హోమాలు, యాగాలు నిర్వహించాల్సిన స్థలంలో హోటల్ నిర్మాణమా?
ఓ ధర్మాత్ముడు శ్రీవారికి కానుకగా ఇచ్చిన స్థలమిది
రూ.3 వేల కోట్లు విలువ చేసే టీటీడీ స్థలాన్ని అప్పనంగా ఎలా అప్పగిస్తారు?
టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ నేత భూమన ఆగ్రహం
తిరుపతి మంగళం : శ్రీవారి పాదాల చెంత, హోమ యాగాదులు నిర్వహించాల్సిన ప్రాంతంలో ‘గో’ మాంసాన్ని వండి, వడ్డించే ఒబెరాయ్ హోటల్ నిర్మాణం చేపట్టడంపై వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అత్యంత పవిత్రమైన ఈ ప్రాంతంలో ఇలాంటి హోటల్ నిర్మాణం వద్దని అందరూ చెబుతున్నా సీఎం చంద్రబాబు మాత్రం కమీషన్ల కక్కుర్తితో తన పంతాన్ని వీడకుండా అనుమతులు ఇవ్వడం దుర్మార్గమని అన్నారు. అలిపిరి సమీపంలోని టీటీడీ స్థలంలో ఒబెరాయ్ హోటల్ నిర్మాణం చేపడుతున్నారన్న విషయం తెలుసుకున్న భూమన శుక్రవారం అక్కడికి వెళ్లి నిర్మాణ పనులను చూసి ఆవేదనకు గురయ్యారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓ భక్తుడు, ధర్మాత్ముడు శ్రీ వేంకటేశ్వరస్వామికి ఈ స్థలాన్ని కానుకగా అందించారని గుర్తు చేశారు. రూ. 3 వేల కోట్ల విలువైన ఈ స్థలాన్ని ఓ హోటల్‌కు అప్పనంగా ఎలా ఇచ్చేస్తారని నిలదీశారు. వేంకటేశ్వరస్వామి పరమ భక్తుడినని, తిరుమల పవిత్రతను కాపాడుతానంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు తిరుమల పవిత్రతను మంటగలుపుతున్నారని అన్నారు. టీటీడీ స్థలాన్ని చట్ట వ్యతిరేకంగా మార్చడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ, కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు పెడచెవినపెట్టి ఆ స్థలాన్ని హోటల్‌కు అప్పగించారని మండిపడ్డారు.
140 కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని అన్నారు. ఇక్కడ ఫైవ్ స్టార్ హోటల్ పేరుతో గో మాంసం వండివార్చడంతో పాటు మసాజ్ చేసే స్పా సెంటర్లను కూడా ఏర్పాటు చేయనున్నారని చెప్పారు. తిరుమల శ్రీవారి పవిత్రతను చంద్రబాబు మంటగలపక ముందే పూజ్యనీయులైన గురువులు, స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు స్పందించి అడ్డుకోవాలని ఆయన అభ్యర్థించారు. శ్రీవారి భక్తుడిగా, టీటీడీ మాజీ ఛైర్మన్‌గా దీనిపై తాను కోర్టును ఆశ్రయించనున్నట్లు ఆయన తెలిపారు.


