యుద్ధాలతోనే వారికి భారీ లాభాలు: కియోసాకి కామెంట్స్‌ | Every War Made Some People Wealthy: Robert Kiyosaki on Iran War Impact | Sakshi
Sakshi News home page

యుద్ధాలతోనే వారికి భారీ లాభాలు: కియోసాకి కామెంట్స్‌

Aug 7 2026 4:41 PM | Updated on Aug 7 2026 4:51 PM

Robert Kiyosaki says EVERY WAR IN HISTORY MADE SOME PEOPLE WEALTHY

యుద్ధాలు సామాన్య ప్రజలకు తీవ్ర నష్టాన్ని, ఆర్థిక భారాన్ని మిగిల్చినా.. కొన్ని రంగాల్లోని కంపెనీలు, పెట్టుబడిదారులకు మాత్రం భారీ లాభాలను తెచ్చిపెడతాయని ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత, ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ రచయిత రాబర్ట్‌ కియోసాకి పేర్కొన్నారు. ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో ఆయన ఫేస్‌బుక్‌లో చేసిన తాజా పోస్టులో యుద్ధాలు, ద్రవ్యోల్బణం, కమోడిటీ ధరలు, రియల్‌ ఆస్తుల మధ్య సంబంధాన్ని వివరించారు.

చరిత్రలో జరిగిన దాదాపు ప్రతి పెద్ద యుద్ధం కొంతమందిని అపారంగా సంపన్నులను చేసిందని కియోసాకి అన్నారు. ప్రస్తుత ఇరాన్‌ యుద్ధం కూడా ఇందుకు భిన్నంగా లేదని పేర్కొన్నారు. యుద్ధ సమయంలో చమురు, రక్షణ రంగాలకు చెందిన కంపెనీలు భారీగా లాభపడుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇంధన సరఫరాలకు అంతరాయం ఏర్పడటంతో చమురు ధరలు పెరగడం, అదే సమయంలో ఆయుధాల డిమాండ్‌ పెరగడం వంటి పరిణామాలు ఆయా రంగాల కంపెనీలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇరాన్‌ యుద్ధం కారణంగా గ్లోబల్‌ ఎనర్జీ మార్కెట్లలో తీవ్ర అంతరాయాలు ఏర్పడటంతో షెల్‌ వంటి చమురు సంస్థలు భారీ లాభాలను నమోదు చేశాయి. 2026 తొలి త్రైమాసికంలో షెల్‌ సుమారు 6.9 బిలియన్‌ డాలర్ల లాభాన్ని ప్రకటించింది. మరోవైపు రక్షణ రంగంలో లాక్‌హీడ్‌ మార్టిన్‌, ఆర్‌టీఎక్స్‌, బోయింగ్‌, నార్త్‌రోప్‌ గ్రమ్మన్‌ వంటి సంస్థలు భారీ ఆర్డర్‌ బ్యాక్‌లాగ్‌లను నమోదు చేశాయి. యుద్ధం కారణంగా ఆయుధ నిల్వలను తిరిగి నింపేందుకు ప్రభుత్వాలు రక్షణ వ్యయాన్ని పెంచుతున్నాయని నివేదికలు వెల్లడించాయి.

కియోసాకి తన పోస్టులో మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, వియత్నాం యుద్ధం, గల్ఫ్‌ యుద్ధం, ఇరాక్‌, ఉక్రెయిన్‌ వంటి సంఘర్షణలను ప్రస్తావించారు. యుద్ధాల సమయంలో సరఫరా వ్యవస్థలు దెబ్బతినడం వల్ల చమురు, ఇతర కమోడిటీల ధరలు పెరుగుతాయని.. దీంతో రియల్‌ ఆస్తులు, కమోడిటీలను కలిగి ఉన్నవారికి లాభాలు వచ్చే అవకాశం ఉంటుందని వివరించారు.

అయితే ఈ ధరల పెరుగుదల భారాన్ని సాధారణ ప్రజలు భరించాల్సి వస్తుందని కియోసాకి పేర్కొన్నారు. పెట్రోల్‌, విద్యుత్‌, ఆహారం, రవాణా వంటి వాటి ధరలు పెరగడం ద్వారా యుద్ధ ప్రభావం సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై పడుతుందని అన్నారు. మరోవైపు చమురు, రక్షణ రంగాల్లో పెట్టుబడులు పెట్టిన వారికి అధిక రాబడులు వచ్చే పరిస్థితి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరాన్‌ యుద్ధం ప్రారంభమైన తర్వాత అమెరికాలో ఇంధన ధరలు కూడా గణనీయంగా పెరిగినట్లు నివేదికలు పేర్కొన్నాయి.

ప్రతి సంక్షోభంలోనూ లాభపడుతున్నదెవరు?

తన ‘రిచ్‌ డాడ్‌’ తనకు దశాబ్దాల క్రితమే ఈ విధానాన్ని వివరించారని కియోసాకి తెలిపారు. సంక్షోభ సమయంలో డబ్బు ఏ దిశగా వెళ్తుందో గుర్తించడం కీలకమని పేర్కొన్నారు. ‘‘ప్రతి సంక్షోభంలో ట్రేడ్‌లో సరైన వైపు ఎవరు ఉన్నారో తెలుసుకోండి. ఆ తర్వాత మీరు ఏ వైపు ఉన్నారో ప్రశ్నించుకోండి’’ అనే సందేశాన్ని తన పోస్టులో పంచుకున్నారు. యుద్ధాలు కేవలం భౌగోళిక, రాజకీయ పరిణామాలను మాత్రమే కాకుండా.. చమురు, కమోడిటీలు, సరఫరా వ్యవస్థలు, కరెన్సీలు, ద్రవ్యోల్బణం, స్టాక్‌ మార్కెట్లపైనా ప్రభావం చూపుతాయని కియోసాకి తన పోస్టులో వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement