నాడు హేమాహేమీలు.. నేడు బ్యాక్‌ బెంచర్లు | Several senior TDP leaders unhappy in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

నాడు హేమాహేమీలు.. నేడు బ్యాక్‌ బెంచర్లు

Sep 19 2026 3:00 AM | Updated on Sep 19 2026 3:00 AM

Several senior TDP leaders unhappy in Andhra Pradesh

టీడీపీలో సీనియర్లకు పొగ.. లోకేశ్‌ కోటరీకే పట్టం  

సాక్షి, అమరావతి: ఒకప్పుడు చంద్రబాబు పక్కన కూర్చొని టీడీపీలో చక్రం తిప్పిన సీనియర్‌ నేతలను ఇప్పుడు పట్టించుకునే వారే లేకుండాపోయారు. తమకు పదవులు దక్కకపోగా, కనీస గౌరవం కూడా లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోకేశ్‌ సన్నిహితులు, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారు, తొలిసారి గెలిచిన వారు కీలక పదవుల్లో కూర్చొని హవా చెలాయిస్తుండడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తమకూ ఒక రోజు వస్తుందని, ఆ రోజు తమ సత్తా, విలువ ఏపాటిదో తెలిసొస్తుందని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. 

టీడీపీలో సీనియర్ల దుస్థితికి యనమల రామకృష్ణుడు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న ఆయనకు టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ మంత్రి పదవి దక్కింది. ఆరి్థక మంత్రిగా అత్యధికసార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. అలాంటి నేత ఇప్పుడు 42 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారి ఏ పదవీ లేకుండా మిగిలిపోయారు. తనకు రాజ్యసభకు వెళ్లాలని ఉందని బహిరంగంగా చెప్పుకున్నా చంద్రబాబు పట్టించుకోలేదు. కానీ, అదే సమయంలో ఆయన జిల్లాకే చెందిన, లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడైన సానా సతీష్ కు మాత్రం రెండో­సారి రాజ్యసభ సీటు కట్టబెట్టారు. తన సమకాలికుడిని, కష్టకాలంలో అండగా నిలిచిన సహచరుడిని చంద్రబాబు చివరి దశలో వదిలేశారనే చర్చ పార్టీలో నడుస్తోంది.  

నాడు మంత్రులు.. నేడు ఎమ్మెల్యేలు 
2014–19లో చంద్రబాబు కేబినెట్‌లో కీలక శాఖలు నిర్వహించిన చాలా మంది ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేలుగా మిగిలిపోయారు. నాడు డిప్యూటీ సీఎంగా, హోం మంత్రిగా పనిచేసిన నిమ్మకాయల చినరాజప్ప ఇప్పుడు పెద్దాపురం ఎమ్మెల్యే మాత్రమే. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, మంత్రిగా పనిచేసిన కిమిడి కళా వెంకట్రావుకు మంత్రివర్గంలో చోటు దక్కకపోగా, ప్రాధాన్యతే లేకుండా పోయింది. వ్యవసాయ మంత్రిగా పని చేసిన ప్రత్తిపాటి పుల్లారావు, మంత్రులుగా పనిచేసిన గంటా శ్రీనివాసరావు, పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వంటి వారిదీ అదే పరిస్థితి. 

సోమిరెడ్డిని కొత్త కమిటీల్లో జాతీయ అధికార ప్రతినిధిగా నియమించి అవమానించారనే చర్చ నడుస్తోంది. ఒకప్పుడు మంత్రిగా ఉన్న నేతకు ఇప్పుడు టీవీ డిబేట్లలో పార్టీ వాణి వినిపించే బాధ్యత అప్పగించారు. పార్టీలో అత్యంత సీనియర్‌ ఎమ్మెల్యేల్లో ఒకరైన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పొన్నూరు నుంచి పలుమార్లు గెలిచిన ధూళిపాళ్ల నరేంద్రలకు కూడా మంత్రి పదవి అందని ద్రాక్షగానే మిగిలింది. మరికొందరి పరిస్థితి ఇంకా అవమానకరంగా మారింది. పవన్‌ కళ్యాణ్‌ కోసం ఎమ్మెల్యే టికెట్‌ను వదిలేసిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మను కావాలని పక్కన పెట్టేశారు. ఆయన్ను టీడీపీ ఇన్‌చార్జి పదవి నుంచి కూడా పక్కకు తప్పించారు. గతంలో జల వనరుల మంత్రిగా చక్రం తిప్పిన దేవినేని ఉమాకు గత ఎన్నికల్లో టికెట్టే దక్కలేదు.

కొత్త వారికి మాత్రం కిరీటాలు
సీనియర్లను అవమానకరంగా పక్కనపెడుతూ.. కొత్త వారికి మాత్రం కిరీటాలు పెడుతుండడంతో వారు రగిలిపోతున్నారు. తొలిసారి ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్‌కు నేరుగా కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టారు. ఫిరాయింపు నేత లావు శ్రీకృష్ణదేవరాయలుకు లోక్‌సభలో పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ పదవి ఇచ్చారు. పార్టీ కమిటీల్లోనూ లోకేశ్‌ కోటరీకే పదవులు దక్కాయి. జాతీయ ప్రధాన కార్య­దర్శులుగా నియమితులైన కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు, బైరెడ్డి శబరి, కిలారు రాజేశ్‌ ముగ్గురూ లోకేశ్‌కు అనుయాయులే. 

జాతీయ ఉపాధ్యక్షుల్లో సానా సతీష్ , పీతల సుజాత, బుద్ధా వెంకన్న, నూకసాని బాలాజీ, బి.రాంగోపాల్‌ రెడ్డిలు లోకేశ్‌ సిఫార్సులతోనే పదవులు దక్కించుకున్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన భాష్యం రామకృష్ణ, సానా సతీష్ , చింతకాయల విజయ్‌ను రాజ్యసభకు పంపారు. ఏళ్ల తరబడి పార్టీ జెండా మోసి, క్లిష్ట సమయాల్లో చంద్రబాబు వెంట ఉన్న వారంతా ఇప్పుడు బ్యాక్‌ బెంచీలకు పరిమితమయ్యారు. తొలిసారి మంత్రులైన వారు రెండేళ్లయినా ఇంకా శాఖలపై పట్టు సాధించలేకపోతున్నారని సీనియర్లు విశ్లేషిస్తున్నారు. లోకేశ్‌ చుట్టూ ఉన్న కొద్ది మంది కోటరీ వ్యక్తులకే పదవులు వరిస్తున్నాయని వారు లోలోపల రగిలిపోతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement