మంచి చదువు.. మంచి జాబ్.. మంచి జీతం.. ఇవన్నీ ఉన్నా కొంతమందికి ఆ ఉద్యోగంలో సంతోషం ఉండదు. రోజూ ఎదురయ్యే పని ఒత్తిడి, ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల చివరకు మనశ్శాంతి కరువైపోతుంది. యూకేకు చెందిన 30 ఏళ్ల లిజ్ ఈస్ట్ విషయంలోనూ ఇదే జరిగింది.
లిజ్ క్రిమినల్ డిఫెన్స్ లాయర్‌గా నాలుగేళ్లు పనిచేశారు. ఆ సమయంలో కోర్టులకు వెళ్లడం, జైళ్లకు వెళ్లడం, క్లయింట్లతో మాట్లాడటం, ఆఫీస్ పనులు చేయడం ఇలా రోజంతా బిజీగా ఉండేవారు. మొదట్లో ఉద్యోగం బాగానే అనిపించినా.. రోజులు గడిచేకొద్దీ పని ఒత్తిడి ఆమెను బాగా ఇబ్బంది పెట్టింది. రోజూ ఇంత ఒత్తిడితోనే జీవించాలా?, ఇదేనా తన జీవితం?, అని ఆమె ఆలోచించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా లండన్‌లోని పని సంస్కృతి, ఎక్కువ గంటలు పని చేయడం, రాత్రి ఆలస్యంగా ఇంటికి వెళ్లడం తనకు నచ్చలేదని లిజ్ చెప్పారు.
భర్తను చూసి వచ్చిన ఆలోచన
లిజ్ భర్త డాగ్ వాకింగ్, డాగ్ బోర్డింగ్ చేస్తుంటాడు. అతను తన పనిని ఎంతో ఇష్టంగా చేస్తుండటాన్ని లిజ్ గమనించారు. తాను మాత్రం ప్రతి వీకెండ్ పని చేయడానికి భయపడుతుంటే.. తన భర్త మాత్రం ఎంతో ఉత్సాహంగా పని చేస్తున్నాడని ఆమెకు అనిపించింది. దీంతో చివరకు లాయర్ ఉద్యోగాన్ని వదిలేసి డాగ్ వాకింగ్ బిజినెస్ ప్రారంభించాలని నిర్ణయించుకుంది.
అయితే.. కొత్త బిజినెస్ మొదలుపెట్టిన వెంటనే ఆదాయం రావడం కష్టం కాబట్టి, ఖర్చుల కోసం కొంతకాలం స్థానిక పబ్‌లో ఉద్యోగం చేశారు. మరోవైపు తన డాగ్ వాకింగ్ బిజినెస్ కోసం కస్టమర్లను సంపాదించడం మొదలుపెట్టారు.
రోజుకు రూ.51 వేలు!
లిజ్ ప్రయత్నం వృథా కాలేదు. ఏడాది తిరిగేలోపే ఆమెకు రెగ్యులర్ కస్టమర్లు పెరిగిపోయారు. ఇప్పుడు రోజుకు నాలుగు గ్రూప్ వాక్స్ నిర్వహిస్తోంది. రోజూ సుమారు 20 నుంచి 30 కుక్కలను చూసుకుంటోంది. ఒక్క కుక్కకు గంటకు సుమారు 14 పౌండ్లు అంటే దాదాపు రూ.1,800 చార్జ్ చేస్తోంది. దీంతో రోజుకు ఆమె టర్నోవర్ 300 నుంచి 400 పౌండ్ల వరకు ఉంటోంది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.38 వేల నుంచి రూ.51 వేల వరకు.
అంతేకాదు.. లాయర్‌గా పనిచేసినప్పుడు కంటే ఇప్పుడు నెలకు ఎక్కువ సంపాదిస్తున్నానని లిజ్ చెబుతోంది. ముఖ్యంగా గతంలో పనిచేసిన సమయంతో పోలిస్తే ఇప్పుడు సగం గంటలే పనిచేస్తున్నానని చెప్పింది.
లాయర్ ఉద్యోగం వదిలి కుక్కలు నడిపే పని చేయడంతో కొంతమంది ఆమెను విమర్శించారు. ఇంత చదువుకుని చివరకు డాగ్ వాకర్‌గా మారావా? అంటూ ప్రశ్నించారు. అయితే వారి మాటలను లిజ్ పట్టించుకోలేదు. లా చదివిన ఆరేళ్లలో తాను చాలా విషయాలు నేర్చుకున్నానని, అవి ఇప్పటికీ తన జీవితంలో ఉపయోగపడుతున్నాయని చెబుతోంది.
డబ్బు కోసం పని చేయొద్దు
డాగ్ వాకింగ్ ద్వారా ఇప్పుడు మంచి ఆదాయం వస్తున్నప్పటికీ.. డబ్బు కోసమే ఈ పని ఎంచుకోవద్దని లిజ్ అంటున్నారు. కుక్కలను నిజంగా ఇష్టపడాలి, బయట తిరుగుతూ పనిచేయడం ఇష్టంగా ఉండాలని చెబుతోంది.
తనకు మాత్రం ఇప్పుడు ఉదయం లేచి పనికి వెళ్లడం చాలా సంతోషంగా ఉంటుందని లిజ్ చెబుతోంది. గతంలో ఉద్యోగానికి వెళ్లాలంటే ఒత్తిడిగా అనిపించేదని, ఇప్పుడు మాత్రం తన పని అంటే ఎంతో ఇష్టమని అంటోంది. తన దగ్గర లా డిగ్రీ ఎప్పటికీ ఉంటుందని.. భవిష్యత్తులో అవసరమైతే మళ్లీ లీగల్ రంగంలోకి వెళ్లొచ్చని లిజ్ చెబుతోంది. అయితే.. ప్రస్తుతం చేస్తున్న పనిని తాను ఎంతగానో ఇష్టపడుతున్నందున, తిరిగి లాయర్‌గా పనిచేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ఊహించని షాక్.. పని వేగంగా చేయడమే శాపమైంది!


