ఊహించని షాక్.. పని వేగంగా చేయడమే శాపమైంది! | Made The Mistake Of Being Too Fast Employee Shares Experience | Sakshi
Sakshi News home page

ఊహించని షాక్.. పని వేగంగా చేయడమే శాపమైంది!

Sep 20 2026 8:01 PM | Updated on Sep 20 2026 8:01 PM

Made The Mistake Of Being Too Fast Employee Shares Experience

కార్పొరేట్ ఉద్యోగాల్లో పని వేగంగా, సమర్థవంతంగా పూర్తి చేయడానికి టెక్నాలజీని ఉపయోగించడం సాధారణమే. అయితే.. కొన్నిసార్లు మన పనిని సులభం చేసుకునేందుకు చేసిన ప్రయత్నమే మనపై మరింత పని భారం పడేలా చేయొచ్చు. ఇలాంటి అనుభవమే ఓ ఉద్యోగికి ఎదురైంది. తన పనిలోని ఒక రొటీన్ ప్రక్రియను ఆటోమేట్ చేసి సమయాన్ని ఆదా చేసుకున్న ఆ ఉద్యోగి.. ఆ విషయాన్ని మేనేజర్‌తో పంచుకున్న తర్వాత, అదనపు బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపాడు.

ఉద్యోగి వారానికి చేసే రిపోర్టింగ్ పని చాలా సమయం తీసుకునేదట. డేటాను సేకరించడం, దాన్ని ఫార్మాట్ చేయడం వంటి పనుల కోసం వారానికి సుమారు 15 గంటలు వెచ్చించాల్సి వచ్చేది. దీంతో.. ఒక వారాంతంలో కూర్చొని చిన్న స్క్రిప్ట్ తయారు చేశాడు. దాని ద్వారా డేటా సేకరణ, ఫార్మాటింగ్ మొత్తం ఆటోమేటిక్‌గా జరిగేలా చేశాడు. ఫలితంగా 15 గంటలు పట్టే పని ఒక్క నిమిషంలోపే పూర్తయ్యేది. మిగిలిన సమయాన్ని కొత్త విషయాలు నేర్చుకోవడానికి, ఒత్తిడి లేకుండా పని చేసేందుకు ఉపయోగించుకున్నాడు.

తాను చేసిన పనిని చూసి మేనేజర్ మెచ్చుకుంటారని, భవిష్యత్తులో ప్రమోషన్ లేదా జీతం పెంపు వచ్చే అవకాశం ఉంటుందని భావించిన ఉద్యోగి.. తన ఆటోమేషన్ గురించి మేనేజర్‌కు చెప్పాడు. కానీ అక్కడే పరిస్థితి మారిపోయింది.

అతనికి ఇటీవల ఉద్యోగం వదిలి వెళ్లిన ఓ సీనియర్ ఉద్యోగి పనిని కూడా అప్పగించారు. అంతేకాకుండా ఇతర ఉద్యోగులు చేస్తున్న పనులను కూడా ఆటోమేట్ చేయాలని బాధ్యత ఇచ్చారు. దీంతో ఇంతకుముందు ఒత్తిడి లేకుండా ఉన్న పని.. వారానికి దాదాపు 50 గంటల పనిగా మారిందని, అయితే జీతం మాత్రం అదే స్థాయిలో ఉందని ఆ ఉద్యోగి చెప్పాడు.

ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఉద్యోగులు తమకు కూడా ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయని చెప్పారు. పని వేగంగా పూర్తి చేస్తే.. దానికి గుర్తింపు రావడం కంటే, మరింత పని అప్పగించే అవకాశం ఉంటుందని పలువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement