సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: గత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో టీడీపీ ఎంపీలు సానా సతీష్ బాబు, చింతకాయల విజయ్ పరుష పదజాలం ఉపయోగించడంపై వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. వారి తీరు సరికాదని రాజ్యసభ చైర్మన్‌కు, ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. రాజ్యసభలో జూలై 30న పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (అన్‌ఫెయిర్ మీన్స్ నిరోధక) సవరణ బిల్లు–2026పై చర్చ సందర్భంగా తాను ప్రసంగిస్తున్న సమయంలో సానా సతీష్ బాబు పదేపదే వైఎస్సార్‌సీపీని ఉద్దేశించి అభ్యంతరకర పదజాలం ఉపయోగించారని సుబ్బారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆ వ్యాఖ్యలు అభ్యంతరకరంగానే కాకుండా బెదిరింపులకు గురిచేసే విధంగా ఉన్నాయని ప్రస్తావించారు. ‘నా ప్రసంగానికి అంతరాయం కలిగించి, ఆలోచనాక్రమాన్ని దెబ్బతీసి, నా వాదనను సమర్థంగా వినిపించకుండా చేయడమే సానా సతీష్ చేసిన అభ్యంతరకరమైన వ్యాఖ్యల ఉద్దేశం’ అని వైవీ తెలిపారు. అలాగే, ఆగస్టు 5న సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు–2026పై చర్చ సందర్భంగా మరో టీడీపీ సభ్యుడు చింతకాయల విజయ్ సభా నిబంధనలకు విరుద్ధంగా పరుష పదజాలం ఉపయోగించారని సుబ్బారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇది రాజ్యసభ నిబంధనలను ఉల్లంఘించడమేనని స్పష్టంచేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు సహజమే అయినప్పటికీ సభలో ఒక సభ్యుడు ప్రసంగిస్తున్నప్పుడు తోటి సభ్యులు ఎవరైనా అభ్యంతరకరమైన లేదా బెదిరింపు వ్యాఖ్యలు చేయకూడదని సుబ్బారెడ్డి తెలిపారు. అది రాజ్యసభ సభ్యుడి భావప్రకటనా హక్కుకు భంగం కలిగించడమేనని స్పష్టంచేశారు. పార్లమెంటరీ నైతికత, సభా మర్యాదల ఉల్లంఘనపై పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజ్యసభ చైర్మన్‌కు, ప్రివిలేజ్ కమిటీకి వేర్వేరుగా ఫిర్యాదులు అందజేశారు.


