‘శాప్‌’కు ఇప్పుడు బుద్దొచ్చిందా! | Jobs for 372 people under sports quota in Mega DSC without any examinations: AP | Sakshi
Sakshi News home page

‘శాప్‌’కు ఇప్పుడు బుద్దొచ్చిందా!

Sep 19 2026 5:17 AM | Updated on Sep 19 2026 5:17 AM

Jobs for 372 people under sports quota in Mega DSC without any examinations: AP

‘ఏపీఈఏపీసెట్‌’లో అడ్మిషన్ల కోసం స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థులకు స్కిల్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నామంటూ శాప్‌ విడుదల చేసిన ఆదేశాలు

మెగా డీఎస్సీలో ఎలాంటి పరీక్షలు లేకుండా స్పోర్ట్స్‌ కోటాలో 372 మందికి ఉద్యోగాలు

ఆడని ఆటలో, జరగని క్రీడలో పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లకే ఉపాధ్యాయ కొలువులు

అడ్డంగా దొరికిపోవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత

‘ఏపీఈఏపీసెట్‌’లో స్పోర్ట్స్‌ కోటా అభ్యర్ధులకు స్కిల్‌ టెస్ట్‌ చేయాలని నిర్ణయం

ఇదే తరహా పరీక్ష ఆ 372 మందికీ నిర్వహించాలని సర్వత్రా డిమాండ్‌

సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీలో ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే స్పోర్ట్స్‌ కోటాలో 372 మందికి ఉద్యోగాలిచ్చేసింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. ఆడని ఆటలో, జరగని క్రీడలో తప్పుడు ధృవపత్రాలు.. పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లతో ఉపాధ్యాయ కొలువులు కట్టబెట్టింది. ఈ కుంభకోణం వెలుగులోకి రావడంతో అడ్డంగా దొరికిపోయింది. దాంతో అభ్యర్థులు, నిరుద్యోగులు సర్కారు తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. 372 మందికి స్కిల్‌ టెస్ట్‌ నిర్వహిస్తే వారు క్రీడాకారులో కాదో తేలిపోతుంది కదా.. ఆ పని ఎందుకు చేయడం లేదని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

ఇకపై ఆ ప్రయత్నం చేసేందుకు ప్రయత్నిస్తామని అధికారులు సైతం ఇటీవల మీడియా ముఖంగా వెల్లడించారు. తాజాగా ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏపీఈఏపీసెట్‌)లో స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థులకు స్కిల్‌ టెస్ట్‌ చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 21న ఉదయం 8 గంటలకు గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో స్కిల్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు గురువారం ప్రకటించింది. అనుభవజ్ఞులైన శిక్షకులు(కోచ్‌), ఫిజికల్‌ డైరెక్టర్లు (పీడీ) సమక్షంలో ఈ పరీక్ష జరుగుతుందని వెల్లడించింది.

ఈ పరీక్షకు అభ్యర్థులు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేసింది. డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటాలో టీడీపీ నేతల చేతుల్లోని సంఘాలు చెప్పినదానికల్లా శాప్‌ తలాడించిందని, నిబంధనలు సైతం వారి కోసం పక్కనపెట్టిందనే విషయం బట్టబయలైన విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగా అనేక సాక్ష్యాలు సైతం వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో మరోసారి అదే తప్పు చేశారనే మాట వస్తుందని భయపడిన ‘శాప్‌’.. ఏపీఈఏపీసెట్‌లో స్కిల్‌ టెస్ట్‌కు తెరదీసింది. అయితే ఇదే పని డీఎస్సీలో ఉద్యోగాలిచ్చేటప్పుడు ఎందుకు చేయలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అప్పుడు కూడా ఇదే విధంగా స్కిల్‌ టెస్ట్‌ చేసి ఉంటే, నకిలీలు బయటపడేవి. అర్హులైన క్రీడాకారులకు ఉపాధ్యాయులుగా ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చి ఉండేవి. ఇప్పుడైనా సరే ఆ 372 మందికి స్కిల్‌ టెస్ట్‌ నిర్వహించాలని అభ్యర్థులు, నిరుద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement