వార్డుల పునర్విభజనలో తీవ్ర లోపాలు | YSRCP complaint to the State Election Commission | Sakshi
Sakshi News home page

వార్డుల పునర్విభజనలో తీవ్ర లోపాలు

Sep 19 2026 4:50 AM | Updated on Sep 19 2026 4:50 AM

YSRCP complaint to the State Election Commission

కాలనీలు, సరిహద్దులు, డోర్‌ నంబర్ల వరుస క్రమాన్ని పరిగణనలోకి తీసుకోలేదు

ఒకే వీధి, కాలనీకి చెందిన ఓటర్లను వేర్వేరు వార్డుల్లోకి విభజించారు

ఇవి క్లరికల్‌ పొరపాట్లు కాదు.. విస్తృత సమస్యకు సంకేతాలు

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

పునర్విభజనపై సమగ్రంగా రాష్ట్రస్థాయి సమీక్ష నిర్వహించాలి

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పలు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో జరుగుతున్న వార్డుల పునర్విభజన ప్రక్రియలో చోటుచేసుకున్న లోపాలను సరిదిద్దాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను వైఎస్సార్‌సీపీ కోరింది. వార్డుల సరిహద్దుల ఖరారులో గుర్తింపు పొందిన కాలనీలు, సహజ సరిహద్దులు, డోర్‌ నంబర్ల వరుస క్రమాన్ని తగిన విధంగా పరిగణనలోకి తీసుకోలేదని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ)కు ఆయన లేఖ రాశారు. 

వివిధ ప్రాంతాల నుంచి తమ­కు అందిన ఫిర్యాదుల ప్రకారం.. ఒకే వీధి, కాలనీ లేదా నివాస ప్రాంతానికి చెందిన ఓటర్లను వేర్వేరు వార్డుల్లోకి విభజించారని లేఖలో పేర్కొన్నారు. అదే సమయంలో భౌగోళికంగా దూరంగా ఉన్న, పరస్పర సంబంధంలేని ప్రాంతాలను ఒకే వార్డులో కలిపినట్లు తెలిపారు. దీనివల్ల ఓటర్లకు, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు గందరగోళం, అసౌకర్యం ఏర్పడే పరిస్థితి ఉందని అందులో పేర్కొన్నారు. లేఖతో­పాటు అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి గ్రామ పంచాయతీ, తెనాలి మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజనలో జరిగిన అవకతవకలను ఆధారాలతో సహా అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి సమర్పించారు. 

సరిహద్దులు ఓటర్లకు సౌకర్యవంతంగా ఉండాలి..
ప్రసన్నాయపల్లి గ్రామ పంచాయతీని 2026 ఓటర్ల జాబితా ప్రకారం 14 వార్డులుగా విభజించారు. అయితే, ఒకే ప్రాంతానికి, ఒకే కుటుంబాలకు చెందిన ఓటర్లను వేర్వేరు వార్డుల్లోకి చెల్లాచెదురు చేశారు. కొన్ని వార్డులు గ్రామంలోని వేర్వేరు ప్రాంతాలను కలిపి కవర్‌ చేస్తున్నాయని, దీనివల్ల స్థానికంగా గందరగోళం నెలకొంటోందని అప్పిరెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే, తెనాలి మున్సిపాలిటీలోనూ ఇదే తరహా సమస్యలున్నాయని తెలిపారు. 

2026 ఆగస్టు 14న జారీచేసిన ప్రొసీడింగ్స్‌ ద్వారా వార్డుల సంఖ్యను 40 నుంచి 52కి పెంచారని.. ముఖ్యంగా 28, 30, 35, 42, 52 వార్డుల్లో లోపాలు గుర్తించినట్లు ఆయన వివరించారు. ఒకే చిరునామాలో, ఒకే ప్రాంతంలో నివసిస్తున్న ఓటర్లను వేర్వేరు వార్డుల్లో చేర్చారని.. ఈ ఫిర్యాదులను కేవలం క్లరికల్‌ పొరపాట్లుగా పరిగణించరాదని, ఇవి విస్తృతమైన సమస్యకు సంకేతాలని ఆయన పేర్కొన్నారు. వార్డుల సరిహద్దులు స్పష్టంగా, భౌగోళికంగా, సులభంగా గుర్తించదగినవిగా, ఓటర్లకు సౌకర్యవంతంగా ఉండేలా నిర్ణయించాల్సి ఉందన్నారు.

లోపాలను నిష్పక్షపాతంగా సరిదిద్దాలి
వైఎస్సార్‌సీపీ తరఫున రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేళ్ల అప్పిరెడ్డి పలు సూచనలు చేశారు. వార్డుల పునర్విభజనపై సమగ్రంగా రాష్ట్రస్థాయి సమీక్ష నిర్వహించాలని, ఒకే భౌగోళిక యూనిట్‌కు చెందిన ఓటర్లను సంబంధిత వార్డులోనే ఉంచాలని కోరారు. సరైన భౌగోళిక ప్రాతిపదిక లేకుండా వేర్వేరు ప్రాంతాలను ఒకే వార్డులో కలపకూడదని విజ్ఞప్తి చేశారు. అలాగే, క్షేత్రస్థాయిలో కమిషన్‌ పరిశీలించి అభ్యంతరాలను, లోపాలను నిష్పక్షపాతంగా సరిదిద్దాలని కోరారు. సవరించిన వార్డు మ్యాప్‌లు, ఓటర్ల జాబితాలను ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచాలని, అభ్యంతరాలు పరిష్కారం కాని ప్రాంతాల్లో తుది ప్రక్రియను నిలిపివేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పారదర్శకమైన వార్డుల పునర్విభజన ప్రక్రియను నిర్ధారించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తక్షణమే జోక్యం చేసుకోవాలని లేళ్ల అప్పిరెడ్డి తన లేఖలో కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement