చిన్న గుడ్లు.. దండిగా దుడ్లు! | Anganwadi Egg Supply Scam: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

చిన్న గుడ్లు.. దండిగా దుడ్లు!

Sep 19 2026 4:41 AM | Updated on Sep 19 2026 4:42 AM

Anganwadi Egg Supply Scam: Andhra Pradesh

అంగన్‌వాడీలో ఇచి్చన కోడిగుడ్డు బరువు 40 గ్రాములే ఉన్న దృశ్యం, 70 గ్రాములు బరువున్న బయట మార్కెట్‌లో దొరికే కోడిగుడ్డు

అంగన్‌వాడీలకు కోడిగుడ్ల కాంట్రాక్టులో భారీ అవినీతి

పిల్లల పొట్టగొట్టి సొమ్ము చేసుకుంటున్న పచ్చ ముఠాలు 

రాష్ట్రవ్యాప్తంగా సరఫరా కాంట్రాక్టర్లు అత్యధికులు టీడీపీ నేతలే

బయట దొరికే గుడ్లతో పోలిస్తే సగం బరువు కూడా లేనివి అంటగడుతూ బిల్లులు వసూలు 

చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించే పోషకాహారంలోనూ కాసుల వేట

రవాణా చార్జీలు మిగుల్చుకునేందుకు నెలకు ఒకసారే పంపిణీతో మురిగిపోతున్న గుడ్లు 

రాష్ట్రంలో 23.10 లక్షల మందికి ఏటా 69.30 కోట్ల గుడ్ల సరఫరాలో గోల్‌మాల్‌ 

నాణ్యత తనిఖీలు గాలికి వదిలేసిన చంద్రబాబు సర్కార్‌

బయట మార్కెట్‌లో దొరికే కోడిగుడ్డు బరువు సగటున 70 నుంచి 80 గ్రాములు. అదే అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేసే కోడిగుడ్ల బరువు 35 నుంచి 40 గ్రాముల లోపే! అంటే బయట గుడ్డుతో పోలిస్తే సగం కూడా లేదు. రాష్ట్రంలో అంగన్‌వాడీలకు కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్టు దక్కించుకున్న టీడీపీ నేతలు, అనుచరగణం నాసిరకం గుడ్లను అంటగ డుతూ రూ.వంద కోట్లకుపైగా అవినీతికి తెర తీశారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందించాల్సిన పోషకాహారానికి తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీల్లో గుడ్ల నమూనాలను సేకరించి బరువు, నాణ్యతా తనిఖీలు చేపట్టాలని లబి్ధదారులు డిమాండ్‌ చేస్తున్నారు.  

పశ్చిమ గోదావరి జిల్లాలో 1,626 అంగన్‌వాడీ కేంద్రాలకు నెలకు 21,69,225 గుడ్లు సరఫరా అవుతున్నాయి. అవి కేవలం 3540 గ్రాములు మాత్రమే ఉంటున్నాయని లబ్ధిదారులు చెబుతున్నారు.
శ్రీసత్యసాయి జిల్లాలో 2,824 అంగన్‌వాడీ కేంద్రాలకు నెలకు 21.50 లక్షల గుడ్లు సరఫరా చేస్తున్నారు. అక్కడ కూడా ఒక్కొక్కటి 3540 గ్రాములు లోపే ఉంటున్నాయి.
నెలకు 25 గుడ్లు ఇవ్వాల్సి ఉండగా.. తక్కువగా ఇవ్వడం, మార్కెట్‌లో రేటు పెరిగితే అంగన్‌వాడీలకు అరకొరగా సరిపెట్టడం, అన్ని చోట్లా చిన్న గుడ్లు ఇవ్వడం, పాడైనవి ఇవ్వడం పరిపాటిగా మారిందని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఒక గృహిణి వాపోయింది.

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏ అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి చూసినా అక్కడ అందించే కోడి గుడ్లు చిన్నబోతున్నాయి! అంగన్‌వాడీల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందాల్సిన పోషకాహారంలో అత్యంత కీలకమైన కోడి గుడ్ల సరఫరాలో భారీ అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయి. గుడ్ల సరఫరా కాంట్రాక్టులు దక్కించుకున్న టీడీపీ నేతలు నిర్దేశిత బరువు కలిగిన గుడ్లకు బదులుగా అందులో సగం కూడా లేని అతి చిన్న కోడిగుడ్లు పంపిణీ చేసి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. గుడ్లు చిన్నవే కానీ వాటి పేరుతో జరుగుతున్న దోపిడీ మాత్రం రూ.వంద కోట్లకుపైనే ఉండటం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీల్లో ఇదే దుస్థితి నెలకొంది. 

అంగన్‌వాడీల ద్వారా 3 నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులకు ఒక్కొక్కరికి నెలకు 25 గుడ్లు చొప్పున పంపిణీ చేయాలి. బాలింతలు, గర్భిణులకు ఇంటికే సరుకులతోపాటు 25 గుడ్లను అందచేయాలి. ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులకు పాలతోపాటు గుడ్లను ఇంటికే ఇవ్వాలి. వీరందరికీ కలిపి రాష్ట్రంలో 23.10 లక్షల మందికి నెలకు ఇవ్వాల్సిన గుడ్లు 5,77,50,000. అదే ఏడాదికి చూస్తే 69.30 కోట్ల గుడ్లు సరఫరా చేయాలి. కాంట్రాక్టు పొందిన టీడీపీ నేతలు బయట విక్రయించే వాటితో పోలిస్తే పరిమాణం, బరువులో సగం కూడా లేని కోడిగుడ్లను అంగన్‌వాడీలకు అంటగట్టి బిల్లులు దండుకుంటున్నారు. మరోవైపు రవాణా చార్జీలను మిగుల్చుకునేందుకు నెలలో ఒకటి రెండుసార్లు మాత్రమే అంగన్‌వాడీలకు వీటిని పంపిణీ చేస్తుండటంతో మురిగిపోయి వృథాగా మారుతున్నాయి. 

 

వెరీ బ్యాడ్‌.. పోషకాహారంపై పెను ప్రభావం!
కోళ్ల ఫారాల వద్ద గుడ్లను పరిమాణం బట్టి వేరు చేస్తారు (గ్రేడింగ్‌). సైజును బట్టి ధర నిర్ణయిస్తారు. సాధారణంగా మార్కెట్లో విక్రయించే వ్యాపారులు బరువు, పరిమాణం తక్కువగా ఉన్న వాటిని తీసుకోరు. అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కాంట్రాక్టర్లు మాత్రం తక్కువ ధరకు లభిస్తుండటంతో చిన్న గుడ్లను తీసుకుని అంగన్‌వాడీలకు అంటగడుతున్నారు. దీంతో కోడిగుడ్ల పరిమాణం తగ్గిపోయి పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందాల్సిన పోషకాహారంపై తీవ్ర ప్రభావం పడుతోంది. 

అంతా పచ్చ ముఠాలే..!
రాష్ట్రంలో 26 జిల్లాలకు ఒక్కో కాంట్రాక్టర్‌కు గుడ్డు సరఫరా బాధ్యతలు అప్పగించారు. వీరిలో అత్యధికులు టీడీపీ నేతలు, వారి అనుయాయులే. కాంట్రాక్టు ప్రకారం గుడ్డు ధర బాగానే చెల్లిస్తున్నా నాసిరకం అంటగడుతున్నారు. జాతీయ గుడ్డు సమన్వయ కమిటీ (నెక్‌) నిర్ధారించిన ధర ప్రకారం నెలవారీగా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తారు. ఉదాహరణకు గుడ్డు ధర సగటున రూ.6 ఉందనుకుంటే దానికి అదనంగా సరఫరా చేసినందుకు రవాణా చార్జీలు కింద ఒక్కో గుడ్డుకు రూ.1.10 చొప్పున కలిపి మొత్తం రూ.7.10 వరకు ఇస్తున్నారు.

అయినా సరే తృప్తి చెందకుండా గ్రేడింగ్‌లో నాసిరకం చిన్న గుడ్లును ఎంపిక చేసి అంగన్‌వాడీలకు పంపుతున్నారు. ఈ లెక్కన నెలకు 5,77,50,000 గుడ్లకు రూ.41 కోట్లకుపైగా చెల్లింపులు జరుగుతాయి. చిన్న గుడ్లు సరఫరా చేయడం, రవాణా చార్జీలు మిగుల్చుకోవడం లాంటి అక్రమాలకు పాల్పడటంతో ఒక్కో గుడ్డుపై రూ.2 చొప్పున నెలకు రూ.11.55 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయినట్టే! దీని ప్రకారం ఏడాదికి రూ.138 కోట్లకుపైగా దుర్వినియోగం అవుతోందని అంచనా. 

ఒకేసారి సరఫరాతో పాడైపోతున్న గుడ్లు..
మరోవైపు నిబంధనల మేరకు కాంట్రాక్టర్లు నెలలో నాలుగుసార్లు గుడ్లను సరఫరా చేయాల్సి ఉండగా ఒకటి రెండు దఫాల్లో సరిపుచ్చి రవాణా చార్జీలను నొక్కేస్తున్నారు. దీంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో రోజుల తరబడి నిల్వ ఉంటున్న కోడి గుడ్లు పాడైపోతున్నాయి. ఈ కారణం చెబుతూ అంగన్‌వాడీల్లో లబ్ధిదారులకు గుడ్లు అందించడం లేదనే ఫిర్యాదులున్నాయి. ఇక అంగన్‌వాడీలకు నాలుగు వారాలపాటు సరఫరా చేయాల్సిన గుడ్లకు నాలుగు వేర్వేరు రంగులు వేయాలనే నిబంధన సైతం గాలికి 
వదిలేశారు.

ప్రభుత్వం తక్షణం ఈ చర్యలు చేపడుతుందా?
రాష్ట్రవ్యాప్తంగా గుడ్ల నమూనాల సేకరణ
జిల్లాల వారీగా బరువు, నాణ్యతా తనిఖీలు
టెండర్‌ నిబంధనలతో సరఫరా గుడ్ల పోలిక

 సరఫరా రిజిస్టర్లు, బిల్లుల ఆడిట్‌
తక్కువ బరువు గుడ్లు వస్తే చెల్లింపుల పరిశీలన
నాణ్యతా లోపాలు నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు
నెలవారీ సరఫరా, తిరస్కరణ వివరాల ఆన్‌లైన్‌లో వెల్లడి
గుడ్ల సరఫరాపై జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీల బలోపేతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement