జర్మన్ కంపెనీ కీలక నిర్ణయం! | Porsche Could Face Another 4100 Job Cuts | Sakshi
Sakshi News home page

జర్మన్ కంపెనీ కీలక నిర్ణయం!

Sep 20 2026 4:03 PM | Updated on Sep 20 2026 4:23 PM

Porsche Could Face Another 4100 Job Cuts

జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ తన వ్యాపారాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు భారీ మార్పులకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా స్పోర్ట్స్ కార్ల బ్రాండ్ పోర్షేలో మరో 4,100 ఉద్యోగాలను తగ్గించే ప్రతిపాదన ఉన్నట్లు జర్మన్ బిజినెస్ డైలీ హాండెల్స్‌బ్లాట్ నివేదించింది.

పోర్షేలో ఉద్యోగాల కోత ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికే 4,000 ఉద్యోగాల కోతకు నిర్ణయం తీసుకోగా, జూలైలో మరో 5,000 ఉద్యోగాలను తగ్గించేందుకు యాజమాన్యం, కార్మిక ప్రతినిధులు అంగీకరించారు. తాజాగా నివేదించిన 4,100 ఉద్యోగాల కోత కూడా అమల్లోకి వస్తే.. సంస్థలో ఉద్యోగుల సంఖ్యపై గణనీయమైన ప్రభావం పడనుంది. అయితే.. దీనిపై ఫోక్స్‌వ్యాగన్, పోర్షే అధికారికంగా స్పందించలేదు.

పోర్షేకు ప్రధానంగా చైనా మార్కెట్‌లో అమ్మకాలు తగ్గడం, ఎలక్ట్రిక్ వాహనాల వ్యూహంలో మార్పుల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిణామాల ప్రభావం ఫోక్స్‌వ్యాగన్‌పై కూడా పడింది. దీంతో కంపెనీ తన పూర్తి ఏడాది ఆపరేటింగ్ మార్జిన్ అంచనాను గతంలో ఉన్న 4.0-5.5 శాతం నుంచి గరిష్ఠంగా 1 శాతానికి తగ్గించింది. పోర్షేలో ఆస్తుల విలువ తగ్గింపుతో పాటు ఇతర సమస్యలు ఇందుకు కారణమయ్యాయి.

ఇప్పుడు పోర్షే సీఈఓ మైఖేల్ లైటర్స్ ముందు సంస్థను తిరిగి వృద్ధి బాటలోకి తీసుకురావడం ప్రధాన సవాలుగా మారింది. చైనాలో అమ్మకాలను పెంచడం, ఎలక్ట్రిక్ వాహనాల వ్యూహాన్ని సరిచేయడం, ఖర్చులను తగ్గించడం వంటి అంశాలపై కంపెనీ దృష్టి పెట్టాల్సి ఉంది. ఉద్యోగాల కోతలతో ఖర్చులను నియంత్రించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. పోర్షేను తిరిగి బలమైన స్థితిలోకి తీసుకురావడమే ఫోక్స్‌వ్యాగన్ ముందున్న అసలు సవాలుగా కనిపిస్తోంది.

ఇదీ చదవండి: సంపద సృష్టికి బఫెట్ చెప్పిన సూత్రాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement