ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. దిగ్గజ కంపెనీలు తమ పని విధానాన్ని మార్చుకుంటున్నాయి. ఒకప్పుడు ఉద్యోగులకు సహాయపడే టెక్నాలజీగా ఉన్న ఏఐ.. ఇప్పుడు కొన్ని ఉద్యోగాలనే భర్తీ చేసే స్థాయికి ఎదిగింది. ఈ ప్రభావం తాజాగా ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ వీసా(Visa)లో స్పష్టంగా కనిపించింది.
సంస్థ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,600 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది మొత్తం ఉద్యోగుల్లో సుమారు 7 శాతం. ఈ నిర్ణయం భారత్‌లోని బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై వంటి టెక్ సెంటర్లపైనా ప్రభావం చూపింది.
షాకిచ్చిన మెయిల్
జూలై 29 తెల్లవారుజామున కొంతమంది ఉద్యోగులకు.. ఉదయం 4 నుంచి 5 గంటల మధ్య ఈ-మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ చూసిన తర్వాతే తమ ఉద్యోగం పోయిందని వారికి తెలిసింది. కొన్ని రోజుల్లోనే ఆఫీస్ సిస్టమ్‌లకు యాక్సెస్ నిలిపివేయడంతో పాటు, ల్యాప్‌టాప్‌లు, ఐడీ కార్డులను కూడా వెనక్కి తీసుకున్నారు.
భారత్‌లో వీసాకు 3,500 మందికిపైగా ఉద్యోగులు ఉన్నప్పటికీ.. ఎంతమందిని తొలగించారనే విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే.. ఒక టెక్నాలజీ టీమ్‌లో 28 మందిలో 10 మందిని తొలగించినట్లు సమాచారం. వీరిలో సీనియర్ డైరెక్టర్లు, ఇంజినీరింగ్ మేనేజర్లు కూడా ఉండటం గమనార్హం.
చాలామంది అనుకునేలా కంపెనీ నష్టాల్లో లేదని వీసా స్పష్టం చేసింది. వ్యాపారం సజావుగానే సాగుతున్నప్పటికీ, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా.. సంస్థను మార్చుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం కంపెనీ దృష్టి మొత్తం ఏఐ మీదనే ఉంది.
వీసా మాత్రమే కాదు!
ఏఐ కారణంగా ఉద్యోగాల కోత విధిస్తున్న కంపెనీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, మెటా, ఒరాకిల్, సిస్కో, క్లౌడ్‌ఫ్లేర్, పేపాల్, అట్లాసియన్, స్టాండర్డ్ చార్టర్డ్ వంటి సంస్థలు కూడా ఉద్యోగులను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. పేమెంట్స్ రంగంలో వీసాకు ప్రధాన ప్రత్యర్థి అయిన మాస్టర్కార్డ్ కూడా ఈ ఏడాది సుమారు 4 శాతం ఉద్యోగులను తగ్గించనున్నట్లు తెలిపింది. అలాగే అమెజాన్ వేల సంఖ్యలో కార్పొరేట్ ఉద్యోగాలను తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది.
ఇదీ చదవండి: జియో రీఛార్జ్.. బడ్జెట్ నుంచి యాన్యువల్ ప్లాన్స్ వరకు!


