ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు.. కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన సూచన చేసింది. గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఉన్న ప్రతి వినియోగదారు తప్పనిసరిగా ఈకేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయాలని వెల్లడించింది.
నిజానికి ఈకేవైసీ పూర్తి చేయడానికి 2026 జూలై 31 వరకు గడువు ఇచ్చారు. కానీ.. తర్వాత వినియోగదారుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ గడువును ఆగస్టు 16 వరకు పొడిగించారు. అయితే ఈ తేదీని పొడిగిస్తారా?, లేదా? అనే విషయం అధికారికంగా వెల్లడికాలేదు. కాబట్టి గడువు లోపల గ్యాస్ వినియోగదారులు ఈకేవైసీ చేయించుకోవాలన్నమాట.
ఈకేవైసీ పూర్తి చేయకపోతే.. భవిష్యత్తులో గ్యాస్ సిలిండర్ బుకింగ్, డెలివరీ వంటివాటిలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం అందించే గ్యాస్ సబ్సిడీపై.. కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన వంటి పథకాల ద్వారా అర్హులైన వినియోగదారులకు వచ్చే సబ్సిడీ నిధులు ఈకేవైసీ పూర్తికాకపోతే నిలిచిపోయే పరిస్థితి ఏర్పడవచ్చు. కాబట్టి వినియోగదారులు ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి.
అయితే.. ఈకేవైసీ పూర్తి చేసిన తర్వాత మళ్లీ సబ్సిడీ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది. అందువల్ల గ్యాస్ సబ్సిడీ ఆగిపోకుండా ఉండాలన్నా, సిలిండర్ సరఫరాలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలన్నా ప్రతి వినియోగదారు ఈ ప్రక్రియను పూర్తి చేయడం మంచిది.
ఈకేవైసీ చేయడానికి వినియోగదారులు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గ్యాస్ పంపిణీ సంస్థలు మూడు సులభమైన మార్గాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఒకటి.. వినియోగదారులు తమ గ్యాస్ ఏజెన్సీ లేదా పంపిణీ సంస్థ ద్వారా ఇంటి వద్ద నుంచే ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. రెండవది, నేరుగా గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి ఆధార్ ఆధారిత ధృవీకరణతో ప్రక్రియ పూర్తి చేయవచ్చు. మూడవది, సిలిండర్ డెలివరీకి వచ్చే సిబ్బంది వద్ద ఉండే బయోమెట్రిక్ పరికరం ద్వారా కూడా ఈకేవైసీ చేయించుకోవచ్చు.


