ఇదే జరిగితే.. బంగారం ధరలు మరింత పైకి! | Gold Prices Surge Above 4300 Dollars Will Gold Rates Rise Further in Coming Days | Sakshi
Sakshi News home page

ఇదే జరిగితే.. బంగారం ధరలు మరింత పైకి!

Aug 7 2026 6:36 PM | Updated on Aug 7 2026 7:28 PM

Gold Prices Surge Above 4300 Dollars Will Gold Rates Rise Further in Coming Days

బంగారం ధరలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ రేట్లు భారీగా పెరిగి ఔన్స్‌కు 4,300 డాలర్ల స్థాయిని దాటాయి. ఈ వారం మొత్తం చూస్తే.. బంగారం ధరలు 6 శాతానికి పైగా పెరిగాయి. ఈ ఏడాది జనవరి తర్వాత ఒక వారంలో నమోదైన అతిపెద్ద పెరుగుదల ఇదే కావడం గమనార్హం.

బంగారం వైపు పెట్టుబడులు
అమెరికా ఆర్థిక పరిస్థితి, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు, డాలర్ విలువలో మార్పులు ప్రస్తుతం బంగారం ధరలను ప్రభావితం చేస్తున్న ప్రధాన అంశాలుగా మారాయి. ఆర్థిక అనిశ్చితి ఉన్న సమయంలో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. ప్రస్తుతం అమెరికా వడ్డీ రేట్లపై స్పష్టత లేకపోవడం, ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు పెరగడంతో పెట్టుబడులు బంగారం వైపు వెళ్తున్నాయి.

ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్‌లో వడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయం మార్కెట్లకు కీలకంగా మారింది. వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు పెరిగితే డాలర్ బలహీనపడుతుంది. దాని ప్రభావంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

బంగారం ధరలు మరింత పెరుగుతాయా?
ఇక అమెరికా జూలై నెల ఉద్యోగాల నివేదికపై మార్కెట్ వర్గాల దృష్టి ఉంది. ఈ నివేదికలో కొత్తగా ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, నిరుద్యోగ రేటు ఎలా ఉంది, వేతనాల వృద్ధి ఎలా ఉందనే వివరాలు తెలుస్తాయి. మార్కెట్ అంచనాల ప్రకారం జూలైలో సుమారు 80 వేల కొత్త ఉద్యోగాలు రావచ్చని భావిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంతో పోలిస్తే ఇది పెద్ద వృద్ధి కాదని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగాల డేటా బలంగా వస్తే ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై వెనక్కి తగ్గే అవకాశం ఉండటంతో డాలర్ బలపడవచ్చు, దీనివల్ల బంగారం ధరలు కొంత తగ్గవచ్చు.

మరోవైపు అమెరికా ఉద్యోగాల నివేదిక బలహీనంగా వస్తే ఆర్థిక మాంద్యం భయాలు పెరిగే అవకాశం ఉంది. అప్పుడు పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తులైన బంగారం వైపు మరింతగా ఆకర్షితులవుతారు. డాలర్ బలహీనపడితే బంగారం ధరలు మరింత పెరిగి 4,380 డాలర్ల స్థాయిని చేరే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగితే ధరల్లో హెచ్చుతగ్గులు కూడా ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement