రాణీగారి తోటలో చంపేశారు | SIT Shocking Report On Sai Krishna Lock Up Death Case | Sakshi
Sakshi News home page

రాణీగారి తోటలో చంపేశారు

Sep 19 2026 3:57 AM | Updated on Sep 19 2026 3:57 AM

SIT Shocking Report On Sai Krishna Lock Up Death Case

కాపు యువకుడు సాయికృష్ణ కస్టోడియల్‌ మృతిపై ‘సిట్‌’ సంచలన అంశాలు

దారుణ హింసతో మే 12న ప్రాణాలు కోల్పోయాడు 

మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి బైక్‌పై అర్ధరాత్రి శ్మశానవాటికకు తరలించారు 

మృతదేహం పూర్తిగా కాలిపోయే వరకూ సీఐ నాగరాజు, ఇతర నిందితులు అక్కడే ఉన్నారు 

ఆధారాలు అన్నింటినీ తుడిచేసే కుట్ర పన్నారు 

కుటుంబంతో రాజీకి ప్రయత్నించారు 

హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ ఉపసంహరణకు ప్రలోభపెట్టారు 

అరెస్టయిన ఏ4 సురేష్‌ రిమాండ్‌ రిపోర్ట్‌లో వెల్లడించిన సిట్‌ 

తనను చంపేందుకే కొడుతున్నారని సాయికృష్ణ చావుకేకలు

విజయవాడ లీగల్‌:  కాపు యువకుడు సాయికృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి.  విజయవాడ రాణీగారితోటలోని పాడుబడిన భవ­నంలో సాయికృష్ణను దారుణంగా కొట్టి చంపినట్లు సిట్‌ దర్యాప్తులో వెల్లడైంది. తనను చంపేందుకే కొడుతున్నారని సాయికృష్ణ తీవ్ర గాయాలతో దయనీయంగా వాపోయినప్పటికీ నిందితులు కనికరం చూపలేదని స్పష్టమైంది. అనంతరం మృతదేహాన్ని అర్ధరాత్రి బైక్‌పై శ్మశానవాటికకు తరలించి దహనం చేశారని, మృతదేహం పూర్తిగా కాలిపోయే వరకు ప్రధాన నింది­తుడు సీఐ నాగరాజుతో సహా నిందితులు అందరూ అక్కడే ఉన్నారని వెల్లడైంది. 

అరెస్టయిన ఏ4 సురేష్‌ రిమాండ్‌ రిపోర్ట్‌లో సిట్‌ పేర్కొన్న విస్తుపోయే సంచలన అంశాలు... ‘మే 7న పోలీస్‌స్టేషన్‌లో సీఐ నాగ­రాజు, హెడ్‌ కానిస్టేబుల్‌ అశోక్, నాని దారుణంగా సాయికృష్ణ­ను కొట్టారు.  గాయాలపాలైన సాయికృష్ణను సీఐ నాగరాజు ఆదేశాల­తో రాణిగారి తోటలోని పాత పాడుబడిన భవనానికి తరలించా­రు. మే 12న సీఐని కలవడానికి వెళ్లిన తాను రాణీగారితోట పాత భవనంలో అత్యంత దయనీయ స్థితిలో ఉన్న సాయికృష్ణను చూసినట్లు ఏ4 సురేష్‌ పేర్కొన్నాడు. తనను చంపేందుకే కొడుతున్నారని  సాయి­కృష్ణ తీవ్ర గాయాలతో దయనీయస్థితిలో తనకు చెప్పినట్లు కూడా వెల్లడించాడు. 

సురేష్ తో మాట్లాడుతున్న సమయంలోనే సాయికృష్ణ స్పృహతప్పి పడిపోయి మరణించాడు. మే 12న అర్ధరాత్రి సాయికృష్ణ మృతదేహాన్ని మోటార్‌ సైకిల్‌పై దుప్పట్లో చుట్టి స్వర్గపురి శ్మశానవాటికకు తరలించి సీఐ నాగరాజు, హెడ్‌ కానిస్టేబుల్‌ అశోక్, సురేష్‌ కలిసి దహనం చేశారు. మృతదేహం పూర్తిగా కాలిపోయే వరకు వారు స్వర్గపురిలో ఉన్నారు.  మే 18న సురేష్‌ స్వర్గపురికి  వెళ్ళి మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయా? అని పరిశీలించి వచ్చాడు.  సీఐ నాగరాజు ఆదేశాలతోనే సాయికృష్ణ కస్టడీలో ఉన్నప్పుడు తీసిన ఫోటోలను డిలీట్‌ చేశాడు. 

సురేష్‌ సీఐ నాగరాజుతో కలిసి నైట్‌రౌండ్స్‌కు కూడా వెళ్లేవాడు. నాగరాజుతో సురేష్ కు 2010 నుంచి పరిచయం ఉంది. వీరిద్దరి మధ్య సన్నిహిత స్నేహం ఉంది. హైకోర్టులో వేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని బాధితుడి బంధువులను కూడా నిందితులు బెదిరించి ప్రలోభపెట్టారని దర్యాప్తులో తేలింది.  ఈ క్రమంలో  సాయికృష్ణ మేనమామ ముళ్లపూడి నవరంగ్‌ను సురేష్‌  సంప్రదించి రాజీకి ప్రయత్నించాడు. మే 31న కొలనుకొండ గ్రామంలోని మోడల్‌ డెయిరీ వద్ద నవరంగ్‌ను సురేష్‌ కలిసి మాట్లాడారు. పరిహారంపై మాట్లాడేందుకు ప్రయత్నించాడు. 

అయితే నవరంగ్‌ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. కేసు నమోదు, ఎ–1 అరెస్టు అనంతరం సురేష్ , ఎ–2, ఎ–3 కలిసి విజయవాడ నుంచి హైదరాబాద్, అక్కడి నుంచి నాగ్‌పూర్‌కు వెళ్లారు. తన మొబైల్‌ ఫోన్‌ ద్వారా పోలీసులు తన ఆచూకీ తెలుసుకోకుండా ఉండేందుకు దానిని మార్గమధ్యంలో కాలువలో పడేసినట్లు సురేష్‌ వెల్లడించాడు.  సెపె్టంబర్‌ 18న సురేష్ ను రాణిగారితోటలోని పాత భవనం వద్దకు తీసుకెళ్లగా, సాయికృష్ణను ఉంచిన ప్రదేశాన్ని అతడు గుర్తించాడు. అనంతరం స్వర్గపురి శ్మశానవాటికలోని కలప దహన ప్రాంతంలో  మృతదేహాన్ని దహనం చేసినట్లు సురేష్‌ గుర్తించాడు. 

సురేష్‌ ఇచ్చిన సమాచారంతో రెండు ద్విచక్రవాహనాలను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. సురేష్‌ వెల్లడించిన వివరాలకు కాల్‌ డీటైల్‌ రికార్డులు , సాంకేతిక విశ్లేషణ, సంబంధిత కాలంలో ఎ–1, ఎ–2, ఎ–4 మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణలు, అలాగే మోడల్‌ డెయిరీ పరిసరాల్లోని సీసీటీవీ దృశ్యాలు  ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకూ సాయికృష్ణను స్టేషన్‌లోనే కొట్టి చంపారనే అభిప్రాయం ఉండగా,  ఇప్పుడు ఒక పాడుపడిన భవనంలో చంపినట్లు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొనడం గమనార్హం.

రిమాండ్‌కు సురేష్‌ 
సాయికృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసులో మూడు నెలలుగా  పరారీలో ఉన్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఏ–4  గులివిందల సురేష్ ను సిట్‌ అధికారులు ఎట్టకేలకు అరెస్టు చేసి  శుక్రవారం న్యాయస్థానంలో హాజరుపరిచారు.   లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ జారీ కావడంతో సిట్‌ ఎదుట లొంగిపోయిన సురేష్ ను అరెస్ట్‌ చేసి విచారించిన పోలీసులు అనంతరం 2వ అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజి్రస్టేట్‌ కోర్టులో ప్రవేశ పెట్టారు.  సాక్షులను ప్రభావితం చేయకుండా నిందితుడికి రిమాండ్‌ విధించాలని కోరారు. దీంతో ఫస్ట్‌ క్లాస్‌ మేజి్రస్టేట్‌ ఎస్‌.శ్రీకాంత్‌ నిందితునికి సెపె్టంబర్‌ 24 వరకు రిమాండ్‌ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం నిందితుడిని నూజివీడు జైలుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement