పెట్టుబడుల గురించి చెప్పే రాబర్ట్ కియోసాకి.. డబ్బు వల్ల వచ్చే సమస్యల గురించి వివరించారు. దీనికి సంబంధించిన పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
1973లో రిచ్ డాడ్ ఒక ప్రశ్న అడిగారని, దాన్ని తాను ఇప్పటికీ మర్చిపోలేదని చెబుతూ.. 'డబ్బుకు సంబంధించిన సమస్యలు రెండు రకాలు మాత్రమే ఉంటాయి' అని అన్నారు. ఒకటి 'డబ్బు సరిపోకపోవడం', మరొకటి 'డబ్బు మరీ ఎక్కువగా ఉండటం'. నేను రెండింటినీ చూస్తూ పెరిగానని కియోసాకి పేర్కొన్నారు.
పూర్ డాడ్ ఎప్పుడూ సరిపడా డబ్బు లేదనే బాధతో ఉండేవారు. రిచ్ డాడ్ పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నం.
చాలామంది జీవితంలో డబ్బు సరిపోకపోవడమే పెద్ద సమస్యగా ఉంటుంది. నెలవారీ ఖర్చులు, అప్పులు, పిల్లల చదువు, వైద్యం, ఇంటి అవసరాలు.. ఇలా ఎన్నో ఖర్చుల మధ్య సంపాదించిన డబ్బు సరిపోదని బాధపడుతుంటారు. కానీ మరోవైపు డబ్బు ఎక్కువగా ఉన్నవారికి దాన్ని ఎలా నిర్వహించాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎలా కాపాడుకోవాలి, ఎలా మరింత పెంచుకోవాలి అనే సమస్యలు ఉంటాయి. అంటే సమస్య ఇద్దరికీ ఉంది. కానీ సమస్య స్వభావం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
మన ఆలోచనలే ఆర్థిక ప్రపంచం!
అయితే కియోసాకి మాత్రమే.. మన ఆలోచనలే మన ఆర్థిక ప్రపంచాన్ని నిర్మిస్తాయని అంటారు. అంటే మనం డబ్బును ఎలా చూస్తామో, దాని ఆధారంగానే మన నిర్ణయాలు మారుతాయి. ఎప్పుడూ నా దగ్గర డబ్బు లేదు, నాకు ఇది సాధ్యం కాదు, నా సంపాదనతో ఇవన్నీ చేయలేను అని ఆలోచించే వ్యక్తి అవకాశాల కంటే సమస్యలనే ఎక్కువగా చూస్తాడు. డబ్బు కొరతే తన జీవితంలో సహజమైన పరిస్థితి అని భావిస్తాడు.

అదే వ్యక్తి.. నేను దీన్ని ఎలా సాధించగలను?, ఇంకా ఎక్కువ సంపాదించడానికి ఏం చేయాలి?, నా డబ్బును ఎలా పెంచుకోవాలి? అని ఆలోచించడం ప్రారంభిస్తే.. అతని దృష్టి సమస్య నుంచి పరిష్కారం వైపు మళ్లుతుంది. నాకు సాధ్యం కాదు అనే ఆలోచనకు బదులు ‘ఎలా సాధ్యం?’ అని ఆలోచిస్తే.. సమస్యలు తగ్గుతాయంటారు కియోసాకి.
పోటీ ప్రపంచం..
మన చుట్టూ ఉన్న ప్రపంచంలో పోటీ ఎక్కువగా కనిపిస్తుంది. మంచి ఉద్యోగం కోసం పోటీ, ప్రమోషన్ కోసం పోటీ, మంచి మార్కుల కోసం పోటీ.. ఇలా ప్రతి దశలోనూ ఇతరులతో పోల్చుకోవడం జరుగుతుంది. ఇలాంటి ఆలోచన మారాలి. అంటే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని, ఇతరులు పొందితే మనకు దక్కదని భావించకూడదు. ఒక అవకాశం దక్కకపోతే మరో అవకాశం ఉంటుందని, కొత్త మార్గాలను సృష్టించుకోవచ్చని ఆలోచించాలి.
నిజమైన సంపద
నిజమైన సంపద అనేది కేవలం బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బుతోనే నిర్ణయించబడదు. మనకు వచ్చే ఆదాయాన్ని ఎలా నిర్వహిస్తున్నాం? ఎంత పొదుపు చేస్తున్నాం? ఎలా పెట్టుబడి పెడుతున్నాం? కొత్త ఆదాయ మార్గాలను ఎలా సృష్టించుకుంటున్నాం? వంటి అంశాలు కూడా ముఖ్యమే. అందుకే ఈ మొత్తం ఆలోచనలో ప్రధాన సందేశం.. బయటి ఆర్థిక పరిస్థితులను మార్చాలంటే ముందుగా డబ్బుపై మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. అయితే కేవలం సానుకూలంగా ఆలోచించడం వల్లే సంపద ఏర్పడదు. ఆలోచనతో పాటు ఆర్థిక జ్ఞానం, క్రమశిక్షణ, పొదుపు, సరైన పెట్టుబడులు, రిస్క్‌ను అర్థం చేసుకోవడం, నైపుణ్యాల అభివృద్ధి కూడా అవసరం.


