హైదరాబాద్: అప్పులు, ఆర్థికసమస్యల కారణంగా ఓ యువకుడు స్టీల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్ మధుబాబు తెలిపిన మేరకు.. పార్శిగుట్టకు చెందిన సోమరపు మనోజ్‌కుమార్ (29) ఇంటింటికీ తిరిగి రక్తపరీక్ష నమూనాలు సేకరిస్తూంటాడు. ఆర్థిక ఇబ్బందులతో పాటు అప్పుల బాధ తాళలేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో శుక్రవారం వీఎస్టీ స్టీల్ బ్రిడ్జి పైకి చేరుకుని తన ద్విచక్ర వాహనంపై మొబైల్ ఫోన్ ఉంచి బ్రిడ్జిపై నుంచి దూకాడు. తల, కాళ్లు చేతులకు తీవ్రగాయాలు కావడంతో తీవ్రరక్తస్రావమై అక్కడిక్కడే మృతి చెందాడు.
పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. మొబైల్‌లో మరణానికి గల కారణాలను టైప్ చేసి పెట్టాడు. తన కష్టకాలంలో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అప్పులు ఇచ్చి ఆదుకున్న వారందరికీ ధన్యవాదాలు అని తెలుపుతూ తన ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమని రాసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో ఒక్కడే ఉంటున్నాడు. ఈ సంఘటనతో స్టీల్ బ్రిడ్జిపై కాసేపు తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కాగా మృతదేహాన్ని అక్కకు అప్పజెప్పినట్లు పోలీసులు తెలిపారు.


