారు.
కొన్ని వర్గాలను వడపోసి, వేరు చేసేందుకు ఏఐ ఒక సాధనంగా మారకూడదని చెప్పారు. మరోవైపు, ఆర్థిక సంస్థలు తమ కస్టమర్ల రుణార్హతలను మరింత సమర్థ్ధవంతంగా విశ్లేషించేందుకు, డిఫాల్ట్ రిస్క్ లు.. ఆర్థిక ఒత్తిళ్ల గురించి ముందస్తుగానే హెచ్చరించేందుకు ఏఐ సహాయకరంగా ఉండగలదని నాగేశ్వరన్ చెప్పారు. ఎకానమీలోని వివిధ రంగాలు సాంకేతికతను వినియోగించుకోవడానికి ఫిన్టెక్ రంగం తోడ్పడుతుందని ఆయన తెలిపారు.
రాబోయే 20 ఏళ్లు సవాళ్లమయం..
1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాక గడిచిన మూడు దశాబ్దాలతో పోలిస్తే రాబోయే 20 ఏళ్లు చాలా గడ్డుకాలంగా గడిచే అవకాశం ఉందని నాగేశ్వరన్ చెప్పారు. వాతావరణం, సాంకేతికత, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, సామర్థ్యాలను ఆయుధాలుగా వినియోగించుకునే ధోరణులు పెరుగుతుండటం తదితర సవాళ్లు ఇందుకు కారణమని వివరించారు. వీటన్నింటినీ అధిగమించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో వస్తు, సేవల వ్యాపార పరిమాణాన్ని పెంచుకోవడం చాలా కీలకమని ఆయన చెప్పారు.


